The landmarks are alive……………………………………………
ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో భౌద్ధమతం విలసిల్లింది. ఇప్పటికి ఆ ఆనవాళ్లు సజీవంగా ఉన్నాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో చందవరం, మోటుపల్లి, కనపర్తి వంటి ప్రదేశాల్లో బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి.చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు.
క్రీస్తు పూర్వం 2 వ శతాబ్దంలో ఇక్కడ ఆరామాలు నిర్మించారు. ఈ చందవరం సుమారు 800 ఏళ్ల పాటు ధార్మిక కేంద్రంగా, హీనయాన బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది. ఈ ఆరామాలను శాతవాహన వంశీయులు నిర్మించారు. వేల ఏళ్ళక్రితం బౌద్ధులు ధాన్యకటకం (అమరావతి) నుండి పుష్పగిరి – కంచి – రామేశ్వరం మీదుగా శ్రీలంక కు పెద్ద సంఖ్యలో వెళ్ళే వారు. అలాగే వారణాసి నుంచి కంచి వెళ్లేవారు.వారందరికీ ఈక్షేత్రం విశ్రాంతి కేంద్రంగా ఉండేది.
బౌద్ధ స్థూపం ఉన్న ఈ కొండను “సింగరకొండ”గా పిలుస్తారు. పురావస్తు శాఖ 1972 లో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. 200 అడుగుల కొండ మీద 120 అడుగుల చుట్టుకొలత, 30 అడుగుల ఎత్తు ఉన్న బౌద్ధ స్థూపం, మరో 15 పెద్ద స్థూపాలు, వందలాది చిన్న స్థూపాలు తవ్వకాలలో బయట పడ్డాయి.
ఈ బౌద్ధ స్థూపం చుట్టూ బుద్ధదేవుని జీవిత విశేషాలను తెలిపే శిల్పాలను చెక్కారు. అలాగే అశోక చక్రం ఉన్నశిల్పం, బౌద్ధ భిక్షువుల సమాధులు.. అప్పట్లో వారు విశ్రాంతి తీసుకున్న గదులు, ధ్యాన మందిరాలు. పూసలు,నాణేలు .. బ్రాహ్మి శాసనాలు తవ్వకాలలో వెలుగు చూశాయి.
నాడు భిక్షువులు కొండపై నుంచి నీరు కిందికి వెళ్లేందుకు నిర్మించిన కాలువ.. వారు ఉపయోగించిన రోలు , తదితర వస్తువులను కూడా అధికారులు కనుగొన్నారు. అలాగే ఆ మధ్య కాలంలో గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వుతుండగా రెండు పాలరాతి విగ్రహాలు కనిపించాయి.ఇక్కడ దొరికిన ప్రధాన స్థూపం సాంచీలోని బౌద్ధ స్థూపాన్ని పోలి ఉంటుంది. రాష్ట్రంలోనే ఇది అతి పెద్ద బౌద్ధ స్థూపమని చెబుతారు. ఈ స్థూపానికి నాలుగు ద్వారాలున్నాయి. వాటిలో ఉత్తర ద్వారంలో బుద్ధుడి పాలరాతి శిల్పం అమర్చి ఉంది.
గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్నఈ బౌద్ధారామం అతి ప్రాచీనమైనది. కాల క్రమంలో ఇక్కడి బౌద్ధారామాలను కూలగొట్టి అందులోని శిల్పాలు, రాళ్లు, మట్టి మొదలైన వాటిని చందవరంలోనే ఉన్న మహాబలేశ్వర ఆలయ నిర్మాణానికి ఉపయోగించారని కూడా అంటారు.
జిల్లా వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు ఈ చందవరం బౌద్ధ స్థూపాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు.చందవరానికి మూడు మైళ్ల దూరంలో దూపాడు బౌద్ధ స్థూపం ఉంది. ఇది శిధిల స్థితిలో ఉన్నది. దీనిని ద్వీపగడ్డ అని కూడా పిలుస్తారు. తవ్వకాల నుండి వెలికితీసిన అన్ని వస్తువులను ప్రదర్శన కోసం ఉంచాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం 1980లో సైట్‌కు సమీపంలో ఒక భవనాన్ని నిర్మించి మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది.
అయితే మూడు సార్లు చోరీ ప్రయత్నాలు జరిగాయి. దీంతో శిల్పాలన్నింటినీ చందవరం గ్రామ పంచాయతీ భవనానికి తరలించారు. గ్రామంలో మ్యూజియం భవన నిర్మాణానికి రెవెన్యూ అధికారులు భూమిని మంజూరు చేశారు. చందవరం ఒంగోలు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. దొనకొండ నుంచి 14 కి.మీ. ఉంటుంది. దొనకొండ నుంచి ప్రైవేట్ వాహనాలు దొరుకుతాయి.
నోట్ … పైన మీరు చూసిన ఫొటోలోని భౌద్ధ ప్యానల్ 2001 లో చోరీకి గురైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా మ్యూజియంలో ఉంది. చోరీ జరగక ముందునాటి ఫోటో అది.