బయోపిక్ కి తగిన సక్సెస్ స్టోరీ ఆమెది !

Sharing is Caring...

Inspiring life…………………………………………….

మధ్యప్రదేశ్‌కు చెందిన భూరి బాయి గిరిజన మహిళ. జబువా జిల్లా పిటోల్ గ్రామంలో ఆమె జన్మించారు. అద్భుతమైన చిత్రకారిణి. కొద్దీ రోజుల క్రితం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. స్వయం కృషితో ఎదిగిన కళాకారిణి ఆమె. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. తర్వాత కాలంలో భూరీ కూడా కూలీగా పని చేసింది. పదహారేళ్ళ ప్రాయంలోనే ఆమెకు పెళ్లయింది.

భర్తతో కలసి భోపాల్ వచ్చింది. అక్కడ నిర్మాణ రంగంలో రోజు వారీ కూలీగా కూడా చేసిందామె. చిన్నతనం నుంచే భూరికి చిత్రాలు గీయడం అంటే ఆసక్తి ఉండేది. తన ఇంట్లోని మట్టిగోడలపై చిత్రాలు గీసేది. బిల్లు తెగలో బహిరంగంగా చిత్రాలను గీయడాన్ని అప్పట్లో అంగీకరించేవారు కాదు. ఆమె ఇంట్లో తన కళను  కొనసాగించింది.  

ఖాళీ సమయాల్లో గోడలను ఆవుపేడతో అలికి  పువ్వులు, ఆకులు,సుగంధ ద్రవ్యాలను కలిపి సహజ రంగులను తయారు చేసుకుని వాటి సహాయంతో బొమ్మలు వేసేది. అప్పట్లో అలా బొమ్మలు గీయడం వారికి తెలిసిన వినోదం. తల్లి తండ్రుల నుంచి కూడా ఈ విద్యను భూరి కొంతమేరకు నేర్చుకుంది. ముగ్గు రాళ్లతో సూర్యుడు, చంద్రుడు, గుర్రాలు వేట, పొలం దున్నడం, ఇంకా  గ్రామీణ జీవితంలోని రోజువారీ కార్యకలాపాలను సృజనాత్మకంగా చిత్రీకరించేది. వాటిపై రంగులద్దేది. అవే అద్భుత కళా చిత్రాలు గా తయారయ్యేవి.

అప్పటికి వారికి బ్రష్ లు, కలర్స్ .. ఛార్ట్స్ గురించి అవగాహన లేదు. జబువా జిల్లా లో భిల్ తెగ గిరిజనులు ఎక్కువగా ఉండేవారు. వీరు ప్రధానంగా అటవీ వనరులపై జీవించేవారు. కాలక్రమేణా వ్యవసాయం వారి ప్రధాన వృత్తిగా మారింది. ఉత్తరాన మహి నది … దక్షిణాన నర్మదా నది పరిధి లో నివశించిన గిరిజన కుటుంబాల్లోని ఇంటి గోడలపై ఈ తరహా కుడ్య  చిత్రాలుండేవి.  దీన్నే ‘పిథోర’కళా రూపమని అంటారు.

భోపాల్ వచ్చాక భూరి జీవితం కొత్త మలుపు తిరిగింది. నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్నప్పుడు  ఖాళీ సమయంలో భూరి  రాళ్లపై బొమ్మలు గీసేది. ఒకరోజు ఏదో పనిమీద నిర్మాణ స్థలానికి వచ్చిన ప్రఖ్యాత కళాకారుడు జగదీష్ స్వామినాథన్‌ ఆమె రాళ్లపై బొమ్మలు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ బొమ్మలను కాగితంపై గీయమని అడిగాడు.

భూరి  పెద్దగా కష్టపడకుండానే కాగితంపై బొమ్మలు గీసింది. వాటిని చూసి ముగ్ధుడైన అతను ఆమెను మరిన్ని గీయమని అడిగాడు. ఆమె వేసిన ప్రతి పెయింటింగ్‌కు జగదీష్ ఆమెకు రూ. 50 చెల్లించాడు, అది ఆమె రోజువారీ కూలీ రూ. 6 కంటే చాలా ఎక్కువ. అలా భూరి కి జగదీష్ తో  పరిచయం ఏర్పడింది.ఆయన ఆమెకు పోస్టర్ పెయింట్‌లు, బ్రష్‌లు .. ఇతర సాధనాలు ఎన్నో పంపించాడు.

వాటి సహాయంతో చిత్రకళలో ఆమె ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. అలా అంచెలంచెలుగా ఎదిగింది. కాలక్రమేణా ఆమె నైపుణ్యాలు మరింత మెరుగైనాయి. చాలామందికి భూరి  గురించి తెలిసి తమ ఇళ్లలో గోడలపై చిత్రాలు గీయించుకునే వారు. అలా భూరి కళా ప్రపంచంలోకి అడుగు పెట్టింది. కళాకారిణిగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

భోపాల్‌లోని మధ్యప్రదేశ్ గిరిజన మ్యూజియంలో ఉద్యోగంలో చేరింది. పిథోరా పెయింటింగ్‌ల గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహిళగా గుర్తింపు సంపాదించింది. భూరి ప్రతిభను గుర్తించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం శిఖర్ సమ్మాన్ పురస్కారంతో సత్కరించింది. మరెన్నో పురస్కారాలు కూడా భూరి అందుకున్నారు. గిరిజన మ్యూజియంలో పిథోర కళారూపాన్ని సంరక్షించడానికి వర్క్‌షాప్‌లు నిర్వహించింది.

పగటిపూట మ్యూజియంలో చేస్తూ .. రాత్రిళ్ళు ఇంటివద్ద  మిలియన్ల విలువైన కళాఖండాలను రూపొందించేది. ఒక గిరిజన మహిళగా ఎంతో అభివృద్ధి సాధించిన ఆమెను మొదట్లో  గ్రామస్తులు సరిగ్గా అర్ధం చేసుకోలేదు. పైగా నిందించారు. భర్త జోహార్ కంటే ఎక్కువగా సంపాదించడాన్ని కూడా తప్పు బట్టారు. కాల క్రమంలో ఇవన్నీ విబేధాలుగా మారాయి, కానీ చివరికి, జోహార్ కూడా వచ్చి ఆమె నుండి కళను కూడా నేర్చుకున్నాడు.

ఒకప్పుడు  ఏ కమ్యూనిటీ అయితే  చిన్నచూపు చూసిందో ఇపుడు అదే కమ్యూనిటీకి  భూరి స్ఫూర్తిగా నిలుస్తోంది. చాలా మంది మహిళలు బాలికలు ఆమెను అనుసరించారు. అనుసరిస్తున్నారు. ఇప్పుడు పెయింటింగ్‌లతో జీవనోపాధి పొందుతున్నారు. పిథోరా కళ ద్వారా భూరి తన జీవితాన్ని వికసించేలా చూసుకుంది.యూరప్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లోని  ఆర్ట్ గ్యాలరీలలో మ్యూజియంలలో భూరి చిత్రాలు ప్రదర్శితమైనాయి  ఆమె పెయింటింగ్ స్టోరీ ఆఫ్ ది జంగిల్ 2007లో సోథెబైస్ వేలంలో అమ్ముడు బోయింది. మరెన్నో విజయాలు భూరి సాధించింది. నిజంగా పద్మశ్రీ కి భూరి అర్హురాలే.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!