బర్మన్ హిట్ సాంగ్స్ వెనుక భానుగుప్తా గిటార్ !!

Sharing is Caring...

Ramana Kontikarla………………….

AN UNSUNG HERO.. BHANU!                                                                                                                      

He is just genius… ఏ హార్మోనియమో,  లీడ్ గిటారో ఉండాల్సిన అవసరం లేదు. పంచభూతాల నుంచీ పది కాలాల పాటు పాడుకునే పాటనూ తయారు చేయగలడు.. భాను గుప్తా.

ఏవరీ భానుగుప్తా…?

బాలీవుడ్ లో మొట్టమొదటి నాన్ క్యాథలిక్ మోస్ట్ క్రియేటివ్ గిటారిస్ట్.ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ బతికే భానుగుప్తాను.. మొట్టమొదట గుర్తించింది ది గ్రేట్ మదన్ మోహనే అయినా… పంచమ్ దా తో సాగిన భానుగుప్తా జర్నీ వెరీ ఇంట్రెస్టింగ్.

భానుగుప్తా ఓపీ నయ్యర్, నౌషాద్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వంటి సంగీత దర్శకులతో కూడా కలిసి పనిచేశారు. అంతెందుకు లతా మంగేష్కర్ ఎప్పటికప్పుడు భానుగుప్తాను చూసి ఆశ్చర్యపోయేవారట. తనకెలాంటి శాస్త్రీయ సంగీత అనుభవం లేకుండానే..  ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులైన కిషోరీ అమోంకర్, అల్లారఖా, విలాయత్ ఖాన్ వంటివారితో ఎలా పని చేయలగల్గుతున్నారని.

తండ్రి ఎస్డీ బర్మన్ ప్రయోగాలు బాలీవుడ్ సంగీతాన్ని కొత్త దిశలో తీసుకెళ్తే… తండ్రి సంగీత ఛాయల ప్రభావమేమాత్రం లేకుండా తనకంటూ ఒక కొత్త ఒరవడితో ఒక ఊపు ఊపిన తండ్రికి తగ్గ కొడుకు ఆర్డీ బర్మన్.  

జాజ్, కాంటినెంటల్, సౌత్ అమెరికన్, మిడిల్ ఈస్టర్న్.. ఇలా అన్ని రకాల సంగీతాన్ని వింటూ స్ఫూర్తి పొందేవాడే తప్ప.. ఎప్పడూ గుడ్డిగా కాపీ చేయడానికి మాత్రం ససేమిరా అనేవాడు బర్మన్. అందుకే బర్మన్ తో పనిచేయడంలో కావల్సినంత క్రియేటివ్ స్పేస్ దొరుకుతుందనేది భానుగుప్తా అభిప్రాయం.

అందుకే మన దక్షిణాది సినిమాల్లో కేవీ మహదేవన్ బ్యాక్ ఎండ్ లో పుహళేందిలాగా… బాలీవుడ్ లో బర్మన్ వెనుక నిల్చిన ఒక అన్ టోల్డ్ హీరో భానుగుప్తా. ఒక సంగీత దర్శకుడు ఒక ట్యూన్ చేసి వినిపిస్తేనే గానీ.. దాన్ని మ్యూజిషియన్స్ అర్థం చేసుకుని వాయించే ఒక ప్రాక్టీస్ సెషన్ చూస్తుంటాం.

కానీ, ఆర్డీ బర్మన్ తో మ్యూజికల్ రిహార్సల్స్ లోనే ఆయన మస్తిష్కమేం కోరుకుంటుందో అంచనా వేయగల్గి.. అందుకనుగుణమైన నొటేషన్స్ ను అందిస్తూ.. లీడ్ గిటార్, మౌత్ ఆర్గాన్ వంటి ఎన్నో పరికరాలతో స్వరవిన్యాసం చేసిన అన్ సంగ్ హీరో భానుగుప్తా.

తీస్రీ మంజిల్ లో ‘దేఖియే సాహిబోన్’ సాంగ్ తో పంచమ్, భాను ద్వయం జర్నీ ప్రారంభమైంది. అలా మూడు దశాబ్దాల పాటూ ఇద్దరూ ఇద్దరే అన్నట్టుగా తమ సంగీత ప్రయాణాన్ని పరస్పర సహకారంతో ముందుకు తీసుకెళ్లారు.

ఒక రోజు ఓ ఫ్యాన్ చెడిపోయి.. అది తిరుగుతున్న సౌండ్ పంచమ్ ను అటెన్షన్ కు గురిచేసింది. అంతే..! ఆ ధ్వనే.. ఆప్ కీ కసమ్ లో ‘సునో కహో’ పాటకు స్ఫూర్తైందంటాడు భాను. అంతెందుకు వార్మప్ లాగా తన వేళ్లు గిటార్ పై శృతి తప్పిన స్వరాల ధ్వని నుంచి.. అమర్ ప్రేమ్ లోని ‘చింగారీ కోయీ బడ్కే’ వంటి పాట పుట్టుకొచ్చి అజరామరమైపోయింది.

ఒకరోజు రిహార్సల్ అయిపోయి ప్యాకప్ చేసేశారు. భానూ మాత్రం ఇంకా గిటార్ స్ట్రమ్మింగ్ చేస్తూ ఏదో సరి చేస్తుంటే… ఆ కార్డేషన్ నుంచి ఖేల్ ఖేల్ మే సినిమాలోని ‘ఏక్ మై ఔర్ ఏక్ తూ’ పాట పుట్టుకొచ్చింది.

తన మ్యూజిక్ బ్యాండ్ లో ఎవరైనా క్రియేటివ్ ఐడియాస్ ఇచ్చినప్పుడు అవి బాగా అనిపిస్తే ప్రోత్సహించే ఒక సత్సంప్రదాయం, మెచ్యూరిటీ పంచమ్ ప్రత్యేకతగా ఉండేది. పుట్టినప్పుడే పంచమ స్వరంలో ఏడ్చి పంచమ్ గా పేరొందిన ఆర్డీ బర్మన్..  ఓ నిత్య ప్రయోగశీలి.

అలా షోలేలోని ‘మెహబూబా మెహబూబా’కు బీర్ బాటిల్స్ చప్పుళ్లు రిథమ్ గా మారినా.. ఏకంగా జవానీ దివానీ సినిమాలో ‘సామ్నే ఏ కౌన్’ ఆయా పాట కోసం పెడల్ మట్కా అనే కొత్త పరికర సృష్టే జరిగినా.. పడోసన్ లో’ ఏక్ చతుర్’ నార్ పాట ప్రయోగమైనా.. పంచమ్ మార్క్స్ కనిపిస్తుంటాయి. అయితే, పంచమ్ సృజనాత్మక స్థాయిని అందుకునేలాగా.. ఆయనతో భాను గుప్తా గిటార్ జర్నీ సాగింది.

రాకీ సినిమాలో  ‘క్యా యహీ ప్యార్ హై’ పాట మెలోడియస్ ట్యూన్ విని పంచమ్ ను లతా మంగేష్కర్  ప్రశంసించింది. అయితే ఆ ట్యూన్ తనది కాదని.. ఆ క్రెడిట్  భానుకే దక్కుతుందని నిస్సంకోచంగా చెప్పిన పంచమ్ ఫెయిర్ నెస్ కు ఫిదా అయ్యానంటాడు భాను.

యువతను ఊర్రూతలూగించిన ‘యాదోంకీ బారాత్’ అనే పంచమ్ పాట వెనుక కూడా భాను పాత్ర కీలకమని తెలిసిన డైరెక్టర్ నాజీర్ హుస్సేన్ స్కాచ్ బాటిల్ బహుకరించి భానుతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారట.

ఓరోజు భానుగుప్తా ఉదయాన్నే పంచమ్ ఇంటికి వెళ్లేసరికి ఆర్డీ బర్మన్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారు. అక్కడ పక్కనే కనిపించిన పంచమ్ అకాస్టిక్ గిటార్ తీసుకుని.. తనదైన స్టైల్ లోని రిథమ్ ప్యాటర్న్ తో ఏవో కార్డ్స్ వాయిస్తున్నారట. వెంటనే బాత్రూమ్ తలుపు ఆఫ్ తెరుచుకుని అందులోంచి బర్మన్ ముఖం బయటకొచ్చింది.

‘అరే ఏం వాయిస్తున్నావ్ బ్రదర్.. అలాగే కానిస్తూ ఉండూ’ అంటూ స్నానం కూడా పూర్తి కాకుండానే పంచ కట్టుకుని వచ్చి హార్మోనియంతో కూర్చున్నాడట పంచమ్. ఇంకేం ఆ దశలో పుట్టుకొచ్చిందే సూపర్ హిట్టైన ‘ఏక్ మై ఔర్ ఏక్ తూ సాంగ్.’

పంచమ్ వెనుక తాముండటాన్ని గర్వపడతామని.. పంచమ్ ఒక క్రియేటివ్ జీనియస్ అంటారు భాను. బర్మన్ ఎప్పుడూ సాహిత్యం ట్యూన్ ను నిర్దేశించడాన్ని ఒప్పుకోరని.. పదాలను ట్యూన్స్ నడిపించాలనే లిబర్టీ కోరుకునేవారన్నది భాను మాట.

మొత్తంగా పంచమ్ తో సుమారు ముప్పై ఏళ్లకు పైగా మ్యూజికల్ జర్నీ .. ఎన్నో సరదా సన్నివేశాలు, జోకులు, సెటైర్స్, భిన్న ప్రయోగాలు, సంప్రదాయ, ప్రాశ్చాత్య, జానపద రీతులను వినడం వంటివాటికో గడిచిపోయిందని కొన్ని ఇంటర్వ్యూస్ లోనూ భాను చెప్పుకొచ్చారు.

జయాబాధురి వితంతువుగా సాయం సంధ్యవేళ దాటి కాస్త చీకటవుతున్న వేళ.. షోలేలో మేడపైన తమ ఇంట్లో దీపాలు పెడుతున్నప్పుడు.. మరోవైపు ఎదురింట్లో అమితాబ్ వాయించే హార్మోనికా (మౌత్ ఆర్గాన్) ప్లే చేసింది కూడా భానూనే.

అదే షోలేలో జై, వీరూ పాత్రల్లో అమితాబ్, ధర్మేంద్ర బైక్ పై వెళ్తున్నప్పుడు టుర్రుమంటూ వినిపించే ఓ సౌండ్ క్రియేషన్ అప్పటికి కొత్తగా పరిచయమైన సింధసైజర్ లోది.

పంచమ్ గ్రూప్ లో భానూలాగే.. ది గ్రేట్ లూయిస్ బ్యాంక్, కెర్సీ లార్డ్స్ సింథసైజర్, కీబోర్డ్స్, ఆర్గాన్, పియానోపైన.. అలాగే రమేష్ అయ్యర్ గిటార్ పైన… కొన్ని సినిమాల్లో ప్రఖ్యాత వేణునాద కళాకారుడు హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ పైన.. బాబ్లా, మనోహర్ బార్వే వంటివారు కాంగోపైన అలరించేవారు.

అలా ఎందరో అద్భుతమైన సంగీత కళాకారుల బృందం వెరసి.. పంచమ్ దా క్రియేటివిటీకి మరింత మేళవింపైతే… అందులో పంచమ్ కు ప్రాణప్రదమైన సంగీతకారుడు భానుగుప్తా.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!