పార్సిల్ స్కామ్స్ తో జాగ్రత్త !!

Sharing is Caring...

Frauds in new ways…………………………

దేశంలో మోసాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త రీతుల్లో మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పార్సిల్ స్కాములు ఎక్కువగా వెలుగులోకి  వస్తున్నాయి. చాలామంది ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. మోసగాళ్లు  వినియోగదారులకు రకరకాల సందేశాలను పంపుతారు.

వాటిలో మీ చిరునామా తప్పుగా ఉన్న కారణంగా  పార్శిల్ డెలివరీ చేయడం సాధ్యం కాదని చెబుతారు.  డెలివరీని స్వీకరించడానికి చిరునామాను అప్‌డేట్ చేయమని మెసేజ్ పెడతారు. ఇందు కోసం మీరు మెసేజ్ లో ఉన్న లింక్‌పై క్లిక్ చేయమని అడుగుతారు. ఏమాత్రం ఆలోచించకుండా  లింక్‌పై క్లిక్ చేస్తే మీ పని అయిపోయినట్లే. అలాంటి మెసేజ్లు వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిదైనా సలహా తీసుకోవాలి.

లేదా మెసేజ్ డిలీట్ చేయాలి. తొందరపడి తెలియని లింక్‌పై క్లిక్ చేయకూడదని గుర్తుంచుకోండి. పొరపాటున అలా చేస్తే మోసగాళ్లు  బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. లింక్ ద్వారా మీ ఫోన్‌లో వైరస్ ఇన్‌స్టాల్ చేయవచ్చు. హ్యాకర్లు మీ మొబైల్‌ను గానీ, ల్యాప్‌టాప్‌ను గానీ హ్యాక్ చేసే ప్రమాదం  ఉంది. అదే జరిగితే మన సమాచారం అంతా లీక్ అవుతుంది. 

ఇటీవలే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే సోషల్ మీడియా ఖాతా  సైబర్ దోస్త్ ఇలాంటి మోసాల గురించి వినియోగదారులను అప్రమత్తం చేసింది.  మీకు అలాంటి సందేశం వస్తే, అది స్కామ్ కావచ్చు. ఇలాంటి మెసేజ్‌లను పట్టించుకోకుండా జాగ్రత్త పడాలి.. అని హెచ్చరించింది. 

మీరు ఇటీవల ఎలాంటి ఆర్డర్ చేయనపుడు .. మీకు అలాంటి సందేశం వచ్చినట్లయితే అది స్కామ్ కావచ్చు. “ తక్షణమే  క్లిక్ చేయండి” అనే మెసేజ్‌లో ఉంటుంది. కొందరైతే ఫోన్లు కూడా చేస్తారు. ఇలాంటి తరుణంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.  ఏదైనా సరే .. అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయకూడదు. అలాంటి మెసేజ్‌లను సీరియస్ గా తీసుకోకూడదు. 

మెసేజ్  నిజమైనదని మీరు భావిస్తే కొరియర్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి నేరుగా వెళ్లండి.. అందులో  అధికారిక కస్టమర్ కేర్ నంబర్‌ ఉంటుంది. కాల్ చేయండి. నిజాలు తెలుసుకోండి. అపుడు కూడా మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్  చేయకండి.  అలాగే అనుమానాస్పద వెబ్‌సైట్‌లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని లేదా బ్యాంక్ వివరాలను పొరపాటున కూడా ఎప్పుడూ షేర్ చేయకండి. 

పార్సిల్ స్కాములు  మరో విధంగా కూడా జరుగుతున్నాయి. అవెలాగంటే .. మోసాలు చేసేవాళ్ళు ఫోన్ ద్వారా కూడా బురిడీ కొట్టించే యత్నాలు చేస్తున్నారు. అందుకే   తెలియని నంబర్ నుంచి వచ్చే కాల్స్ ను అటెండ్ చేయకూడదని అంటారు.  అయితే మన రోజువారీ జీవితంలో అది సాధ్యం కాదు.  ఈ అలవాటును దృష్టిలో ఉంచుకునే  మోసగాళ్లు మోసం చేయడానికి నకిలీ కొరియర్ సిబ్బంది లేదా కస్టమ్స్ అధికారులుగా నటిస్తున్నారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ & కస్టమ్స్ (CBIC) కింద ఉన్న కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ మీ పేరు మీద ఒక పార్శిల్/ప్యాకేజీని ఆపివేసిందని చెబుతారు. ఇప్పుడు మీరు ఆ పార్సిల్ పై కస్టమ్స్ డ్యూటీ లేదా పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు స్కామ్‌స్టర్లు మరింత భయపెట్టేలా కథలు చెబుతారు.

పార్శిల్స్/ప్యాకేజీలలో డ్రగ్స్ ఉన్నాయని .. వాటిని తప్పించి పార్సిల్ ఇస్తామని  మీరు కొంత లంచం చెల్లించాలని చెబుతారు. ఇదంతా నిజమే అని భయపడి డబ్బులు పంపి మోసపోయినవారు ఎందరో ఉన్నారు. ఫేస్బుక్ లో పరిచయమై గిఫ్ట్ పంపామని తీసుకోమని మెసేజ్ పెడుతుంటారు. అంతలోనే కస్టమ్స్ అధికారులం అంటూ ఫోన్ చేసి పైన చెప్పిన విధంగా మోసం చేస్తున్నారు. 

అలాగే ఆర్బీఐ నుంచి  చేస్తున్నామనే ఫేక్ కాల్స్ కూడా వస్తున్నాయి. మీరు సమస్యల్లో పడ్డారని ..  మీ క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించడం కష్టమని . కార్డు నంబర్ చెప్పండని .. ఓటీపీ వస్తుందని కూడా అడుగుతున్నారు. ఇది కూడా మోసమే.  ఆర్బీఐ వాళ్లు మనకు ఫోన్ చేయరు. అలాంటి ఫోన్ వస్తే  క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకు కి వెళ్లి మాట్లాడండి. జాగ్రత్తగా ఉండండి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!