ఆ పుష్పాల లోయ అందాలు అద్భుతం !

Sharing is Caring...

కాశీపురం ప్రభాకర్ రెడ్డి……………..

నీలగిరి, పశ్చిమ కనుమలు లేదా అరకు ప్రాంతాలు వెళ్లినప్పుడు.. కొన్ని లోయలు చూడటానికి అద్భుతం అనిపిస్తాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు మర్చిపోతాం.2019 లో..అరుణాచల్ ప్రదేశ్ లోని జీరో వ్యాలీ చూశాక మళ్ళీ ఇంకో లోయ పై మనసు పోలేదు.ఇవాళ 12000 అడుగుల ఎత్తున్న హిమాలయ పర్వతాన్ని అధిరోహించి.. పుష్పాల లోయ ( valley of flowers) చూశాను. ఒక జీవిత కాలపు అనుభూతి మిగిల్చుకుని దిగి వచ్చాను.
……….
ఘంఘరియా సమీపంలో ఉన్న గుడారాల్లో మాకు బస ఏర్పాటు అయింది. ఇక్కడ రాత్రి 5 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఉదయం 5 గంటలకు 1 డిగ్రీ సెల్సియస్ కు పడిపోతుంది. బయట ఎంత చలిగా ఉన్నా గుడారాల్లో మాత్రం వెచ్చగానే ఉంటుంది. 

మా టూర్ గైడ్ సూచనలమేరకు ఉదయం 6.30 కే రెడీ గా ఉన్నాం. క్యాంప్ వాళ్ళు పెట్టిన బ్రెడ్, జామ్ తినేసి వేడివేడి టీ తాగాం. అప్పటికే లంచ్ బాక్స్ లు కూడా సిద్ధం చేసి ఉంచారు. ఎందుకంటే మేం వెళుతోంది ఎత్తైన పర్వత ప్రాంతం లో ఉన్న లోయలోకి కాబట్టి అక్కడ తినేందుకు ఏమీ దొరకదు. ఎవరి లంచ్ వాళ్ళు తీసుకు వెళ్లాల్సిందే.

సరిగ్గా 7 గంటలకు మా గుడారాలు వదిలాం. ఒకవైపు చలి వణికిస్తోంది . అయినా , ఎన్నేళ్ల నుంచో అనుకుంటున్న పుష్పాల లోయ చూడబోతున్నాం అనే ఉత్సాహమే ముందుకు నడిపించింది. ఒక కి మీ నడిచాక 300 అడుగుల ఎత్తులో ఘంఘరియా అనే జనావాసం చేరాం.

నవంబర్ నుంచి ఏప్రిల్ వరకూ ఇక్కడ ఎవరూ ఉండరట. ఈ లోయ అంతటా మంచు పరుచుకుంటుంది. దీంతో ఇక్కడి ప్రజలు బతుకు తెరువు వెదుక్కుంటూ Pulna, గోవింద్ ఘాట్, లేదా జోషిమఠ్ వెళ్ళిపోతారు.
ఘంఘరియా లో హోటల్స్, లాడ్జ్ లతో పాటు ఓ యాభై వరకు దుకాణాలు ఉన్నాయి. ఒక మెడికల్ షాప్ కూడా ఉంది.మాకు కావాల్సిన స్నాక్స్, వాటర్ బాటిల్ కొనుక్కుని ట్రెక్కింగ్ మొదలు పెట్టాం.
……….
Ghanghariya దాటాక రాస్తా రెండుగా విడిపోతుంది. కుడివైపు హేమకుండ్ సాహెబ్ కు, ఎడమ వైపు Valley of flowers కు దారి ఉంటుంది. Valley కి వెళ్ళేవారు ప్రవేశం వద్ద ఉన్న ఆఫీసు లో ఖచ్చితంగా రిజిష్టర్ చేసుకోవాలి. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికీ 200 రూపాయలు. 

ఈ లోయలో మాత్రమే లభ్యమయ్యే ప్రత్యేక జాతి పుష్పాల వల్ల ఇది ప్రపంచ వ్యాప్తంగా టూరిస్ట్ లను ఆకర్షిస్తోంది. దీని స్వచ్ఛత ను, ప్రత్యేకత ను కాపాడే ఉద్దేశ్యంతో 2005 లో ఈ లోయ ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి సంరక్షిస్తున్నారు.

ప్రఖ్యాతి గాంచిన నందాదేవీ బయోస్ఫియర్ పార్క్ కు అనుబంధం గానే ఇది ఉంది.హిమాలయాల్లోని Zanskar పర్వత శ్రేణుల్లో పుష్పవతి నది వెంట ఈ లోయ గుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక కిమీ నడిచాక పుష్పవతి నది దాటేందుకు ఒక వంతెన ఉంది. ఇక ఇక్కడి నుంచి కొండవాలుగా ట్రెక్కింగ్ చేయాలి. కొన్ని చోట్ల నిటారుగా ఎక్కాల్సి ఉంటుంది.

Zanskar పర్వత శ్రేణుల మధ్య లోయ లోకి వెళ్ళే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. పర్వతాల మధ్య లో ఒక శిఖరం కనిపిస్తూ ఉంటుంది. ఆ శిఖరం మంచు తో కప్పబడి ఉంటుంది.ఉదయం పూట లేలేత సూర్యకిరణాల ప్రసరణ మేరకు క్షణ క్షణం రంగులు మారుతుంటుంది. పుష్పాల లోయ లోకి వెళ్ళే దారి కూడా అదే నని గైడ్ చెప్పినప్పుడు ఇంద్రలోకపు దారి కూడా ఇదే కావచ్చు ననిపించింది.

లోయలోకి దారి తీసే path way అంత సులభంగా ఉండదు. మిషనరీలు ఏవీ ఈ లోయ లోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి సరైన రోడ్డు మార్గం వేయడం అసాధ్యం.దారివెంట అతికించిన గులకరాళ్ల ను ఆసరా గా చేసుకుని ముందుకు నడవాలి. లోయ అందాలు చూసుకుంటూ లేదా ఫోటోలు తీసుకుంటూ ఏ మాత్రం అజాగ్రత్తగా నడిచినా అంతే.. గులక రాళ్ళు తట్టుకుని లోయలోకి జారిపడే ప్రమాదం ఉంది.

కాబట్టి మంచి దృశ్యం కనిపించినప్పుడు అడుగు ముందుకు వేయకుండా అక్కడే నిలబడి ఫోటోలు తీసుకోవడం ఉత్తమం.చేతిలో ఒక ఊత కర్ర ఉంటే నడక కాస్త సులువు. మా అదృష్టం కొద్దీ ఈ రోజు వర్షం పడలేదు. కాబట్టి ప్రమాద రహితంగానే ట్రెక్కింగ్ చేశాం.వర్షం లేనందున లోయ ఎంతో స్పష్టంగా కనిపించి కనువిందు చేసింది.

మేఘావృతమైందంటే ఒక్కోసారి అడుగు ముందుకు పడనంత ఇబ్బంది ఉంటుందని గైడ్ చెప్పాడు.దారిలో బోధి వృక్షాలు, Pine చెట్లు ఎక్కువగా ఉన్నాయి.సుమారు 3 కి మీ అలా ఏటవాలుగా పైకి ట్రెక్కింగ్ 4 గంటలు పాటు చేశాక అసలైన లోయ లోకి ప్రవేశిస్తాం. 12000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల మధ్య లో పుష్పవతి నదికి రెండు వైపులా ఈ లోయ ఉంది.

దాదాపు 8 కి మీ పొడవు, 2 కి మీ వెడల్పు ఉన్న లోయ లో ఎటు చూసినా పూల మొక్కలే. ఈ మొక్కలు ఎవరో నాటి పెంచినవి కావు. ప్రకృతి సహజంగా మొలిచిన ఈ మొక్కలు జూన్ లో మొగ్గలు వేసి జూలై లో వికసించి ఆగస్టు వరకు కనువిందు చేస్తాయి.ఈ పుష్పాలన్నీ ఔషధ విలువలు ఉన్నవే నని ఇక్కడ ఒక బోర్డు లో రాసి పెట్టారు.

ఈ Gharwal ప్రాంతంలో ఉండే పురాణ గాథ ప్రకారం.. అలనాటి శ్రీరామ చంద్రుని ఆదేశం మేరకు లక్ష్మణుని బ్రతికించేందుకు ఆంజనేయ స్వామి తెచ్చిన సంజీవని మూలిక ఈ లోయలోనే సేకరించుకుని వెళ్ళాడట.సృష్టి లో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల పుష్పాలు ఇక్కడ కనిపించడం విశేషం.

లోయకు ప్రధాన ఆకర్షణగా ఉండే నీలి, గులాబీ రంగు పుష్పాలు ఆగస్టు చివరి వారానికే వాడి పోతాయి . ఇందువల్ల పుష్పాల లోయ అందాలు కొంచెం వసివాడినట్లుగా అనిపించింది. అయినా లోయలో ప్రకృతి అందాలకు కొదవే లేదు.లోయలో మేం మూడు గంటల పాటు కాలక్షేపం చేశాం. ఒక వాటర్ ఫాల్ వద్ద కూర్చుని లంచ్ చేశాం.

ఈ లోయ లో ఇసుమంత పొల్యూషన్ లేదు. మేం కూడా మా పార్సిల్ box ను, water bottle ను అక్కడ విసిరి వేయకుండా మా వెంటే తిరిగి తెచ్చుకున్నాం.ఈ లోయ నుంచి బద్రీనాథ్ వెళ్ళేందుకు ఒక నడక దారి ఉంది. మరో రెండు లోయలు దాటి బద్రీనాథ్ చేరుకోవచ్చు.అయితే ఈ లోయకు యునెస్కో వారసత్వ సంపద గా గుర్తింపు వచ్చాక ఈ దారి లో బద్రీనాథ్ నడిచి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వడం లేదు.

సుమారు 2.30 గంటలకు తిరుగు దారి పట్టాం. నిటారుగా ఉన్న మార్గం కాబట్టి ఎక్కడం కంటే దిగటం మరింత కష్టంగా అనిపించింది.ఈ ప్రాంతం ఫోటోగ్రాఫర్లకు, ప్రకృతి ప్రేమికులకు ఒక వరం అనే చెప్పాలి. జీరో వ్యాలీ తర్వాత నేను చూసిన అద్భుతమైన ప్రాంతం ఇదే … ఈ లోయ సందర్శన నేను ఎన్నటికీ మర్చిపోలేను. పుష్పాల సౌందర్యమే కాదు.. పుష్పవతి నది సోయగాలు కూడా నా జ్ఞాపకాల దొంతరలో కలకాలం నిక్షిప్తమై ఉంటాయి.

ఇక్కడ …పాఠకులకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ ట్రెక్కింగ్ అంత సులభంగా చేయగలిగినది కాదు. మంచి ఫిట్నెస్ అంటేనే రావాలి.కేవలం పుష్పాలు మాత్రమే చూడాలి అనుకునే వారు జూలై రెండో వారం నుంచి ఆగస్టు మూడో వారం మధ్య లో ఇక్కడికి రావాలి .అయితే అప్పుడు కురిసే భారీ వర్షాలకు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జారి లోయలో పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే లోయలో పరుచుకునే పొగమంచు వల్ల లోయ లో అందమైన దృశ్యాలు చూడలేం.

ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ మొదటి వారం మధ్య లో పుష్పాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఆకస్మిక వర్షాల బెడద తగ్గుతుంది. కాబట్టి లోయ అందాలు వీక్షించే అవకాశం ఉంటుంది.జూలై, ఆగస్టు సీజన్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది.వసతి సౌకర్యాలకు డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు మేం ఉంటున్న గుడారాలకు  కూడా ఓ పది రోజుల క్రితం వరకూ రోజుకు 8000 అద్దె వసూలు చేశారట. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!