బలరామ వివాహం Vs ఐన్ స్టీన్ !

Sharing is Caring...

శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుని అన్న బలరాముని వివాహ వృత్తాంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  ఈ కథ చాలామంది వినివుండరు .  

సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 6
కృతయుగంలో రైవతుడు అనే రాజు కుశస్థలి నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన కూతురు రేవతి. ఆయనకు కూతురంటే అమితమైన ప్రేమ. ఆమె వివాహం కోసం ఎన్ని సంబంధాలు చూసినా… రేవతి సంగతి తరువాత, ముందు ఈయనకు ఎవరూ నచ్చడం లేదు. విసిగి, వేసారి ఇక వెతికే ఓపిక లేక బ్రహ్మలోకం వెళ్ళి సృష్టికర్త బ్రహ్మనే అడిగాడు, సరైన వరుడిని చూపమని.

బ్రహ్మ నవ్వుతూ… రైవతా, కూతురు మీద ప్రేమ ఉండొచ్చుకానీ, మరీ ఇంత మూర్ఖత్వమా, నీ కూతురుకి తగ్గ ఒక్క వరుడినీ వెతకలేక పోయావా? ఎంత అవివేకమైన పని చేశావో, తెలుసా?  అని…  ఇప్పుడు నీ నగరంలోనే నీ కూతురుకి తగ్గ వరుడున్నాడు అన్నాడు. రైవతుడు ఆశ్చర్యంగా, నాకు తెలియకుండా… ఎవరు స్వామీ? అని ప్రశ్నించాడు . 

అప్పుడు బ్రహ్మ… పిచ్చివాడా! నువ్వు బయలుదేరినప్పటి నుండి ఇక్కడకు వచ్చి, నాతో ఈ మాటలాడే సమయానికి, ఇప్పటికి భూమి మీద 28లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. నీ రాజ్యం, కోటలు అన్నీ శిథిలమైపోయాయి. కృత, త్రేతా యుగాలు గడిచిపోయి ప్రస్తుతం ద్వాపరయుగం నడుస్తోంది. మహావిష్ణువు, శ్రీకృష్ణునిగా జన్మించాడు. కృతయుగంలో నీ రాజధాని కుశస్థలి ఉన్నచోటే దేవతల శిల్పి విశ్వకర్మ చేత తన రాజధాని ద్వారకానగరాన్ని నిర్మించుకున్నాడు. విష్ణువు అంశతోనే ఆదిశేషుడు బలరామునిగా, శ్రీకృష్ణుని అన్నగా జన్నించాడు. ఆ బలరాముడే, రేవతి కి తగిన వరుడు. ఆలస్యం చేయకు, త్వరగా వెళ్ళు, వివాహం జరిపించు అన్నాడు.

రైవతుడు, తన కూతురైన రేవతితో వెంటనే భూలోకంలో శ్రీకృష్ణుని మందిరానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణ, బలరాములు తమ తల్లిదండ్రులైన దేవకీ, వసుదేవులతో మాట్లాడుతూ ఉన్నారు. హఠాత్తుగా అక్కడ రైవతుడు తన కుమార్తె రేవతితో సహా ప్రత్యక్షమయ్యాడు. రైవతుడు అందరికీ నమస్కరించి, జరిగిన వృత్తాంతం అంతా వివరించి రేవతిని పెళ్ళిచేసుకోమని బలరామునికి అప్పగించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన కంటే రెట్టింపు ఎత్తుగా సుమారు 16అడుగుల భారీ కాయంతో ఉన్న కృతయుగం నాటి రేవతిని ఆశ్చర్యంతో చూస్తూ, ఏమిచేయటం అని శ్రీకృష్ణుని వైపు చూశాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో బ్రహ్మగారి ఆజ్ఞ శిరసావహించాల్సిందే అని బలరామునికి సూచించాడు. అప్పుడు బలరాముడు, తన హలాయుధం, నాగలిని రేవతి తలపై మోపి, ద్వాపరయుగానికి తగ్గట్లుగా ఆమె ఎత్తుని తగ్గించి వివాహం చేసుకున్నాడు.

విషయం ఏంటంటే… రైవతుడు, బ్రహ్మలోకంలో కొద్దిసేపు గడిపినంత మాత్రాన అంత విపరీత మార్పులు ఎలా సంభవించాయి? 28 లక్షల సంవత్సరాలు గడిచిపోవడం సాధ్యమేనా? అంటే…  సాధ్యమే…  ఎలా అంటే…

ఆర్బర్ట్ ఐన్ స్టీన్ 1905లో వెలువరించిన స్పెషల్ రిలేటివిటీ థియరీ ఏం చెప్తోందంటే, All the measurements are relative, including time and speed. In other words, time and speed depends upon where you measure them. ( సమయం, వేగం…  అనేవి నువ్వు ఎక్కడ కొలుస్తున్నావో… అనే దానిపై ఆధారపడి ఉంటాయి.

లెజండరీ, నా ఫేవరెట్ గ్రేట్ డైరెక్టర్ అయిన క్రిస్టోఫర్ నోలాన్ 2014లో తీసిన అత్భుతమైన సినిమా “ఇంటర్స్టెల్లార్” ( ‌ఇంకా ఎవరైనా ఇప్పటివరకూ చూడనివారు ఉంటే, దయచేసి తప్పక చూడండి.) లో ఇదే విషయాన్ని చెప్పాడు. ఆ స్థాయి సంక్లిష్టంగా కాకుండా, తేలికైన ఒక ఉదాహరణని మనం చెప్పుకుందాం.

ఉదా|| :  నేను మీ ముందు రెండు విషయాలు ఉంచుతాను. అవి పరస్పర విరుద్ధంగా ఉన్నా పరిస్థితుల రీత్యా రెండూ నిజమైనవే.
1.  నెప్ట్యూన్ గ్రహాన్ని 1846లో కనుగొన్నారు.
2.  నెప్ట్యూన్ గ్రహాన్ని కనిపెట్టి ఈమధ్యే ఒక్క సంవత్సరం మాత్రమే అయింది.

వివరణ :  నెప్ట్యూన్ గ్రహాన్ని 1846లో కనిపెట్టారన్నది మనందరికీ తెలిసిన నిజమే. ఇక రెండో విషయానికి వస్తే, మీరు నెప్ట్యూన్ గ్రహం పై ఉన్నారనుకోండి… అక్కడ ఒక సంవత్సరం అంటే 165 భూ సంవత్సరాలతో సమానం. ఎందుకంటే, సూర్యుని చుట్టూ నెప్ట్యూన్ పరిభ్రమణ కాలం 165 భూ సంవత్సరాలు. అంటే 2011 నాటికి నెప్ట్యూన్ ని కనిపెట్టి కేవలం ఒక సంవత్సరం మాత్రమే అయిందన్నమాట.
చెణుకులు :
1) సౌరమండలంలోనే అత్యంత బలమైన గాలులు నెప్ట్యూన్ గ్రహం మీద వీస్తాయి. వీటి వేగం 2100kmH.
2) శని గ్రహానికి మాత్రమే వలయాలు ఉంటాయనుకోవద్దు. గురు, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలకు కూడా వలయాలు ఉన్నాయి.
3) బుధగ్రహంపై ఒక సంవత్సరం, ఒకటిన్నర బుధగ్రహ రోజులతో సమానం.
4) సాధారణంగా ఒక నక్షత్ర కేంద్రంలో 1,60,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది.  ఆ స్థాయి ఉష్ణోగ్రతలో ఒక ఇసుక రేణువు ఉంటే… దానికి 150కి.మీ దూరంలో ఉన్నా చాలు, మనం చనిపోవడానికి.
5) నెప్ట్యూన్ వాతావరణంలో ఉన్న మీథేన్ కారణంగా అది వింతైన నీలం రంగులో కనబడుతోంది.

—————- పులి ఓబుల్ రెడ్డి  
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!