A popular singer……………………..
“ఏం పిల్లో ఎల్ద మొస్తవా?” అని వంగపండు తను గజ్జె కట్టి ఆడుతూ పాడుతుంటే …..ఎక్కడి జనాలు అక్కడ ఆగిపోయేవారు. ఎటు నుంచి ఆ పాట వస్తుందో గమనించుకుంటూ అక్కడి కెళ్లి ఆ పాట మాధుర్యాన్ని ఎంజాయ్ చేసేవారు. వంగపండు ఎంత ప్రతిభావంతుడైన కళాకారుడో,ఆయన పాట అంత ప్రభావవంతమైనది.జనాలను ఇట్టే అయిస్కాంతంలా ఆకర్షిస్తుంది… కట్టి పడేస్తుంది.
వంగపండు పాటలు ఉత్తరాంధ్ర ప్రత్యేక భాషకి చిరునామాగా మారిపోయాయి. వంగపండు ప్రతి పాటలో తాత్వికమైన ఫిలాసఫీ ఉంటుంది. వంగపండు కార్మికుడు .. ఉద్యమాన్ని సాహిత్యాన్ని చూసాడు .. ప్రజల కోసం బతికినోడు.
విప్లవ కవి వంగపండు ప్రసాదరావు గురించి చెప్పుకోవాలంటే …. పదునైన పదాలకు సొంపైన బాణీ కట్టి, తానే స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి, పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు.తన పాటలతో ఉత్తరాంధ్ర జానపద శైలిని తెలుగు నేల అంతటికీ పరిచయం చేశారు. తన పాటలు, రచనలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.
వంగపండు ప్రసాదరావు 1943లో జన్మించారు. పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి ఆయన స్వగ్రామం. జగన్నాథం, చినతల్లి ఆయన తల్లిదండ్రులు.విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్‌గా పనిచేస్తూ ఆయన ప్రజా ఉద్యమాలవైపు నడిచారు.
అనంతర కాలంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం ప్రజా ఉద్యమాలకే కేటాయించారు. 1969 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉవ్వెత్తున సాగిన గిరిజన, రైతాంగ పోరాట కాలంలో ఆయన తన కళా ప్రదర్శనలతో ప్రజాదరణ పొందారు.గద్దర్ తో కలసి 1972లో పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించాడు.
దర్శకులు టి. కృష్ణ, ఆర్.నారాయణమూర్తిలతో పాటు మరికొందరు వారి సినిమాలకు పాటలు రాయమని వంగపండుని కోరారు. అలా 30 సినిమాల వరకు రాశాడు. అలాగే ఆరేడు సినిమాల్లోనూ నటించాడు కూడా. ఆయన పూర్తిగా సినిమాల వైపు దృష్టి పెట్టి ఆయన జీవితం మరోలా ఉండేది.మూడు దశాబ్దాల కాలం లో మూడొందల పాటలకు పైగా జానపదపాటలు రాసిన వంగపండు పేద ప్రజలు, గిరిజనులను చైతన్య పరిచారు.
అలాంటి ప్రజాగాయకుడి పేరిట ఏపీ సర్కార్ స్మారక అవార్డు ను ప్రవేశ పెట్టింది. ప్రధమ వర్ధంతి సందర్భంగా జానపద కళాకారుడు బాడ సూరన్న (శ్రీకాకుళం జిల్లా మందస మండలం )కు వంగపండు పురస్కారాన్నిఅందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో దివంగత వంగపండు ప్రసాద్ విగ్రహాన్ని 4-8-22 న విశాఖ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసారు.