ఆటో చూడు..ఆటో చూడు…అన్ననడిపే స్టైల్ చూడు!

Sharing is Caring...

Ramana Kontikarla ………………………….. 

అతను వృత్తి రీత్యా ఓ ఆటో డ్రైవర్. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక 12వ తరగతికే చదువాపేసిన ఓ కాలేజీ డ్రాపవుట్. కానీ… అతగాడిని కదిలిస్తే చాలు… నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ లు, వైరల్ మార్కెటింగ్ జిమ్మిక్కులు… చరిత్ర, వర్తమానం, స్టీఫెన్ హాకింగ్, ఎకనామిక్ టైమ్స్ కథనాలు, ఫ్రంట్ లైన్ స్టోరీస్… ఇలా ఏదైనా చకచకా మాట్లాడేస్తాడు. అతడి  మాటకారి తనం  ముందు పై చదువులు కూడా చిన్నబోతాయి. అందుకే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలకు, ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థలకూ ఓ కార్పోరేట్ గురువయ్యాడు అన్నాదురై.

మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నందుకు… ఓ సామాన్యుడిగా ఉంటూనే వార్తల్లో వ్యక్తయ్యాడు 37 ఏళ్ల అన్నా.  అన్నా ఆటో అంటే చెన్నైలో ఫేమస్. మరెందుకు.. ఆటో అన్న టెడ్ టాక్ షోలో మాట్లాడే వ్యక్తయ్యాడు… బడా కార్పోరేట్ కంపెనీలకు గురువయ్యాడంటే… ఇతగాడి కస్టమర్ సర్వీస్ తో పాటు… అకాడమిక్ గా చదువాపేసినా, నేర్చుకోవాలనే తపనే అందుకు ప్రధాన కారణం. అన్నా ఆటో ఎక్కితే చాలు కస్టమర్స్ కి వెనుక దినపత్రికలు, వారపత్రికల వంటి వాటితో పాటు… స్నాక్స్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్స్, రిఫ్రెష్ అయ్యేందుకు పానీయాలు, మంచినీళ్లు, చాక్లెట్లు, వేఫర్స్, ఓ చిన్న టీవి సెట్, వైఫై కనెక్టివిటీ, స్వైపింగ్ మిషన్ ఇవన్నీ ఉంటాయి.

అందరిలా మీటర్ పై రేటుకే… వీటన్నింటినీ కస్టమర్స్ కు అందిస్తూ… వాటి గురించి వినియోగదారులడుగుతుంటే విసుక్కోకుండా చెబుతూ.. కస్టమర్ సర్వీస్ లో తనకంటూ ఓ ప్రత్యే’కథ’య్యాడు అన్నా. అందుకే ఇప్పుడీ అన్నా సేవలను ఉపయోగించుకుంటున్న కార్పోరేట్ సంస్థలు, ఐఐటీల వంటి సంస్థలు… వినియోగాదారుడి పట్ల సేవలిందించేవాళ్ల వ్యవహారశైలి ఎలా ఉండాలనే దాని గురించి పాఠాలు చెప్పిస్తున్నాయి. అలా 2013లో తన ఆటోరిక్షాలో వినియోగదారుల కోసం అందిస్తున్న సేవల గురించి తనదైన శైలిలో అన్నా ఇచ్చిన ప్రసంగం ఆయన్ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది.

అలా వొడాఫోన్, హ్యుందాయ్, టయోటా,  రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి పెద్ద సంస్థల్లో తన అనుభవాలను పంచుకుంటూ… IIT, ISB వంటి విద్యాసంస్థల్లోనూ తన జీవన ప్రస్థానాన్ని అక్కడి విద్యార్థుల కళ్ల ముందుంచుతూ… TEDx వంటి టాక్ షోస్ లోనూ పాల్గొని ఆశ్చర్యపర్చాడు ఈ ఆటోడ్రైవర్. నిజాయితీ… నేర్చుకోవాలనే తపన ఉంటే… ఆటోడ్రైవరైనా అట్నుంచి ఇటు, ఇట్నుంచటు స్టీరియోటైపిక్ ట్రిప్పులకే పరిమితం కాకుండా… అంతకుమించి జీవితంలో ప్రయాణించవచ్చని నిరూపించాడు అన్నా.  

తమిళనాడు తంజావూరు జిల్లా పెరవురాని అన్నా జన్మస్థలం. నాలుగేళ్ల వయసులో తన కుటుంబంతో చెన్నైకి తరలివెళ్లాడు. తండ్రీ, అన్నయ్య ఇద్దరూ ఆటో డ్రైవర్లే. అందుకే అన్నా కూడా దాన్నే బతుకుదెరువు చేసుకున్నాడు. ఓ బడా వ్యాపారవేత్త కావాలనే కలగనేవాడట అన్నా. కానీ ఆర్థిక సంక్షోభంతో…  12వ తరగతిలోనే చదువు మానేసి.. ఆటో ఎక్కేలా చేసింది బతుకుచిత్రం.  మనకు ఎల్ఐసీ ఆఫీసులకు వెళ్లినప్పుడుగానీ… ఇంకా పలు కార్యాలయాల్లో వినియోగదారుడే దేవుడనే మహాత్ముడు చెప్పిన కోట్ తో కొన్ని సైన్ బోర్డులెలాగైతే కనిపిస్తాయో… అదే మోటో అన్నాది.

ఆటో అంటే కేవలం ప్యాసింజర్స్ ని తరలించడమే కాదు… అంతకుమించని గ్రహించాడు. ఐటీ కారిడార్స్ లో ఆటోలో వెళ్లినప్పుడు ట్రాఫిక్ జామైతే… ఆటోల్లో సాఫ్ట్వేర్ స్యావీలు చూపించే అసహనాన్ని అర్థం చేసుకుని ఆటోలోనే వైఫై సేవలనూ అందిస్తున్నాడు అన్నా. అంతేకాదు.. ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్సూ ఆటోలో ఎప్పుడూ రెడీ. అలా ఆటోలో వచ్చే కస్టమర్లతో తానందిస్తున్న సేవల తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో.. అన్నా ఇప్పుడు అన్నాదురై అంత ఫేమస్సయ్యాడు.అన్నా ఆటో అంటే కంప్లీట్ లేటెస్ట్. నేటి టెక్నాలజీకి  తగ్గట్టుగా కనిపిస్తుంది. వర్షం పడితే ఛత్రీలు కూడా రెగ్యులర్ గా తన ఆటోలో ప్రయాణించే వారికిస్తుంటాడు. వాళ్లూ అంతే విశ్వాసంగా తమ పని అయిపోగానే తెచ్చిస్తుంటారని చెబుతాడు అన్నా. అంతేకాదు అసలు బిజినెస్ టైకూన్స్ కూడా ఆశ్చర్యపోయే టాక్టిజం అన్నా సొంతం. తన ఆటోలో 20 ట్రిప్పులు ప్రయాణిస్తే… 250 రూపాయల మీటర్ రేట్ వరకూ మళ్లీ వాళ్లకు ఫ్రీ సర్వీసివ్వడం… 40 నుంచి 50 ట్రిప్పులైతే… 500 నుంచి 1000 రూపాయల వరకూ మీటర్ పై ఫ్రీ కూపన్స్ ఇస్తాడు.

చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే  సందర్భాలలో  ఫ్రీగా తీసుకెళ్తుండటం.. ఒకవేళ ఎవరైనా చెన్నైలో టీచర్ గా పనిచేస్తుంటే వారికి వారంలో ఒకరోజు ఫ్రీగా సర్వీసివ్వడం వంటివి చేస్తుంటాడు. ఎందుకంటే ఇంజనీర్లైనైనా, డాక్టర్లనైనా, ఐఏఎస్ లనైనా తీర్చిదిద్దేది గురువులే కాబట్టి.. గురుభక్తిని చాటుకుంటుంటాడు అన్నా.

నెలకు ఆటోడ్రైవర్ అన్నా సంపాదన 1 లక్షా పద్దెనిమిది వేలైతే… ఆటోలో ఇతను కల్పించే అన్ని సౌకర్యాలకు ఖర్చయ్యేది కేవలం 19 వేల రూపాయలు మాత్రమే. ఇదంతా చేస్తుంటే… మొదట్లో కుటుంబసభ్యులు, మిత్రులు ఇంత లగ్జరీ సౌకర్యాలేంటి అంత డబ్బులు ఖర్చుపెట్టి అని లొల్లి పెట్టారట. కానీ బిజినెస్ ట్రిక్స్ ని అంచనావేయగల్గిన అన్నా.. తన పంథాలోనే  ఆటో నడుపుతుంటాడు. కరోనా విపత్తు సమయాన… పైన చెప్పుకున్న సౌకర్యాలకు తోడు… శానిటైజర్సూ, మాస్కులూ కూడా వచ్చి ఇప్పుడు అన్నా ఆటోలో చేరాయి. అందుకే అన్నాదురై వార్తల్లో వ్యక్తి…అది అతని  ఓ ప్రత్యే’కథ’!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!