ఆస్ట్రేలియా ఆదివాసీ ఆత్మకథ… ‘నీలి నీడ’ !

Sharing is Caring...

పూదోట శౌరీలు …………………………………………………

Exploitation of australian tribal ………………………….1798లో మొదలైన బ్రిటిష్ వలసలు ఆస్ట్రేలియా ఆదివాసీల జీవితాల్లో కల్లోలాన్ని సృష్టించాయి.వేల ఏళ్ల వారి సంస్కృతి,సహజీవనం,స్వాతంత్ర్యం సర్వ నాశనమయ్యాయి.మొదట్లో బ్రిటన్ నుండి నేరస్తులను పంపే ”కాన్విక్ట్ కాలనీ”గా మాత్రమే ఉపయోగ పడ్డ ఆస్ట్రేలియా మెల్లగా బ్రిటిష్ వలసవాదులకు ఓ స్వర్గంగా మారిపోయింది.

‘భూమిని అతి పవిత్రంగా భావించే ఆస్ట్రేలియా ఆదివాసీలకు మొట్ట మొదట దూరమైంది వాళ్ళు వేలాది ఏళ్లుగా నివసిస్తున్న ఆ భూమే’ ”మనుషులు భూమికి చెందుతారు కానీ భూమి మనిషికి చెందదని నమ్మేఆదివాసీలను ”బ్రిటిష్ వారు బానిసలుగా మార్చుకున్నారు.వేలాదిమందిని క్రూరంగా చంపేశారు.వాళ్ళతో ”హ్యూమన్ గోల్ఫ్”ఆడుకున్నారు.

నీటి గుంటల్లో విషం కలిపారు.విషం కలిపిన గోధుమ పిండి,చక్కెరను ఆదివాసీలకు పంచారు.బ్రిటన్ లో ప్లేగు,కలరా రోగ పీడితులు వాడిన రగ్గులను ఆదివాసీలకు పంచిపెట్టారు.ఇవన్నీ తట్టుకుని బతికిన కొద్దిమందిని ”రిజర్వ్”ల్లోకి తరలించారు.ఇలాంటి దారుణమైన అనుభవం నుంచి ఇలాంటి దారుణాలకు వ్యతిరేకంగా ఆదివాసీ ఉద్యమాలలో భాగంగా వచ్చిందే ఆదివాసీ సాహిత్యం.

తమ అనుభవాలను తమ వారితో పంచుకునే ప్రయత్నం చేస్తూనే మరో వైపు తెల్లజాతి వారికి తమ నిరసన తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తుందీ సాహిత్యం.ఆత్మకతలోనే జాతి కతనుకూడా పొదుగుతుందీ సాహిత్యం. రిజర్వ్ ల్లోకి తరలించిన ఆదివాసీల మీద సంపూర్ణ ఆధిపత్యం తెల్లవాళ్ళదే.ఇక్కడ ఎక్కువ నలిగిపోయిందీ…నష్టపోయింది…ఆదివాసీ ఆడవాళ్లేనని చెప్పాలి.

తెల్లవారి కామదాహానికి..క్రూరత్వానికి బలైన ఆదివాసీ స్రీలు మాతృత్వాన్ని గూడా ఆస్వాదించలేక పోయారు.తెల్లవారి రక్తం పంచుకు పుట్టిన పిల్లలను పెంచటానికి ఆదివాసీ స్రీలు అర్హులు కారని విద్య పేరుతో పిల్లలను అయినవారికి,ఆదివాసీ సంస్కృతికి దూరం చేశారు.

అనాధలైన ఆదివాసీ పిల్లలను క్రిస్టియన్ మిషన్ లలో చేర్చి అక్కడ వారికి తెల్లవారి ఇళ్ళలో పనిచేయటానికి తగిన శిక్షణ ఇచ్చేవాళ్లు.అలాంటి ఒక మిషన్ కే ”వాండరింగ్ మిషన్”అని పేరు.అలాంటి వాండరింగ్ మిషన్ లో పెరిగిన ”వాండరింగ్ గర్ల్””గ్లెనైస్ వార్డ్”.ఆమె సొంతకథే ఈ ”నీలినీడ”. దీన్ని ఇంగ్లిష్ నుండి తెలుగు లోకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కె.సునీతారాణి గారు అనువదించారు.

ఈమె ఇంకా ఎన్నో అనువాదాలు చేశారు.”దారులు తప్పించుకునే దారులు”మరాఠీ  నుండి తెలుగులోకి, శ్రీలంక స్త్రీలపై”ద్వీపరాగాలు”అనే పుస్తకం,ఇంకా అనేక కథలు,వ్యాసాలు,కవితలు వివిధ పత్రికలలో వచ్చాయి.అణగదొక్కబడిన వర్గాల గొంతులు వినిపించే సాహిత్యమంటే వీరికి మక్కువ ఎక్కువ.

ఇక కథలోకి వస్తే గ్లెనైస్ వార్డ్ పుట్టిన కొద్దిరోజుల్లోనే తల్లి నుండి వేరుచేయబడి ”సెయింట్ జోసెఫ్స్ అనాధాశ్రమానికి అక్కడినుండి మూడేళ్ళ వయసులో ఈ మిషన్ కి తీసుకురాబడుతుంది.తండ్రిని ఎరగదు.వాండరింగ్ మిషన్ లో నన్స్,బ్రదర్స్,ఫాదర్ లు పిల్లలకు పనులు చేయడంలో శిక్షణ ఇచ్చి వారు పెద్దవారు అయిన తర్వాత తెల్లవారి ఇళ్ళలో పని చేయడానికి పంపేవారు.

ఆడపిల్లలకు,మగ పిల్లలకు వేరువేరుగా చాలా క్రమశిక్షణ తో కూడిన శిక్షణ ఇచ్చేవారు.ఆడపిల్లలకు ఇల్లు వూడవటం,కడగటం,గిన్నేలు తోమటం,బట్టలుతకటం,వంట,అలంకరణ,పశువులు,పందులు కాయటం,తోటపని ఒకటేమిటి ఇంటికి సంబంధించిన అన్ని పనులు నేర్పేవారు,మగపిల్లలకు వృత్తి విద్యలు నేర్పేవారు.

ఈ పనులతో పాటు చదువు,సంగీతం గూడా నేర్పేవారు.కానీ నన్స్,బ్రదర్స్ పిల్లలను ఎంతో ప్రేమగా చూసేవారు.ఈ అనాధలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా,ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తిమంతులుగా తీర్చిదిద్దేవారు.క్రిస్మస్ పండుగకు పసందైన విందుతో పాటు అనేక కానుకలు ఇచ్చేవారు.

అలా శిక్షణ పొందిన గ్లెనెస్ తన పదహారేళ్ళ వయసులో ఒక పెద్ద పట్టణానికి లార్డ్ మేయర్ అయిన మిస్టర్ బిగిలో ఇంటికి పనిమనిషి గా వెళుతుంది.ఇక ఆ ఇంట్లో మిసెస్ బిగిలో పెట్టె కష్టాలు అన్నీ,ఇన్నీ కావు.గ్లైనెస్ తో మాట్లాడటానికి ఆమె మొహం చూడటానికి గూడా ఇస్టపడదు.ఎందుకంటే ఆమె ఆదివాసీ బ్లాక్ గర్ల్. రోజంతా చేయాల్సిన పనులు ఒక కాగితం పై రాసిచ్చేది..మిసెస్ బిగిలో భర్త వెంట మీటింగ్ లకు ఇతర కార్యక్రమాల కోసం తరచుగా బయటకు వెళ్తువుంటుంది.

పెద్ద ఇల్లు,అందులో బోలెడన్ని గదులు,ఇంటి ముందు వెనుక పెద్ద పెద్ద తోటలు,పెంపుడు కుక్కలు,బాతులు,ఇంటిని ఆనుకుని పొలం,అందులో పండ్ల చెట్లు,మొత్తానికి వారుండేది ఒక పెద్ద్ ఫార్మ్ హౌస్. పై వాటి సంరక్షణ తో పాటు వంట చేయటం,ఫైర్ ప్లేస్ కోసం కట్టెలు కొట్టటం, దాన్ని శుభ్రం చేయటం,కార్ కడగటం ఒకటేమిటి అన్నీ పనులు ఆమెవే…గ్లైనెస్ రోజంతా పనులతో సతమతమవుతూ వుంటుంది.

మిసెస్  బిగిలో చాలిచాలని తిండి  పెట్టేది. ”ఏయ్ …హుష్…బ్లాక్ గర్ల్…బ్లాక్  అనే పిలుపులతో ఎండిపోయిన రొట్టెముక్కలను సొట్టలు పడ్డ సత్తు పళ్ళెంలో విసిరేది.కుక్కలతో పాటు కార్ గారేజ్ లో పడక. చివరికి బ్లాక్..బ్లాక్..బ్లాక్ గర్ల్ అనే పిలుపు వినివినీ తన సొంత పేరునే మర్చిపోయినట్లు అవుతుంది గ్లైనెస్.

పొద్దున్నే మిష్టర్,మిసెస్ బిగిలో ఆమె ఇద్దరు కొడుకులు టౌన్ కి వెళ్లిపోగానే మరో మనిషి కానరాక,పలకరించి, మాట్లాడే వాళ్ళు లేక మూగది అవుతుంది గ్లైనెస్.ఒకరోజు బాతుల గుడ్లు ఎరటానికి పొలం వైపు వెళ్తుంది.అక్కడ్ గ్లైనెస్ కి పొలంలో పనిచేస్తున్న ”బిల్’ అనే ముసలాయన కనిపిస్తాడు.

ఆమెకు మరోమనిషి కనపడ్డందుకు పట్టరాని సంతోషంకలుగుతుంది. బిల్ ఎంతో ప్రేమతో మాట్లాడటమే కాక పనుల్లో సాయం చేస్తుంటాడు.ఆ అమ్మాయి లో తన కూతురును చూసుకుంటుంటాడు.ఆ రోజు నుండి మిసెస్ బిగిలో బయటకు వెళ్ళగానే బిల్ ఇంటికి వస్తాడు.అతనికి ”టీ”ఇవ్వటం,పియానో మీద సంగీతం వినిపించటం చేస్తుంది.

బిగిలో బయటకు వెళ్లడమే  ఆలస్యం ఇంట్లో వున్న పళ్ల రసాలు,కేకులు,పండ్లు,మాంసం కడుపు నిండా తింటుంది.మేడమ్ బాత్రూమ్ లోకి వెళ్ళి రకరకాల సబ్బులు,షాంపూలతో బాత్ టబ్ లో స్నానం చేస్తుంది కటికనేల మీద పడుకునే గ్లైనెస్ మిసెస్ బిగిలో లేనప్పుడు ఆమె పట్టుపరుపుల పై పడుకుంటూ,ఆమె వస్తువులు వాడుకుంటూ వుంటుంది.యజమానురాలు వచ్చేసరికి ఏమి ఎరగనట్లు కస్టపడి,చెమటోడొడ్చి పని చేస్తున్నట్లుగా కనపడేది.

బిగిలో ప్రిడ్జ్ లో ఖాళీ అయిన గిన్నెలను చూసి తన కొడుకులే తింటున్నారనుకునేది.ఈ విధంగా బిగిలో పెట్టె బాధలు తట్టుకోలేకుండా వుంటుంది గ్లైనెస్.ఏడాదికొకసారి రెండు వారాలు సెలవు లిచ్చేది.తల్లితండ్రులు లేనిది కాబట్టి సెలవులకు ”వాండరింగ్ మిషెన్ కే వెళ్తుంది.అలా వెళ్ళినపుడు నన్స్,బ్రదర్స్ బాగా చూసుకునే వాళ్ళు.ఇలా సెలవుల కోసం వచ్చిన ఇతర అమ్మాయిలు కలిసి వాళ్ళ వాళ్ళ మేడమ్ లు పెట్టె కష్ట,సుఖాలు కలబోసుకునేవాళ్లూ..

ఒకరోజు బిగిలో మార్కెట్ కి తీసుకుని పోయినపుడు తనతో పాటు మిషన్ లో శిక్షణ పొందిన ”ఆనీ”అనే అమ్మాయి కలుస్తుంది.”అనీ”తన యజమానురాలు తనను ఎంతో ప్రేమతో చూస్తుందని,వాళ్ళతో పాటే వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద వాళ్ళతో పాటే తింటానని..ఆమె పిల్లలతో పాటే అన్నీ కొనిస్తుందని చెబుతుంది.గ్లైనెస్ తన దుస్తితికి ఎంతో బాధపడుతుంది.

”మిషన్ లో ‘తాను నేర్చుకున్న”దొంగతనం చేయగూడదు,..అబద్దాలాడరాదు,”అన్న నియమాలను అతిక్రమించానని, తనకు కడుపు నిండా కూడు పెడితే దొంగతనం చేసే అవసరముండేది కాదు గదా అనీ కన్నీళ్లు పెట్టుకుంటుంది,.బిగిలో తన ఇంటిలోనే గాకుండా వారానికి ఒకసారి తన కూతురు ఇంటికి తీసుకుని పోయి అక్కడ అంతా పని చేయిస్తుంది.ఇక ఈ భాధలు పడలేననుకుంటుంది.బయట పడే మార్గం వెతుకుతుంది.

చివరకు అపుడప్పుడు తనను ప్రేమతో పలకరించే బిల్ గూడ ముసలితనం తో అక్కడ పని చేయలేక వెళ్లిపోతూ ”అమ్మాయ్ ఇది నువ్వుండదగ్గ చోటు కాదు…కష్టపడి పనిచేసే నీలాంటి మంచి అమ్మాయికి మంచి జీవితం తప్పక దొరుకుతుంది…వెళ్ళు..వెళ్ళి వెతుక్కో”..అని చెబుతాడు.అప్పుడు స్నేహితురాలు ”కేలిన్”సాయంతో ఆ ఇంటినుండి బయట పడి ఒక హాస్పిటల్ లో నర్స్ గా చేరుతుంది గ్లైనెస్.

”చార్లీ”అనే యువకుడి ని పెళ్లి చేసుకుంటుంది..రచయిత్రి గ్లైనెస్ తన ఎనిమిదేళ్ళ బాబు బ్రియాన్ ఓషన్,పదేళ్ళ పాప జోడీ లను చూసుకుంటూ సమాజంలో తన పిల్లలు ఇంకొకరి పనిమనుషులుగా ఉండకూడదు,వాళ్ళు డాక్టర్ గానో,లాయర్ గానో స్థిరపడాలి… మానవ జాతిలో సమానత్వం సాధించాలి అనుకుంటుంది.తల్లితండ్రులేవరో తెలియని ఒక అమ్మాయి వాండరింగ్ మిషన్ లో పెరిగి,పనిపిల్లగా ఎన్నో కష్టాలు పడి,రాటుదేలి,ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని తనే ఎలా నిర్మించుకుందో, ఒక గొప్ప రచయిత్రిగా ఎలా పేరు తెచ్చుకుంది ఈ ”నీలినీడ”చదివితే తెలుస్తుంది.. ప్రతులకు హైదరాబాద్ బుక్ ట్రస్ట్..ధర…30/రూ…పేజీలు…100.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!