ఆకట్టుకునే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ !

Sharing is Caring...

Movie on Child Trafficking …………………………

కర్మ యోధ ..మలయాళ సినిమా ఇది. తెలుగులో ఏ జీ పీ మాధవ గా డబ్ చేశారు. ఈ చిత్రం విడుదలై సరిగ్గా పదేళ్లు అవుతోంది. ఆడపిల్లలను కిడ్నాప్ చేసి .. వారిని వ్యభిచార ముఠాలకు అమ్మే అంశాన్ని ప్రధాన కథ గా మలుచుకుని యాక్షన్ థ్రిల్లర్ గా తీశారు. మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. మేజర్ రవి ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకు ఎక్కించారు.

ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ లో మిస్టరీ ఎలిమెంట్‌  ఎక్కువగా ఉండటం తో  ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. కథనం స్పీడ్ గా సాగుతుంది. కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే మాధవ మీనన్ (మోహన్‌లాల్) ఒక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. ముంబై లో డీసీపీ గా పనిచేస్తుంటాడు.  కిడ్నాప్ అయిన కూతురిని వెతికేందుకు  స్వయంగా రంగంలోకి దిగుతాడు. దిగాక మరెందరో అమ్మాయిలు కూడా కిడ్నాప్ అవుతున్నారని తెలుస్తుంది. ఆ ట్రాఫికింగ్ ముఠా మూలాలు తెలుసుకుని కూతురిని రక్షించుకుంటాడు.

చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు పిల్లలను ఎలా ట్రాప్ చేస్తారు ? ఒక చోట నుంచి మరోచోటుకి ఎలా తరలిస్తుంటారు ? ఏయే జాగ్రత్తలు తీసుకుంటారు? ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తుంటారు అనే అంశాల చుట్టూ కథ అల్లుకున్నారు. అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి కంటైనర్లలో తరలించే దృశ్యాలు.. తరలించే ముఠా సభ్యులు ఆ అమ్మాయిలపై  లైంగిక దాడికి పాల్పడే సీన్లు గగుర్పాటు కలిగిస్తాయి. ట్రాఫికింగ్ ముఠా సభ్యులు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తారో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

సినిమా మొత్తం వేగంగా .. ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదే. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. యాక్షన్ సినిమా కాబట్టి ఫైట్స్ సహజం…అవసరాన్నిబట్టి అవి తీశారు. ఇక మోహన్ లాల్ విజృంభించి నటించాడు. స్టోరీ లైన్ కి తగినట్టే దర్శకుడు మేజర్ రవి అనవసరమైన సన్నివేశాలు లేకుండా కథనాన్ని అల్లుకుని తెర కెక్కించారు.

ప్రదీప్ నాయర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్. జెఫ్రీ జోనాథన్ సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ కథకు కరెక్టుగా సూట్ అయింది. కథలో కొన్ని సన్నివేశాలు లాజిక్‌ కు అందవు. అయినా వాటిని ప్రేక్షకులు పట్టించుకోరు. కథలో లీనమైపోతారు. విలన్ గా  మన తెలుగు నటుడు మురళీ శర్మ బాగా చేశారు అని చెప్పుకోవాలి. మిగతా పాత్రధారులు కూడా పాత్రల పరిధిలో బాగానే చేశారు.

మోహన్ లాల్  హిట్ మూవీస్ లో ఇది ఒకటి. ‘కర్మ యోధ’ పబ్లిసిటీ పోస్టర్స్ లో హీరో  మోహన్ లాల్ సిగార్ పట్టుకొని కనిపించినందుకు కేరళ ఆరోగ్య శాఖ ఆయనపై కేసు నమోదు చేసింది. అప్పట్లో అదొక సంచలన వార్త. చిత్ర దర్శకుడు మేజర్ రవి, నిర్మాణ సంస్థ మేనేజర్, సినిమా ప్రదర్శితమవుతున్న మూడు థియేటర్ల మేనేజర్లకు కూడా సమన్లు జారీ చేశారు.సినిమా తెలుగు వెర్షన్ యూట్యూబ్ లో ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. 

———-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!