ఆసిఫ్ మేజిక్ ఈ కళాఖండం.. 2

Sharing is Caring...
Taadi Prakash ……………………………….. 

బడేగులాం అలీఖాన్‌ పాట
సలీం అనార్కలిని వెన్నెల వేళ ఉద్యానవనంలో కలుసుకున్నపుడు బ్యాక్‌గ్రౌండ్లో ఒక పాట వుండాలనీ, అది ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ పాడితే అద్భుతంగా వుంటుందనీ ఆసిఫ్‌ అనుకున్నారు. హిందుస్థానీ సంగీత హిమాలయంగా పేరుగాంచిన బడేగులాం సినిమా పాట పాడటమా? అయ్యే పని కాదు. అయితే బడేగులాం గౌరవించే నౌషాద్‌ అలీ అడిగితే పని జరగొచ్చు అని ఆసిఫ్‌ అంచనా.

ఇద్దరూ కలిసే వెళ్ళారు. నౌషాద్‌ బెరుకుబెరుగ్గానే బడేగులాంని అడిగారు. సినిమా పాట పాడనని ఆయన తెగేసి చెప్పారు. రెమ్యునరేషన్‌ భారీగా యిస్తాము అన్నాడు ఆసిఫ్‌. వాళ్ళని వొదిలించుకోవాలనే ఉద్దేశంతో పాటకి 25 వేలు యిస్తారా? అని అడిగారు బడేగులాం. సర్రున చెక్కుతీసి సగం డబ్బు అడ్వాన్స్ యిచ్చాడు ఆసిఫ్‌. పెద్దాయన కాదనలేకపోయాడు. ఇలా పాడితే సరిపోతుందా? అంటూ పాట మొదలుపెట్టి కచేరీ చేసే అలవాటు ప్రకారం బడేగులామ్ మూడు గంటలసేపు ఇరగదీసి, ఇది సరిపోతుందా? అని అడిగారు.

కంగుతిన్న నౌషాద్, అయ్యా మొత్తం సినిమానే మూడుగంటలు వుంటుంది. మీ పాట అయిదారు నిమిషాలుంటే చాలు అన్నారు. చెప్పవేం అలాగే చేద్దాం అని ఐదున్నర నిమిషాలకు కుదించి పాడారట. అప్పట్లో స్టార్‌ సింగర్స్ రఫీ, లతామంగేష్కర్‌ పాటకి మూడు నాలుగొందల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. అదన్నమాట బడేగులాం అలీఖాన్‌ లెవెల్‌ ! మొగలే ఆజంలో పాడిన రెండు పాటలకు ఆయనకి ఆసిఫ్‌ 50 వేలు పారితోషికంగా ఇచ్చారు. బడే గులాం పాడిన “ప్రేమ్‌ జోగన్‌ బన్‌కే ” గీతం ఎప్పటికీ ఎవ్వర్‌గ్రీన్ గానే నిలిచి వుంటుంది.

సినిమా నిడివి విపరీతంగా పెరిగిపోవడంతో మొత్తం 20 పాటల్ని 12కి కుదించారు. సినిమాలో కీలకమైన “ప్యార్‌ కియాతో డర్నా క్యా” పాట లిరిక్స్ షకీల్‌ బదాయుని రాసినా నౌషాద్‌కి నచ్చలేదు. నౌషాద్‌ ఇంట్లో ప్రత్యేకంగా సిటింగ్‌ వేసి ఒక రాత్రి అంతా సీరియస్‌గా చర్చించారు. ” నేను ప్రేమించాను. అంతే…దొంగతనం మాత్రం చేయలేదు” అనే అర్ధం వచ్చే ఉత్తరప్రదేశ్‌ జానపద గీతాన్ని నౌషాద్‌ గుర్తు చేసి, అలా బావుంటుందని సూచించారు. ” ప్యార్‌ కియ కోయి చోరీ నహీ”అని షకీల్‌ రాశారు. పాట ఫైనల్‌ అయింది.

అక్బర్‌ ఎదుట, శీష్‌ మహాల్లో (అద్దాల మేడ ) అనార్కలి ఆ పాట పాడాలి. వందలవేల అద్దాలతో మెరిసిపోయే శీష్‌ మహల్‌ కోసం బెల్జియం నుంచి ప్రత్యేకంగా అద్దాలు తెప్పించారు. మొగలే ఆజమ్‌ బ్లాక్ అండ్ వైట్‌ సినిమా. ఏళ్ళ తరబడి నిర్మాణం జరుగుతుండడంతో, అప్పటికి కలర్‌ ఫిల్మ్‌ల నిర్మాణం మొదలైపోయింది. ఆసిఫ్‌ పట్టుబట్టడంతో ప్యార్ కియాతో డర్నా క్యా పాట వరకూ కలర్‌లో షూట్‌ చేశారు.

ఆ రోజుల్లో ఆ ఒక్క పాటకే 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అప్పట్లో అది ఒక సినిమాకి అయ్యే ఖర్చు, ఆ సూపర్‌ హిట్ పాటని లతామంగేష్కర్ పాడారు. ఆమె ఉర్దూ ఉచ్ఛారణ స్వచ్ఛంగా లేదని హీరో దిలీప్ కుమార్‌ అన్నారు. దాంతో ఉర్దూ పండితులతో లతకి క్లాసులు చెప్పించి, ఆమె దోషాలు సవరించుకునేలా చేశారు. ఆ పాట పాడేటపుడు ప్రతిధ్వని(ECO) రావాలని నౌషాద్‌ భావించారు.

అలా ప్రతిధ్వని వచ్చే ఆధునిక టెక్నాలజీ ఆ కాలంలో లేదు. అంచేత రికార్డింగ్‌ స్డూడియోలో పింగాణీ టెయిల్స్‌ తాపడం చేసి వున్న బాత్‌రూంలో ఆ పాట పాడాలని నౌషాద్‌ లతకి చెప్పారు. అలా ఆ సంగీత దర్వకుడు కోరుకున్న ఎఫెక్ట్‌ సాధించారు. క్లయిమాక్స్‌లో ” జిందాబాద్‌, జిందాబాద్‌, హే మొహబ్బత్ జిందాబాద్‌” అని రఫీ హై పిచ్‌లో పాడే పాట వుంటుంది. దానికి వందమంది కోరస్‌ పాడారట.కాదు. వెయ్యి మంది కోరస్‌ పాడారని మరికొందరు అంటారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ పాట ‘మెహే పన్‌ ఘట్‌ పే…’ ఈ సినిమాలో ప్రత్యేకమైనది. అప్పటి ప్రసిద్ద డైరెక్టర్‌ విజయ్‌ భట్‌ దీనికి అభ్యంతరం చెప్పారు. మొగలే ఆజమ్‌తో ఆయనకి సంబంధం లేకపోయినా, అక్బర్‌ చక్రవర్తి పాలనలో హిందూ పండగ సెలబ్రేట్‌ చేయడం సినిమాని దెబ్బతీస్తుందని భట్‌ అన్నారు. అక్బర్‌ లౌకికవాది అనీ, పైగా పాటలో జోదాభాయ్‌ (దుర్గ ఖోటే) వుంటుందనీ నౌషాద్ అలీ చెప్పారు. ఈ అర్ధం ధ్వనించేలా ఒక డైలాగ్‌ కూడా చొప్పించారు.

Perfectionist… జగమొండి ఆసిఫ్‌…. సినిమాలో ప్రతి చిన్న డీటేయిల్‌ కూడా ఫర్‌పెక్ట్‌గా వుండేలా, ఎక్కడా రాజీలేకుండా చిత్రీకరించే వాడు ఆసిఫ్‌. అగ్రనటుడు పృథ్వీరాజ్‌ కపూర్‌ అక్బర్‌ పాత్రలో అరిపించారు. ఒక సన్నివేశంలో కొడుకు సలీం(దిలీప్ కుమార్‌) నడిచి ముందుకువెళ్ళి తండ్రిని ప్రశ్నించాలి. దిలీప్ నడక ఆసిఫ్‌కి నచ్చలేదు. “వీడికి బంగారు బూట్లు చేయించండి” అన్నాడు.

నిర్మాతలు ఆశ్చర్యపోయారు. పసుపు రంగు బూట్లు వేస్తే సరిపోతుందిగా, అయినా బూట్లెవరు చూస్తారు? అని అడిగారు. బంగారు బూట్లు సిద్ధం చేయాల్సిందే అన్నాడు ఆసిఫ్‌. దిలీప్ ఆ బూట్లు వేసుకున్నాక “పుట్‌పాత్‌ మీద పళ్ళు అమ్ముకునే వాడి కొడుకువి కావు నువ్వు, అక్బర్ చక్రవర్తి కొడుకువి, కాబోయే పాదుషావి. గంభీరంగా, హుందాగా నడవాలి” అన్నాడు ఆసిఫ్‌.

ఒకప్పుడు దిలీప్‌కుమార్‌ తండ్రి పళ్ళు అమ్ముకునే వాడట. మరో ముఖ్యమైన సన్నివేశం… అనార్కలిని జైల్లో బంధిస్తారు. సంకెళ్ళు వేస్తారు. ” మొహబ్బత్‌కి ఝూటీ…జవానీ పే రోయీ…” అనే గుండెల్ని మెలి పెట్టే విషాదగీతం వుంటుంది. మామూలుగా తేలికపాటి చెక్కతో చేసిన సంకెళ్ళు వేస్తారు. మధుబాల మొహంలో సరైన EXPRESSION పలకడం కోసం ఒరిజినల్‌ ఉక్కు సంకెళ్ళు వేయాలని ఆదేశించాడు దర్శకాసురుడు.

ఆ ఇరవై కిలోల సంకెళ్ళ భారం మోస్తూ మధుబాల నటించాల్సి వచ్చింది. అప్పటికి ఆమె గుండె జబ్బుతో ఉందికూడా. మరోసీన్‌లో, అనార్కలి మెడలో ముత్యాలహారం తెగి, గచ్చు మీద ముత్యాలు దొర్లిపోతాయి. ఖరీదైన,నిఖార్సయిన మంచి ముత్యాలు తెప్పించి హారం రెడీ చేయమన్నాడు ఆసిఫ్. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫిల్మ్‌కి ఇంత వోవర్‌ యాక్షన్‌ తగదనీ ప్లాస్టిక్‌ పూసలు చాలు కదా అని నిర్మాత మొత్తుకున్నా దర్శకుడు ఒప్పుకోలేదు.

ఖరీదైన ముత్యాలే తెప్పించారు. సినిమా నిర్మాణంలో ఇలాంటి గొడవలు జరిగినపుడు ఆసిఫ్‌ వాకౌట్‌ చేసి వెళిపోయేవాడు. షూటింగ్‌ కొన్ని నెలలు ఆగిపోయేది. అందుకే నిర్మాణం పూర్తి కావడానికి తొమ్మిదేళ్ళు పట్టింది. నిర్మాత షాపూర్‌జీ పల్లోంజి మరికొందరు ఆసిఫ్‌ మీద పూర్తి నమ్మకంతో దర్శకుడి వేషాలన్నీ భరించారు. ఒక పక్క సినిమా అపురూపంగా సిద్ధం అవుతోందనీ, బాక్సులు బద్దలు అవడం ఖాయమనీ వాళ్ళకి అర్ధం అవుతూనే వుంది.

అనార్కలి వుందా? ప్రేమ కథ నిజమేనా ?

అక్బర్‌ చక్రవర్తికి లేక లేక కొడుకు పుడతాడు. జోధాభాయికి సేవలు చేసే ఒకామె ఈ శుభవార్త అక్బర్‌ చెవిన వేస్తుంది. పరమానంద భరితుడై చక్రవర్తి వేలి వుంగరం బహుమతిగా ఇస్తాడు. ఎప్పుడైనా ఒక కోరిక కోరుకో, చెల్లిస్తా అంటాడు. ఆ సేవకురాలు అనార్కలి తల్లి! పెరిగి పెద్దవాడైన సలీం బాధ్యతారహితంగా తిరుగుతున్నాడని కలత చెందిన అక్బర్, కొడుకుని యుద్ధానికి పంపిస్తాడు.

తిరిగి వచ్చాక అక్బర్‌ ఆస్థాన డాన్సర్లలో ఒకరైన నాదిరాని యిష్టపడతాడు. అక్బర్ ఆమె కళ చూసి ‘అనార్కలి’ (దానిమ్మ మొగ్గ) అంటాడు. సలీంతో అనార్కలి గాఢమైన ప్రేమలో వుందని గమనించిన మరో ఆస్థాన నాట్యకారిణి ప్రేమ రహస్యం బైటపెడుతుంది. అక్బర్‌ ఆగ్రహంతో వూగిపోతాడు. అది జరగని పని అంటాడు. సైన్యాన్ని పోగేసిన సలీం, తండ్రిపై యుద్దానికి వెళతాడు. ఓడిపోతాడు. సలీంకి మరణశిక్ష వేస్తాడు చక్రవర్తి. అయితే ఎక్కడో దాక్కుని వున్న అనార్కలి వచ్చి, యీ శిక్షకి తాను సిద్ధం అంటే సలీంని వదిలేస్తామని చెబుతారు. బైటికి వచ్చిన అనార్కలి సరే అంటుంది. ఆమెని సజీవ సమాధి చెయ్యాలని అక్బర్ ఆదేశం.

శిక్షకి ముందు కొన్ని గంటలు సలీంతో గడిపే అవకాశం యివ్వాలని అనార్కలి అభ్యర్థిస్తుంది. అందుకే ఓ షరతు పెడతాడు అక్బర్‌, ఆమె సజీవ సమాధిని కొడుకు అడ్డుకోకుండా వుండడానికి సలీంకి మత్తు మందు యివ్వాలని అంటాడు. అనార్కలి అంగీకరిస్తుంది. అక్బర్ యిచ్చిన మాటని గుర్తు చేస్తూ కూతురి ప్రాణాలు కాపాడాలని కోరుతుంది తల్లి. మనసు మార్చుకున్న అక్బర్‌, అనార్కలిని విడుదల చేయాలని అనుకున్నా, దేశం పట్ల బాధ్యతని విస్మరించలేకపోతాడు.

తల్లీ కూతుళ్ళు రహస్య మార్గం గుండా దేశం విడిచి వెళ్లి పోవాలనీ, వాళ్ళు సజీవంగా వున్నట్టు సలీంకి ఎప్పటికీ తెలియకూడదనీ చెబుతాడు. నరాలు తెగే ఉద్వేగంతో సినిమా విషాదాంతంగా ముగుస్తుంది. కథ హృదయానికి హత్తుకునేలా వున్నా, చరిత్రలో అసలు అనార్కలి అనే ఆమె లేదని అంటారు. ఈ సినిమా చరిత్రని వక్రీకరించిందనీ, అతి నాటకీయత, కమర్షియల్‌ మసాలా కలిపి కొట్టారనీ విమర్శకులు గట్టిగానే అన్నారు.

అయినా యింత మహత్తరమైన సినిమా భారతీయ వెండితెరమీద మునుపెన్నడూ చూడలేదనీ ఒప్పుకున్నారు.మొగలే ఆజంకి సంగీతం ఆత్మ అనీ, నౌషద్‌ అలీ పేరు చరిత్రలో నిలిచిపోతుందనీ పత్రికలు రాశాయి. ఆర్‌.డి. మాథుర్‌ అసాధారణమైన సినిమాటోగ్రఫీ ఈ సినిమాని మరపురాని ఒక HISTORIC DOCUMENTగా రూపుదిద్దింది.

ఆసిఫ్‌ రాసిన వెండితెర కవిత్వానికి సంగీతామృతంతో నౌషాద్‌ ప్రాణం పోస్తే, ఆ గాథని ప్రేమకావ్యంగా మలిచినవాడు మాథుర్‌. తొమ్మిదేళ్ళ సుదీర్ఘ శ్రమకి ప్రతిఫలంగా కోట్ల రూపాయల లాభాల్తో నిర్మాతలుపండగ చేసుకున్నారు. 1960లో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలచిన మొగలే ఆజం రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులూ గెలుచుకుంది. సౌందర్యరాశి మధుబాల ఆ తెలివెన్నెల నవ్వుతో, ఆ సొగకళ్ళ చూపుల్తో భారతీయ యువకులెవ్వరికీ నిద్ర పట్టకుండా చేసింది.

REAL LIFE LOVE STORY
సినిమా తీస్తున్నపుడు దిలీప్‌ కుమార్‌, మధుబాల నిండా ప్రేమలో మునిగివున్నారు. వాళ్ల తొమ్మిది సంవత్సరాల ప్రేమకథకి మధుబాల తండ్రి అడ్డు పడ్డాడు. మధుబాల బాగా హర్ట్‌ అయిపోయింది. వాళ్ళ మధ్య మాటల్లేకుండా పోయాయి. ఆసమయంలో హీరోహీరోయిన్ల మీద గాఢమైన ప్రేమ సన్నివేశం చిత్రీకరించాల్సి వుంది. నేపథ్యంలో బడేగులాం అలీఖాన్ పాట, ఎడమొహంపెడమొహంగా వున్న దిలీప్‌, మధుబాలకి నచ్చజెప్పి ఒప్పించి, చివరికి ఆ సన్నివేశాన్ని అద్భుతంగా పండించాడు ఆసిఫ్‌. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!