రమణ కొంటికర్ల… …………………………….
ఔ మల్ల.. అసైన్ భూములను కబ్జాకెట్టి … అటవీ భూముల్లో చెట్లు కొట్టేస్తే.. నేరం కాదా..? అలా అన్జెప్పి 20 ఏళ్లకు పైగా పార్టీకి సేవలందించాడని.. ఉద్యమంలో చురుకైన పాత్ర అన్జెప్పి… నేరమని తెలిసాక పదవిలో ఉంచడం అంతకంటే తప్పు కాదా..? అసలు అది నైతి’కథేనా’..? మరిన్నేళ్లదాకా ఆ భూముల కబ్జా కథ తెల్వదా… ఇప్పుడే గుర్తొచ్చిందా అంటారా…? అది రాజ్యమిష్టం! అంతకన్నా రాజిష్టం!! ఎందరో భూముల విషయాల్లో అన్యాయాలు జరుగుతున్నాయని మొత్తుకుంటున్నా… ఎన్నో జిల్లాల్లో… ఊళ్లల్లో సర్కారీ, దేవాదాయ, అటవీ భూములే అన్యాక్రాంతమవుతున్నాయని పుంఖాను పుంఖాలుగా కథనాలు వెల్లువెత్తినా.. పట్టించుకోనివాళ్లు… కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు… టార్గెట్ చేసి ఈడనే పట్టుడెందుకంటరా…? అది సారిష్టం! రాజ్యాన్ని నడిపిస్తున్నవారిష్టం!! తనకనుకూలమైనప్పుడు పార్టీపై ప్రశంసలు… ప్రతికూలమనుకున్నప్పుడు పరోక్ష విమర్శలు చేస్తే… పొగబెట్టి పొమ్మనక… ఏం పర్లేదు నువ్వలాగే ఉండాలని ఎవరైనా ఎంకరేజ్ చేసి.. కౌగిలించుకుని ముద్దెట్టి.. దగ్గరకు తీస్తారా..ఏటి…? ఉట్టి పిచ్చిమాలోకం కాకపోతే!
పార్టీకి ఎవ్వరైనా ఒక్కటే. పార్టీని లీడ్ చేసే వాళ్లు తప్ప! ఈమాత్రం ఇంగితముండకుండా… రబ్బర్ ను తెగేదాకా లాగితే… ఇప్పుడతకపెడితే సహజంగా ఉంటదా…? గంత పెద్ద పోస్టులో ఉన్నాయనకు గా మాత్రం తెల్వదా ఏంది..? ఎందర్నో చూసిన రాజకీయాలివి. ప్రతీ పార్టీ రాజకీయాన్ని ఆసాంతం నిశితంగా పరిశీలించి.. అధ్యయనం చేసి… ఒంటబట్టించుకుని.. ఏకంగా ఓ కొత్త పార్టీనే తెరపైకి తెచ్చి..ఉద్యమించి.. అన్నీ కుదిరి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న జాగాలో… అధికార పీఠంపై ఉన్నోళ్లనే ఎదిరించడమంటే… రాజ్యానికెదురెళ్లడమనే సోయి లేకపోవడం అజ్ఞానం కాదా…?
ఎప్పుడైనా అధ్యక్షుడి పీఠం మారే పార్టీనా… అది…?కార్యనిర్వాహకాధ్యక్షుడైనా ఎవరైనా కాగల్గే పార్టీనా అది…? అలాంటి పార్టీ గురించి… అంతకుముందు ఎదురుతిరిగి గెంటేయబడ్డ వాళ్లగురించీ… ఇలా అన్నీ తెలిసి… ధిక్కారస్వరమా…? అహో ఎవరక్కడ… అనడమే ఆలస్యం.. అది అనైతికమో, నైతికమోనన్న ఆలోచన కూడా అవసరం లేకుండా చేయగల్గే యంత్రాంగం, మందీ మార్బలమున్న చోట… ఏంటీ ఆ కుప్పి గంతులు…?
రాజకీయ చదరంగాటలో నువ్వెన్ని వ్యూహాలు పన్నితే… అంతకంటే ఒకటెక్కువ పన్నేందుకు రెడీగా.. అసలే అధికారిక బలంతో అలా సమాయమత్తమయ్యేందుకు కావల్సిన వనరులన్నీ పుష్కలంగా ఉన్న సమయాన… ఢీ అంటే ఢీ అంటానంటే… ఊరుకుంటారా…? మాంచి స్కెచ్చేస్తారు… యేటేస్తారు… ఇరికిస్తారు… అవసరమైతే అరెస్ట్ జేస్తారు.. కోర్టు సెలవులు చూసుకుని బెయిల్ గూడా రాకుండా జేస్తరు… అసలీ రాజకీయాలు నాకొద్దుబాబూ అనేట్టూజేస్తారు.. ఇవన్నీ గా ధిక్కార స్వరానికి తెలియనివా… మరి అంతకుముందు చూడనియా…? కాని విధి! బలంగా అలా తన్నుకొస్తే… మిత్రువులే శత్రువులవుతారు… అంతకుముందు శత్రువుల్లా కనిపించినవారే మిత్రులూ కూడా కావచ్చునూ! అందుకేనేమో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులుండరనన్నది!!
సరె సర్లేగానీ… ఇదంతా లోకం గమనిస్తలేదా…? లోకానికి తప్పనిపిస్తలేదా…? ఎవరి తప్పెంతో లోకం పసిగట్టలేదా..? తప్పొప్పులపై లోకం చర్చించడంలేదా…? మరిన్ని జరిగినా… ఆలోకం కూడా అధికారిక పీఠానికే దాసోహమనెందుకంటోందంటే… ? ఆ పిచ్చిమా ‘లోకాన్నీ’ మేనేజ్ చేయగల్గే స్కిల్సంటే అవే మరి! అందుకు కావల్సిన అధికారిక సాధనాసంపత్తీ ఉండనే ఉండె. సామధానభేదదండోపాయాలన్నీ రాజ్యానికి తెలియనివా…? మరి ఎన్నికల నాడైనా ఆ లోకం కళ్లు తెరవాలిగా అంటారా…? మందు, మద్యం, కోరికలు, ఆశలన్నవున్నంతకాలం… తాత్కాలిక సుఖమేదో.. దీర్ఘకాలికమేదో ఈ పిచ్చి మా ‘లోకం’ తెలుసుకోనంత కాలం… పోల్ మేనేజ్ మెంట్ చేయగల్గినవాళ్లదే రాజ్యం… వాళ్లు చెప్పిందే వేదం… జస్ట్ చూస్తూ ప్రేక్షకపాత్రకు పరిమితమై చర్చించుకునేదే ఈ లోకం!