Ravi Vanarasi……………………..
ఈ భూమిపై మనం కనుగొనని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయని నిరూపించే ఒక అద్భుత దృశ్యం ఇది.చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక కొత్త సింక్‌హోల్ ను (భూమి లోపల ఏర్పడిన పెద్ద గొయ్యి , లేదా టియాన్‌కెంగ్ (“హెవెన్లీ పిట్”) పరిశోధకులు కనుగొన్నారు. ఈ గొయ్యి లోపల పెద్ద అడవి ఉంది.
ఇది ఎంత లోతుగా ఉందంటే, దాదాపు 630 అడుగుల (192 మీటర్లు) లోతు, 1,004 అడుగుల (306 మీటర్లు) పొడవు, 492 అడుగుల (150 మీటర్లు) వెడల్పు ఉంది. లోపల 131 అడుగుల (40 మీటర్లు) ఎత్తు వరకు పురాతన వృక్షాలు ఉన్నాయి. మనిషి భుజాల ఎత్తున పెరిగిన దట్టమైన పొదలు ఉన్నాయి.
దీన్ని బట్టి చూస్తుంటే….భూమి ఎన్నో రహస్యాలను తనలో దాచుకుందని భావించాలి. భూమి లోపల ఉన్న , అడవులు, నదులే కాక మన ఊహకు కూడా అందని జీవ ప్రపంచం ఉండొచ్చు. ఈ సింక్‌హోల్ ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉండవచ్చు.
ఈ సింక్ హోల్ లోపల బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని వేల సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండొచ్చు. ఇక్కడి మొక్కలు, జంతువులు, కీటకాలు బయటి ప్రపంచంలో ఉన్నవాటి కంటే భిన్నంగా ఉండవచ్చు. అవి ఎలా పరిణామం చెందాయో, ఎలా మనుగడ సాగించాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రకృతి తనను తాను ఎలా కాపాడుకుంటుందో, ఎలా కొత్త జీవితాలను సృష్టిస్తుందో ఈ సంఘటన మనకు చూపుతుంది. మనం ప్రకృతిని నాశనం చేస్తున్నామని అనుకుంటున్నాం. కానీ, ప్రకృతిలో మన కంటికి కనిపించని చోట్ల కూడా జీవితం నిరంతరం కొనసాగుతూనే ఉంది. మానవుల ప్రమేయం లేని ప్రదేశంలో ప్రకృతి తన సొంత మార్గంలో ఎంత సుందరంగా, పకడ్బందీగా ఉంటుందో ఈ అడవి మనకు చూపిస్తుంది.
ఈ సింక్‌హోల్ లోపలికి గాలిని, నీటిని తీసుకుంటుంది. పర్యావరణ వ్యవస్థకు ప్రాణం పోస్తుంది. భూమి కూడా ఒక జీవిలా,దాని లోపల కొన్ని కణాలు, అవయవాలు ఉన్నట్టు అనిపిస్తుంది. మనం దాని ఉపరితలంపై మాత్రమే నివసిస్తున్నాం. దాని లోపలి ప్రపంచం గురించి మనకు పెద్దగా తెలియదు.
ఈ పరిశోధన ఒక గొప్ప శాస్త్రీయ అద్భుతం. ఇవి ఇంకా జరగాలి. ఈ ప్రత్యేకమైన అడవిని, దానిలో ఉన్న జీవజాతులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది.


