Thopudu bandi Sheik SadiqAli ………….
కాకతీయుల చరిత్ర 2
శివ పురాణం లిఖించ బడక ముందే, శైవం ఒక మతంగా రూపాంతరం చెందక ముందే , అనాదిగా హిమాలయ పర్వత సానువుల్లో అటు నేపాల్,ఇటు టిబెట్,ఈ వైపు ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో శివతత్వం విస్తృత ప్రచారంలో ఉండేది. ఆ మేరకు శివునికి సంబంధించిన అనేక కథలు జానపదుల్లో ప్రచారంలో ఉండేవి.
అలాంటి కథల్లో శివుడికి మహాదేవుడు,రుద్రుడు అనే పేర్లు,శివుడి గణాలకు అధిపతి ని గణపతి అనీ ప్రస్తావిస్తూ ప్రస్తుతించేవారు. కాకతీయుల పూర్వీకులు అలాంటి ప్రాంతమైన ఉత్తరాఖండ్ కు చెందిన వారని మనం ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు కాకతీయ రాజుల వంశవృక్షంలో కొన్ని పేర్లను పరిశీలిద్దాం.
1116-1157 మధ్యకాలంలో జీవించిన రెండవ ప్రోలరాజు ఆయన భార్య ముప్పమ కు ఐదుగురు సంతానం.అందులో మొదటి నలుగురి పేర్లను గమనిద్దాం.మొదటి వాడు రుద్రుడు ఇతడే మొదటి ప్రతాప రుద్రుడు.1163 లో కాకతీయ సార్వభౌమాధికారాన్ని స్థాపించిన వాడు.రెండోవాడు మహాదేవుడు (1196-1199)ఇతని భార్య బయ్యమ .(వీరి కుమారుడే సుప్రసిద్ధ గణపతి దేవుడు.(1199-1262),కుమార్తెలు మైలాంబ,కుందాంబ).
మూడోవాడు హరిహరుడు ,నాలుగో వాడు గణపతి. ఈ పేర్లన్నీ గమనిస్తే ఈ వంశం శివారాధక వంశం అనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. కానీ చరిత్రకారులు మాత్రం కాకతీయులు తొలుత జైనులనీ, 1240 ప్రాంతాల్లోనే జైనం వదిలి శైవం స్వీకరించారనీ ,ఆ క్రమంలో జైనులను ఊచకోత కోసారనీ పలు చోట్ల రాసారు. ఇక్కడ కొంత వివరణ ఇవ్వాలను కుంటున్నాను.
కాకతీయులు తమ జీవిత కాలంలో ఎన్నడూ శైవ ధర్మ విశ్వాసాలను వదిలి జైనాన్ని ‘అవలంభించ’ లేదు. కేవలం జైనాన్ని ‘ఆదరించారు’. స్వతంత్ర రాజులుగా ఆవిర్భవించక ముందు వారు పనిచేసిన రాష్ట్రకూటులు,కళ్యాణీ చాళుక్యులు జైనానికి పెద్ద పీట వేసి ఉంచారు. కాకతీయ రాజ్య స్థాపన జరిగే నాటికే సమాజంలో జైనులు అత్యంత ప్రభావశీలమైన స్థానంలో ఉన్నారు.
విద్యా,వైద్యం,ఆధ్యాత్మిక రంగాల్లో బలమైన పట్టు సాధించి ఉన్నారు. అలాంటి నేపధ్యంలో రాజ్యస్థాపన చేసిన కాకతీయులు జైనులను విస్మరించే పరిస్థితులు లేవు. అందుకే తెలివిగా వారిని నొప్పించకుండా,వారితో విరోధం రాకుండా సామరస్యంగా వారిని ఆదరించే క్రమాన్ని కొనసాగించారు.
కాలక్రమేణా సామ్రాజ్యం విస్తరించటం,గణపతి దేవుడు సర్వశక్తి సంపన్నుడు అవ్వటం జరిగిన తర్వాత అప్పటిదాకా లో ప్రొఫైల్ లో ఉన్న శైవానికి ప్రాధాన్యతను ఇవ్వటం మొదలెట్టాడు.దాంతో జైనుల నుంచి కొంత ప్రతిఘటన ప్రారంభం అయ్యింది. మతం రాజ్యాధికారానికి బలం అవ్వాలే తప్ప ఆటంకం కారాదన్నది మొదటి నుంచీ ఉన్న రాజనీతి.
అదే సూత్రం ప్రాతిపదికగా, రాజ్యానికి వ్యతిరేకంగా బోధనలు చేస్తున్న జైనులను గణపతి దేవుడు ఊచకోత కోయించాడు. 70 మంది జైన సాధువులను సజీవదహనం చేసిన గుహలు ఇప్పటికీ కాజీపేటలో ఉన్నాయి. అనంతరం కాకతీయ సామ్రాజ్యంలో వందల,వేల సంఖ్యలో శివాలయాలు వెలిసాయి.
బేతరాజు నామ ఆవిర్భావం
కాకతీయుల పేర్లలో ప్రముఖంగా వినిపించే పేరు మొదటి బేతరాజు,(గరుడ బేతయ) రెండో బేతరాజు (త్రిభువన మల్లుడు) చిత్రమైన ఈ పేరు ఎక్కడా ఇమడదు.మరి అలాంటిది ఎక్కడి నుంచి వచ్చింది? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు భాష గురించి తెలుసుకోవాలి. బేత అనే పదానికి మూలం పేత. నిషాదుల భాషలో ఈ పదానికి అర్ధం మనవడు. ఈ పేతకు మూలం పోత,అంటే కుమారుడి కుమారుడు అని అర్ధం.
వాస్తవానికి కాకతీయులు బేత శబ్ద ప్రయోగం చేయలేదు. మనవడు అనే అర్ధంలోనే పేత అనే పదాన్నే వాడారు. శాసనాలు చదివిన చరిత్రకారులు దాన్ని కాస్తా బేతగా, మనవడైన రాజు కాస్తా బేతరాజుగా మార్చేసారు. పేతయ (మాంగల్లు శాసనంలో మాత్రమేకన్పించే పేరు) కొడుకైన నాల్గవ గుండన కోడుకే గరుడ పేతయ (ఇతడే మొదటి బేతరాజు) ఇతడి కొడుకైన మొదటి ప్రోలరాజు కొడుకే త్రిభువన మల్లుడు( ఇతడే రెండవ బేతరాజు).
ఇదికూడా చదవండి >>>>>>>>>>> ఎవరీ నిషాదులు ? ఎచటివారు ?