Glaciers melting……….
హిమాలయాలలోని హిమానీ నదాలు (Glaciers) చాలా వేగంగా కరిగిపోతున్నాయి. ఇది ఆందోళనకరమైన పరిణామమని శాస్త్రవేత్తలు అంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా హిమాలయాల్లో మంచు కరుగుతోంది. అప్పటితో పోలిస్తే మంచు కరిగే వేగం గణనీయంగా పెరిగింది.
గత 40 ఏళ్లలో హిమానీ నదాలు అంతకుముందు ఏడు శతాబ్దాలలో కరిగిన దానికంటే పది రెట్లు వేగంగా కరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
లిటిల్ ఐస్ ఏజ్ (400-700 సంవత్సరాల క్రితం) నుండి ఇప్పటివరకు హిమాలయాలు మొత్తం మంచు విస్తీర్ణంలో దాదాపు 40% కోల్పోయాయి. హిందూ కుష్ హిమాలయ (HKH) ప్రాంతంలో, 2011-2020 మధ్య కాలంలో అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే హిమానీనదాలు 65% వేగంగా కరిగాయని ఐక్యరాజ్యసమితి (UN) నివేదిక తెలిపింది.
భారత హిమాలయాల్లో, గంగా బేసిన్‌లోని హిమానీ నదాలు సగటున ఏడాదికి 15.5 మీటర్లు, బ్రహ్మపుత్ర బేసిన్‌లో ఏడాదికి 20.2 మీటర్ల వేగంతో వెనక్కి తగ్గుతున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) భారతదేశంలో మొత్తం 9,575 హిమనీనదాలు ఉన్నాయని అధికారికంగా చెబుతోంది.
ఇస్రో (ISRO) ఉపగ్రహ చిత్రాల ద్వారా సింధు, గంగా, బ్రహ్మపుత్ర బేసిన్‌లలో (భారత సరిహద్దుల లోపల,వెలుపల కలిపి) సుమారు 16,627 హిమానీ నదాలను గుర్తించింది. వీటిలో అత్యధికంగా లడఖ్ ప్రాంతంలో ఉండగా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కొన్నిఉన్నాయి.
హిమానీ నదాలు పూర్తిగా అదృశ్యం కావడం కంటే, వేగంగా వెనక్కి తగ్గడం (Retreat,) మంచు పరిమాణం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.అరుణాచల్ ప్రదేశ్‌లో గత 32 ఏళ్లలో సుమారు 110 హిమానీ నదాలు అదృశ్యమయ్యాయని ఒక అధ్యయనం వెల్లడించింది.
మంచు కరగడం వల్ల 1984 నుండి హిమాలయాల్లో సుమారు 676 కొత్త సరస్సులు ఏర్పడటం లేదా ఉన్నవి భారీగా విస్తరించడం జరిగాయి. వీటివల్ల ఆకస్మిక వరదల (GLOFs) ప్రమాదం పెరుగుతోంది. ఈ పరిణామానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ (Global Warming),వాతావరణ మార్పులే అని శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తీవ్రంగా తగ్గించకపోతే, ఈ శతాబ్దం చివరి నాటికి (2100 నాటికి) హిమాలయాలలోని 75% హిమానీనదాలు కరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. హిమాలయాలు కరగడం వల్ల దిగువన ఉన్న నదీ పరీవాహక ప్రాంతాలలో నివసిస్తున్న కోట్ల మంది ప్రజలకు తాగునీరు, వ్యవసాయానికి నీరు అందకుండా పోవచ్చు.జలవిద్యుత్ ఉత్పత్తికి తీవ్రమైన ముప్పు వాటిల్లవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా హిమానీనదాలు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి, భారతదేశంలోని తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది.

