Cultivated lands are being eroded…………………………
ఉష్ణోగ్రతలు పెరిగి తద్వారా ఆహార సంక్షోభం వస్తుందా ? భారత్ కూడా ఆహార కొరత ఎదుర్కొంటుదా ? ఫలితంగా ఆకలి చావులు సంభవిస్తాయా ? ఈ ప్రశ్నలకు అవుననే జవాబు చెప్పుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరగడంతో జలవనరులు తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ప్రజలు, జంతువులు,పక్షులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
తగినంత నీరు అందకపోతే ప్రాణాలు కాపాడుకోవడం కష్టమవుతుంది. అలాగే పవర్ ప్లాంట్లలో శక్తిని ఉత్పత్తి చేయడం, పశువుల పెంపకం, పంటలను పండించడం వంటి అనేక ముఖ్యమైన కార్యకలాపాలకు కూడా నీరు ఎంతో అవసరం. భూమి వేడెక్కుతున్నప్పుడు నీటి వనరుల కోసం పోటీ పెరిగితే ఈ కార్యకలాపాలకు అందుబాటులో ఉన్న నీటి పరిమాణం బాగా తగ్గుతుంది. అపుడు నీటి యుద్ధాలు మొదలవుతాయి.
ఈ క్రమంలోనే 30శాతం వరకు పంట దిగుబడులు తగ్గవచ్చు.ఫలితంగా తీవ్ర కరువు కాటకాలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. తద్వారా తీవ్ర ఆహార సంక్షోభం వస్తుందని ఒక సర్వే చెబుతోంది. ఈ సంక్షోభం వల్ల 2050 సంవత్సరం నాటికి భూమిపై ఆహారం దొరకదని గ్లోబల్ కమిషన్ ఆన్ అడాప్షన్ సర్వే అంటోంది.
ఆహార కొరత ఏర్పడే దేశాల్లో భారత్ కూడా ఉంటుందని ఆ సంస్థ సర్వే వెల్లడించింది.ఇక ప్రపంచ జనాభా 1000 కోట్లు దాటితే ఆహార పంటలు పండించే భూముల విస్తీర్ణం తగ్గిపోతుందని.. అటవీ ప్రాంతాలు తరిగిపోతాయని సర్వేలో వివరించారు. ఫలితంగా వర్షాలు .. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. ధృవ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర తీర ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉందని సర్వే చెబుతోంది.
ఇప్పటికే వ్యవసాయ రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుత సాగు పద్ధతుల వలన సుస్థిరతను సాధించడం అసాధ్యమవుతోంది. భూమి,నీటి వనరులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు రోజురోజుకు తగ్గిపోవడంతో ఉత్పాదకత పడిపోతోంది. మొత్తంగా ఈ పరిణామాలు ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయి.ఇదే పరిస్థితి కొనసాగితే ఆహార భద్రత ప్రమాదంలో పడటం ఖాయంగా కన్పిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఉత్పాదకత పెంచడం, ఇందుకోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం.. వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునే సేద్యపు విధానాలను అనుసరించడం కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఆహార భద్రత, సాగు విస్తీర్ణంలో కీలకమైన భూమి, నీరు ఎదుర్కొంటున్న సవాళ్లు-2021 అనే నివేదిక లో కొన్ని కీలకాంశాలను ప్రస్తావించారు.
2000 సంవత్సరంలో పట్టణ ప్రాంతాలు భూమిలో 0.5 శాతాన్ని ఆక్రమించి ఉండేవి. తర్వాత వేగంగా పెరిగిన పట్టణీకరణ వల్ల ప్రపంచంలోని 55 శాతం జనాభా నగరీకరణలోకి మారడం తో సాగు భూమి తగ్గుతోంది. సేద్యం, పశు సంపదకోసం అందుబాటులో ఉండే భూమి 2000 నుంచి 2017 సంవత్సరాల మధ్య సగటున 20 శాతం తగ్గింది. ఇది సేద్యంపై తీవ్ర ప్రభావమే చూపుతోంది.
ఉదాహరణకు ప్రపంచ సాగు విస్తీర్ణం వార్షిక వృద్ధి 1961 నుంచి 2009 వరకు 1.6 శాతం కంటే ఎక్కువగా, కొన్ని పేద దేశాల్లో రెండు శాతం వరకు ఉంది. తాజా అంచనా ప్రకారం రానున్న రోజుల్లో అది 0.14 శాతం కంటే పెరిగే పరిస్థితి లేదు. 2050 నాటికి ప్రపంచం ఆకలి నుంచి బయటపడాలంటే సాగు విస్తీర్ణం 165 మిలియన్ హెక్టార్లకు పెరగాలి. కానీ 91 మిలియన్ హెక్టార్లకే పరిమితం కానుంది. తేడాను అధిగమించడం కష్టమే.
ఈ పరిణామాలన్నీ ఆహార భద్రతను ప్రశ్నార్థకం గా మారుస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచంలో ఆకలి చావులు పెరగడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఏం జరగనుందో చూడటం మినహా మనం చేసేదేమి లేదు. గడిచిన పదిహేనేళ్లలో 20 శాతం వరకు వ్యవసాయ భూములు తగ్గాయని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక చెబుతోంది.