Wealthy couple……………………………………………..
ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు, దిగ్గజ సెర్చ్‌ఇంజిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ , ఆయన భార్య నికోల్ షనాహన్‌లు విడాకులు తీసుకుబోతున్నారు.ఇందుకోసం సెర్జీ బ్రిన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.గత మూడేళ్లలో ప్రపంచ కుబేరుల్లో విడాకులకు సిద్ధపడిన మూడో జంట వీరే.
సెర్జీ బ్రిన్ (49), నికోల్ షనాహన్ (37)లు 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాలు కలిగిన ఈ ఇద్దరు విడాకులు తీసుకోవాలని భావించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, హై ప్రొఫైల్ కేసు కావడం తో వీరి విడాకుల కేసు విషయంలో గోప్యత పాటిస్తున్నారు.
సెర్జీ బ్రిన్ గతంలో మరో మహిళ నుంచి విడిపోయారు. 23అండ్‌మీ (23andMe) సంస్థ సహ వ్యవస్థాపకురాలు అన్నే వొజిస్కీని 2007లో వివాహం చేసుకున్న ఆయన.. 2015లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత షనాహన్‌తో సహజీవనం సాగించిన సెర్జీ బ్రిన్.. 2018లో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యకు ఇద్దరు సంతానం కాగా షనాహన్‌కు మూడేళ్ల కూతురు ఉంది. వీరిద్దరూ గత కొంత కాలంగా మనస్పర్ధల మూలంగా వేరువేరుగా ఉంటున్నట్లు సమాచారం.
దిగ్గజ కంపెనీల్లో ఒకటైన గూగుల్‌ను లారీ పేజ్‌తో కలిసి సెర్జీ బ్రిన్ 1998లో స్థాపించారు. అనంతరం దానిని ఆల్ఫాబెట్ (Alphabet Inc.) కంపెనీగా మార్చారు. అయితే, 2019లో సెర్జీతోపాటు లారీ పేజ్ కూడా ఆల్ఫాబెట్ నుంచి బయటకు వచ్చారు. కంపెనీలో షేర్లు ఉన్నందున వీరిద్దరూ ఆ సంస్థ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం,సెర్జీ బ్రిన్ సంపద 94బిలియన్ డాలర్లు (సుమారు రూ.7లక్షల కోట్లు).
కాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్-మిలిందా దంపతులు కూడా ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మెకంజీ స్కాట్‌లు విడాకులు తీసుకున్నారు. అయితే, విడాకుల సమయంలో ఈ కుబేరులు భారీ స్థాయిలో భార్యలకు భరణాన్ని సమర్పించుకున్నారు.
వారి సంపదలో ఎంత మొత్తం చెల్లించారనే విషయాన్ని కూడా వెల్లడించారు. ప్రస్తుతం సెర్జీ బ్రిన్ జంట ప్రైవేటు న్యాయమూర్తిని ఎంపిక చేసుకోవడంతో విడాకులకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు. కొన్నాళ్ళు పోతేగానే వివరాలు తెలియవు.