మరో శివగామి ఈ జసిందా !!

Sharing is Caring...

పై ఫొటోలో ఉన్నజసిందాను  చాలామంది గుర్తించే ఉంటారు. ఆ ఫోటో ఇప్పటిది కాదు. రెండు క్రితం నాటిది.అప్పట్లో నెలల బిడ్డతో ఆమె అసెంబ్లీ కి వచ్చి ప్రజాసమస్యలపై చర్చల్లో పాల్గొనేది. ప్రభుత్వ విధానాలపై  మాట్లాడేది. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించేది. పిల్లను తీసుకునే వివిధ దేశాల్లో జరిగే కీలక సమావేశాలకు సైతం హాజరయ్యేది. ఆమె పూర్తి పేరు జసిందా ఆర్డెన్. తిరుగులేని ప్రజానాయకురాలు. 

కొద్దిరోజుల క్రితం జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో జసిందా నాయకత్వం లోని లేబర్ పార్టీకి 49 శాతం ఓట్లు లభించాయి. దీంతో పార్లమెంటులో లేబర్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లభించింది. ఇప్పటికే ప్రధానిగా ఉన్న జసిందా రెండో సారి పీఎం కాబోతుంది. పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించిన మహిళల్లో జసిందా ఒకరు. 

న్యూజిలాండ్ ను కరోనా రహిత దేశంగా మార్చారు.ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుకున్నారు. కరోనా వైరస్ విషయం గమనించగానే న్యూజిలాండ్ సరిహద్దులు మూసివేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పౌరులను చైతన్య పరిచారు. నెల రోజులు దేశాన్ని లాక్డౌన్ లో ఉంచారు.  కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని  దృవీకరించుకున్నాకనే లాక్ డౌన్ ఎత్తివేశారు.  పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 15 న , న్యూజిలాండ్‌లో 1,078 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ దేశం జనాభా సుమారు 5 మిలియన్లు మాత్రమే. ముందస్తు జాగ్రత్తలు ఆ దేశాన్ని కాపాడాయి. 

కాగా అంతకు ముందు క్రిస్ట్ చర్చ్ లో మసీదులపై దాడులు జరిగిన క్రమంలో  ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వపరంగా స్పందించి మీకు అండగా మేమున్నాం అంటూ ప్రజలకు భరోసా ఇచ్చింది జసిందా.సమర్ధవంతంగా వ్యవహరించి ప్రజలకు ధైర్యం చెప్పడంలో ఎంతో పరిణితి, మానవతను చూపారామె. ఈ అంశాలన్నీ ప్రజలను ఆకట్టుకున్నాయి. అందుకే రెండో సారి ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.

జసిందా 28 ఏళ్ళ చిన్న వయసులో ప్రతినిధుల సభలో ప్రవేశించారు.  అప్పటికి పార్లమెంట్లో ఆమె ఒక్కరే అతి పిన్న వయస్కురాలు. అప్పటినుంచి లేబర్ పార్టీ నాయకుడు ఆండ్రూ లిటిల్  కింద డిప్యూటీ నేతగా పనిచేశారు. 2017 లో  ఆండ్రూ  తన వారసురాలిగా జసిందా ను ప్రకటించి పదవీ విరమణ చేసాడు. ఇక అక్కడి నుంచి జసిందా దూసుకుపోయింది. సంకీర్ణ ప్రభుత్వానికి నేతగా ఎంపికై దేశ పగ్గాలు చేపట్టారు. ప్రజా రంజక పాలన అందించారు. ఆమె కృషికి ప్రజల మద్దతు లభించింది. దేశంలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాలలో ప్రమాదకర రకాలను నిషేదించారు. మరెన్నో మంచిపనులు చేశారు. న్యూజిలాండ్‌లో ఎన్నికల ప్రచారం ఆరంభమైన్పటినుంచే జసిందా హవా పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. ఆమె ఎక్కడ ప్రచారానికి వెళ్లినా జనం నీరాజనాలు పట్టారు.

ఆవిధంగా ఆమె ప్రజల మనసు దోచుకుంది.  శివగాములు కథల్లోనే కాదు నిజ జీవితాల్లోను ఉంటారు. అయితే అవకాశాలు దొరకాలి. న్యూజిలాండ్ ఎన్నికల్లో ఒకపార్టీకి ఇంతలా ఘనవిజయం లభించడం గత ఐదు దశాబ్దాల్లో ఇదే ప్రధమం. అంకిత భావం గల నాయకురాలు ఉంటే అలాంటి విజయాలు అందుతూనే ఉంటాయి. 

——- KNMURTHY

 

 

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!