Sheik Sadiq Ali,,,,,,,,,,,,,,,,,,,,,,,,, Why did Lord Krishna kill Sisupala?
యుగాలు మారినా కొన్ని నీతులు మాత్రం మారవు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడి నూరు తప్పులు మన్నించి, నూటా ఒక్కో తప్పు చేయగానే సుదర్శన చక్రంతో శిరచ్చేదం చేసిన వృత్తాంతం ఈ కలియుగంలోనూ అన్వయించుకోవచ్చు.
వందతప్పులు చేసినా మన్నించ గలిగిన శ్రీకృష్ణుడి సహనం చాలా గొప్పది. యోగులకు మాత్రమే సాధ్యమయ్యే పని అది. ఆయన సాక్షాత్తూ యోగపురుషుడే కాబట్టి అంతటి సహనం సాధ్యమయ్యింది.
ఇప్పటి ఈ కలియుగపు అసహన సమాజం లో ఆయనే వుండి వుంటే గల్లీకో శిశుపాల వధ రోజూ జరుగుతూనే వుండివుండేది.
ముందుగా శిశుపాలుడి గురించి తెలుసుకుందాం. పూర్వజన్మలో పలుపాపాలు చేసి ఉగ్రనార సింహుడి చేతిలో అంతమైన హిరణ్యకశిపుడు ద్వాపరయుగంలో శిశుపాలుడిగా జన్మించాడు. పుట్టినప్పుడు మూడు కళ్ళు, నాలుగు చేతులు వున్న శిశువును చూసి తలిదండ్రులు భయపడిపోయారు. ఆ బిడ్డను సంహారించాలనుకున్నారు.
ఈలోగా అశరీరవాణి ఒక సందేశాన్నిచ్చింది. ‘త్వరలో ఒక మహానుభావుడు వస్తాడు. అతని చేతి స్పర్శ తగిలిన వెంటనే శిశువుకు అదనంగా వున్న అవయవాలు అదృశ్యమై పోతాయి. కానీ, పెరిగి పెద్దయ్యాక ఆ మహానుభావుడి చేతుల్లోనే ఇతను చంపబడతాడు.’ అనేది ఆ సందేశ సారాంశం. ఆ మహానుభావుడు మరెవ్వరో కాదు, సాక్షాత్తూ శ్రీకృష్ణుడే. ఇక్కడో విశేషం వుంది.
శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు. ఆయన సోదరి శ్రుతదేవి. ఆమెను చేడి రాజైన దమఘోష్ కు ఇచ్చి పెళ్లి చేశారు. వారిద్దరి సంతానమే ఈ శిశుపాలుడు. అంటే స్వయానా కృష్ణుడి మేనత్త కొడుకు. ఒకరోజు అత్త ఇంటికి వచ్చిన కృష్ణుడు ఆ శిశువును ఒళ్లోకి తీసుకోగానే అద్భుతం జరిగినట్లుగా ,అప్పటి వరకు అదనంగా వున్న మూడో కన్ను, నాలుగింట్లో రెండు చేతులు అదృశ్యమై పోతాయి.
అది చూసిన తల్లికి తన కొడుకు మరణం కృష్ణుడి చేతుల్లోనే రాసి వుందని అర్ధమైపోతుంది.దాంతో తన మేనల్లుడిని ఒక వరం అడుగుతుంది. తనకొడుకు తప్పులు చేసినా మన్నించమని అడుగుతుంది. దానికి గాను ‘రోజుకు వందతప్పులు చేసేంతవరకు క్షమిస్తాను. వందదాటితే మాత్రం ఇక ఉపేక్షించను’ అని కృష్ణుడు అత్తకు వరమిస్తాడు.
పూర్వజన్మ వాసనల వల్ల కాబోలు శిశుపాలుడికి మొదటి నుంచీ కృష్ణుడు అంటే విపరీతమైన ద్వేషం వుండేది.ఇదిలా వుండగా అతనికి రుక్మీ అనే స్నేహితుడు ఉండేవాడు. అతనికో అందాల చెల్లెలు రుక్మిణి వుండేది. ఆమె అంటే శిశుపాలుడికి అమితమైన ఇష్టం వుండేది.
ఆమెను పెళ్ళాడాలని అనుకునేవాడు. ఆమెకేమో కృష్ణుడంటే ప్రేమ. ఈ నేపధ్యంలో కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకెళ్ళి పోవటం, మధ్యలో రుక్మి, శిశుపాలుడి సైన్యాలతో సహా ఓడించటం జరుగుతుంది. దాంతో శిశుపాలుడు మరింత ద్వేషాన్ని,పగను పెంచుకుంటాడు.
ఇదిలావుండగా,రాజసూయయాగాన్ని తలపెట్టిన ధర్మరాజు ,భీష్మ పితామహుడి సూచన మేరకు యాగం తాలూకు ఆర్ఘ్యాన్ని కృష్ణుడికి ఇవ్వాలని నిర్ణయిస్తాడు. ఆ కార్యక్రమానికి హాజరైన శిశుపాలుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఇంతటి గౌరవానికి కృష్ణుడు అర్హుడు కాదనీ, అతనికా యోగ్యతా లేదనీ తూలనాడుతాడు. నోటికొచ్చినట్లుగా నిందిస్తాడు. నూరు తప్పుల వరకు సహనంగా భరించిన కృష్ణుడు ఆ తర్వాత నూటా ఒకటో తప్పుచేసే సరికి సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరచ్చేదం చేస్తాడు.
ఇప్పుడు ఈ కథంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే…రాముడినీ, కృష్ణుడినీ నిరంతరం పూజించే మనదేశంలో సహనం అన్నమాట వింటేనే జనాలకు అసహనం వస్తుంది. అధికారం కోల్పోతే అసహనం.,ప్రశ్నిస్తే అసహనం, ఇది తప్పు అని ఎత్తిచూపితే అసహనం . ఈ లెక్కన చూస్తే కృష్ణుడికి ఎంత సహనం ఉండి ఉండాలి?నూరు తప్పులు సహనంతో భరించాడూ అంటే ఎంతటి యోగపురుషుడై వుండాలి?
మన సమాజంలో ఈనాడు డజన్ల కొద్దీ శిశుపాలురు వున్నారు. ప్రజలే కృష్ణుడిలా సహనంతో తప్పులు మన్నిస్తూ వున్నారు. వారి చేతిలోనూ ఓటు అనే సుదర్శన చక్రం వుంది. ఎన్నికలు అనే రాజసూయం జరిగినప్పుడు దాన్ని ఉపయోగిస్తారు. ఆ తర్వాతేముంది ?మళ్ళీ కొత్తగా అంతకన్నా ఎక్కువ మంది శిశుపాలురు,దుర్యోధన, దుశ్శాసనులు పుట్టుకొస్తారు.షరామామూలే.