Brazil tribes …………………….
మానవజాతిలో ఓ అరుదైన ఆదివాసీ తెగ కనుమరుగు అయింది. బ్రెజిల్ లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని ఓ ఆదివాసీ జాతికి చెందిన చివరి వ్యక్తి ఇటీవల కన్నుమూశాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ అధికారికంగా ప్రకటించింది. బ్రెజిల్ లోని రోండోనియా రాష్ట్రంలో టనారు అనే ఆదివాసీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
పేరు తెలియని ఈ వ్యక్తి గత 26 ఏళ్లు గా పూర్తిగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. అతడిని ‘మ్యాన్ ఆఫ్ హోల్ ‘ అని పిలుస్తారు. అతడు జంతువులను వేటాడేందుకు గోతులు తవ్వుతాడు. దీంతో అధికారులు అతగాడికి ఆ పేరుపెట్టారు. మరణించేనాటికి అతడికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉంటుందని అంచనా.
అతగాడు పెద్ద గోతులు తవ్వి వాటిలోనే ఉండేవాడు. 1970ల్లో అతని జాతికి చెందిన చాలా మందిని చుట్టుపక్కల భూస్వాములు తమ పొలాలు విస్తరించేందుకు అంతమొందించారు. మిగిలిన వారిలో మరో ఆరుగురిని 1995లో అక్రమ గని తవ్వకాలకు పాల్పడేవారు హత్య చేశారు. ఈ క్రమంలో అతనొక్కడే మిగిలాడు. నాటి నుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. తనను కలవడానికి వచ్చే వారిపై కూడా బాణాలు విసిరే వాడు.
ఎందరో అతగాడిని కలిసేందుకు ప్రయత్నించి విఫలమైనారు.ఈ విషయాన్ని 1996లో బ్రెజిల్ ఆదివాసీ వ్యవహారాల ఏజెన్సీ తెలుసుకొంది. నాటి నుంచి అతడు సంచరించే ప్రాంతాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. ఈప్రాంతంలోకి ఇతరులు వెళ్లడంపై బ్రెజిల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో ఆ సంస్థ సిబ్బంది ఒకరు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆగస్టు 23న ఆదివాసీ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించాడు.
ఈ ఘటనపై బ్రెజిల్ లోని ఆదివాసీలపై పరిశోధనలు చేసే మార్సెలో డోస్ శాంటోస్ మాట్లాడుతూ.. ” అతను ఎవరినీ విశ్వసించలేదు ఎందుకంటే అతను స్థానికేతరులతో బాధాకరమైన అనుభవాలను చవిచూశాడు. మరణం సమీపించిందని తెలిసిన ఆదివాసి వ్యక్తి.. అతడి శరీరంపై ఈకలు పేర్చుకొన్నాడు” అని వివరించారు. అతడి మృతదేహం ఉన్న తీరును బట్టి.. చనిపోయి కనీసం 40 రోజుల అవుతుందని భావిస్తున్నారు.
బ్రెజిల్ లో అంతరించిపోకుండా ఉన్న ఆదివాసీ తెగల సంఖ్య 235 నుంచి 300 వరకు ఉండొచ్చు అంటున్నారు. కొన్ని తెగలు నాగరిక సమాజంతో చాలా తక్కువ సంబంధాలు కలిగి ఉన్నందున ఖచ్చితమైన సంఖ్యను అంచనా వేయలేకపోతున్నారు. కనీసం 30 సమూహాలు అడవిలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నాయని అంటారు. వారి సంఖ్య, వారి భాష లేదా సంస్కృతి గురించి ఎవరికి ఏమీ తెలియదు.