Subramanyam Dogiparthi .………………………………………………….
యుగంధర్. ఎన్టీఆర్ నటించిన హిట్ మూవీ ఇది. యాక్షన్ చిత్రాల డైరెక్టర్ కె యస్.ఆర్.దాస్ ఈ యుగంధర్ కి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ చిత్రాన్ని దాస్ డైరెక్ట్ చేయడం అదే మొదటి సారి .. చివరి సారి కూడా. సినిమా హిట్ అయినప్పటికీ దాస్ కి ఎన్టీఆర్ మరోసారి అవకాశం ఇవ్వలేదు.ఇందులో ఎన్టీఆర్ జయసుధ జంటగా నటించారు.
1978 లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘డాన్’ సినిమాకు రీమేక్ ఇది. 1979 లో రిలీజ్ అయింది. హిందీలో అమితాబ్, జీనత్ అమన్ జంట గా నటించారు. హిందీ ‘డాన్’ సినిమా కు 1969 లో వచ్చిన ‘చైనా టౌన్’ సినిమా స్ఫూర్తి. ‘చైనా టౌన్’ సినిమాకు రీమేకే NTR నటించిన ‘భలే తమ్ముడు’ సినిమా. ఆ సినిమా కూడా హిట్ మూవీయే.
అలాగే ‘డాన్’ కథ ఆధారంగా తమిళంలో రజనీకాంత్ తో బిల్లా నిర్మించారు. అది హిట్ అయింది. కొన్నాళ్ల తర్వాత మలయాళంలో మోహన్ లాల్ హీరోగా శోభరాజ్ గా రీమేక్ అయి అక్కడ కూడా దుమ్ము రేపింది. యుగంధర్ & డాన్ సినిమాల కధాంశంతోనే 2009 లో ప్రభాస్,అనుష్క,కృష్ణంరాజులు నటించిన ‘భిల్లా’ సినిమా వచ్చింది.
యుగంధర్ సినిమాకు మరో విశేషం ఉంది.మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఏకైక ఎన్టీఆర్ సినిమా ఇది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు రాజా. పాటలకు కూడా మంచి ట్యూన్స్ అందించారు. వేటూరి, సి నారాయణరెడ్డి , ఆత్రేయలు వ్రాయగా బాలసుబ్రమణ్యం , యస్ జానకిలు పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్టయ్యాయి.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవటానికి పాటలే ప్రధాన కారణం.
ముఖ్యంగా సి నారాయణరెడ్డి వ్రాసిన ‘ఓరబ్బా ఏసుకున్నా కిళ్ళీ’ పాట వీర మాసు . మరో పాట ‘నా కోసమే మీరొచ్చారు… మీ కోసమే నేనొచ్చాను… ఇంతకు నేనూ ఎవరో తెలుసా …నా పేరే యుగంధర్’ పాట కు ఎన్టీఆర్ అభిమానులు థియేటర్లలో డాన్స్ లు వేశారు.ఈ పాటను కూడా నారాయణరెడ్డి గారే వ్రాసారు.రెండు పాటల్లోనూ NTR ముప్పై ఏళ్ళ కుర్రోడి లాగానే డాన్సులు వేసారు.
జయమాలిని మీద చిత్రీకరించిన ‘నా పరువం నీ కోసం’ పాట చాలా బాగుంటుంది . జయసుధ మీద చిత్రీకరించిన ఆత్రేయ గారి ‘దా దా దా దా దాగేదా’ పాట కూడా హుషారుగా ఉంటుంది. ఎన్టీఆర్ పై చిత్రీకరించిన వేటూరి వ్రాసిన ‘జంతర్ మంతర్ నగరం’ పాట కూడా బాగా హిట్టయింది . మొత్తం మీద పాటలన్నీ వీర హిట్టే.
ఈ సినిమా లో ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తారు. డ్రెస్, హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన రివెంజ్ సినిమాలన్నీ కనక వర్షం కురిపించాయి. ఎన్టీఆర్ అభిమానులను ఉర్రూతలూగించాయి. వాటిల్లో ఒకటి ఈ యుగంధర్ సినిమా. ఎన్టీఆర్ నటనను వేరెవరితో పోల్చలేం. డీవీ నరసరాజు ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. ఎం.సి.శేఖర్ కెమెరా పనిదనం బాగుంటుంది.
ఎన్టీఆర్,జయసుధ,లీల ప్రభాకరరెడ్డి,సత్యనారాయణ,జగ్గయ్య , త్యాగరాజు , ప్రసాద్ బాబు , జయమాలిని ప్రభృతులు నటించారు . 21 సెంటర్లలో యాభై రోజులు ఆడింది . అందులో మా నరసరావుపేట సంధ్యా పేరడైజ్ కూడా ఉందోచ్ . గుంటూరు , విశాఖపట్నం , విజయవాడలలో వంద రోజులు ఆడింది . ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకు ముందు చూడని ఎన్టీఆర్ అభిమానులు చూడవచ్చు.. చూసిన వారు చూడవచ్చు.