ఆతిధ్య రంగంలోకి అంబానీ .. బ్రిటన్ లో పెద్ద టూరిస్ట్ హబ్ !

Sharing is Caring...

ఇండియన్ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని  విదేశాల్లో కూడా విస్తరించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆతిథ్య రంగంలో బలమైన శక్తిగాఎదిగే యత్నాల్లో ఉన్నారు. తాజాగా బ్రిటన్ లోని బకింగ్ హోమ్ షైర్ వద్ద నున్న ఒక విలాసవంతమైన గోల్ఫ్ రిసార్ట్ ను ముఖేష్ కొనుగోలు చేశారు. దాని ఖరీదు జస్ట్ 592 కోట్లు మాత్రమే. బ్రిటన్ లో ఈ లక్జరీ గోల్ఫ్ రిసార్ట్ కి చాలా పాపులార్టీ ఉంది.  ఐకానిక్ కంట్రీ క్లబ్ గా గుర్తింపు పొందింది. ఈ స్టోక్ పార్క్ రిసార్ట్ లో 49 లగ్జరీ బెడ్ రూములు, సూట్లు, మరిన్ని ఛాంపియన్ షిప్ గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. వీటికి యూరప్ లోనే అత్యధిక రేటింగ్ కూడా ఉంది. ఇంకా 13 టెన్నిస్ కోర్టులున్నాయి. 14 ఎకరాల్లో ఉన్న అందమైన ..విశాలమైన తోటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నపర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సంపన్నవర్గాల కుటుంబాలే ఇక్కడికి వస్తుంటాయి.

ఈ స్టోక్ పార్కుకు  ఫైన్ ఉడ్ స్టూడియోస్, బ్రిటిష్ చిత్ర పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గోల్డ్ ఫింగర్ (1964) టుమారో నెవర్ డైస్ (1997) వంటి రెండు జేమ్స్ బాండ్ సినిమాల షూటింగ్  స్టోక్ పార్క్‌లోనే జరిగింది. అలాగే  బ్రిడ్జేట్ జోన్స్ డైరీ (2001) సినిమా లోని కొన్ని సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. ఈ రిసార్ట్ కి 900 ఏళ్ళ చరిత్ర ఉంది. 1908 వరకు దీని గురించి అంతగా ఎవరికి తెలియదు. ప్రైవేటు నివాసంగా ఉండేది. వ్యాపార వర్గాల చేతుల్లోకి వచ్చాక బాగా పాపులర్ అయింది. ఇంత చరిత్ర గల ఈ రిసార్ట్ ని ముఖేష్ చౌకధర లోనే కొనేశాడని చెప్పుకోవచ్చు. ఈ రిసార్ట్ ను ముఖేష్ పెద్ద టూరిస్ట్ హబ్ గా మార్చేఆలోచనలో ఉన్నారని మార్కెట్ వర్గాల సమాచారం. మరిన్ని సదుపాయాలు కల్పించి .. అదనపు ఆకర్షణలతో.. హంగులతో నెంబర్ వన్ రిసార్ట్ గా స్టోక్  పార్క్ ని తీర్చిదిద్దే ప్లాన్ లో ఉన్నారని చెబుతున్నారు.  ఈ కొనుగోలు సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజి కి కూడా తెలియజేసారని తెలుస్తోంది.

ఈ స్టోక్ పార్క్ రిసార్ట్ కొనుగోలు తో ముఖేష్ ఆతిధ్య రంగంలో తన వాటాను పెంచుకున్నారు. నేరుగా రిలయన్స్ ద్వారా కాకుండా రిలయన్స్ఇండస్ట్రియల్ , ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ కంపెనీ ద్వారా కొనుగోలు చేశారు. ఇప్పటికే ముంబయి లోని ఒబెరాయ్ హోటల్స్ లో ఉన్న వాటాకు ఈ రిసార్ట్ అదనం అవుతుంది. వివిధీకరణ వ్యూహాల్లో భాగంగా ఇప్పటికే ముఖేష్ గత మూడు నాలుగేళ్లుగా మీడియా, టెక్నాలజీ, టెలికాం, ఎనర్జీ రంగాల్లో కాలు పెట్టారు.జియో ద్వారా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఆతిధ్య రంగంలో కూడా వాటా పెంచుకుంటూ సుస్థిర స్థానం సాధించే యత్నాల్లో ఉన్నారు.  త్వరలో పబ్లిక్ ఇష్యూ కి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. రిలయన్స్ కున్న ఇమేజ్ ద్వారా ఆ 30-40 సార్లు పైనే ఓవర్ సబ్స్క్రయిబ్ కావచ్చు. 

——————-K.N.Murthy 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!