Registration has already started………………………
అమర్నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర ఇది. అమర్ నాథ్ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఏడాది కి ఒకసారి ఈ అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది జూన్ 29 న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 19న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
మంచుకొండల్లో కొలువుదీరిన మహాశివుని దర్శనం కోసం వెళ్లే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు, కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు, పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి.. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే.
అలాంటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్తోంది. ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. అదే ‘ఓం నమఃశివాయ’ శివ పంచాక్షరి మంత్రం. పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అమర్‌నాథ్ ఒకటి.
సాధారణంగా ఎక్కడైనా ఈశ్వరుడు స్వయంభువుగా ఒక్కసారే అవతరిస్తాడు. కానీ, అమర్‌నాథ్‌లో ప్రతి ఏటా వెలసి మంచుతో, కూడిన లింగ రూపంలో కనిపిస్తాడు. హిందువులు ఈ యాత్రను అత్యంత పరమ పవిత్రంగా భావిస్తారు. అమరనాథ్ యాత్ర చేస్తే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం.
అమరనాథ గుహలకు ప్రపంచంలోనే అతి పెద్ద గుహలలో ఒకటిగా పేరుంది. కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు 145 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో అమర్‌నాథ్ గుహలో భక్తులకు దర్శనమిస్తాడు భోళా శంకరుడు. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది.
హిమాలయ పర్వత సానువుల్లో సహజసిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా ఈ గుహ పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది. ఆ సమయంలో మైనస్ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ సమయంలో గుహను చేరుకోవటం అసాధ్యం.
జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది. మంచు కరుగుతుంటుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది.
పరమాత్ముడు ఒక్కడే అయినా ఆయన రూపాలు అనేకం. సాకార, నిరాకార స్వరూపుడిగా భగవంతుడు ప్రకటితమవుతాడు. ఆద్యంతాలు లేని ఆదిదేవుడు, అనంత కాల గమనాన్ని శాసిస్తూ అంచనాలకు అందని అమేయ స్వరూపుడు- విశ్వేశ్వరుడు. ప్రళయకాల సందర్భంలో సర్వేశ్వరుడు లింగాకృతిలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. లింగ స్వరూపం సృష్టి రహస్యానికి ప్రతీక.
కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో స్వర్ణలింగం, ద్వాపరయుగంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగం పూజనీయాలని పెద్దలు చెబుతారు. అలాగే సకల మనోభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి హిమలింగ దర్శనం, ఆరాధనం దోహదపడుతుందని పెద్దల మాట.
మహిమాలయంగా వెలిగే హిమాలయ సీమల్లో ప్రకృతి రూపుడిగా, హిమలింగంగా అమరనాథునిగా ఏటేటా ఆవిర్భవిస్తున్నాడు. దివ్య ధవళ కాంతులతో, స్వచ్ఛ స్ఫటికంగా, సహజసిద్ధంగా ఏర్పడే అమరనాథుని మంచులింగాన్ని దర్శించుకోవడం భక్తులకు కమనీయ అనుభూతిని ఇస్తుంది.
అమరనాథ యాత్ర ఎన్నో అనుభవాలు, అనుభూతుల సమ్మేళనం. హిందూ పురాణాల ప్రకారం, కైలాసనాథుడు అమరనాథ్ గుహలోనే పార్వతీ దేవికి ‘అమరత్వం’ మంత్రాన్ని వివరించాడని అంటారు. పరమేశ్వరుడు పార్వతీదేవికి అమరత్వం గురించి వివరించే సమయంలో ఆ గుహలో రెండు పావురాలు కూడా ఆ మంత్రాన్ని విన్నాయి.
అందుకే ఈ జంట పావురాలు ఇప్పటికీ అదే గుహలో సజీవంగా ఉన్నాయని చెబుతారు. శివయ్య చెప్పే ‘అమరత్వం’ రహస్యం విన్న వారికి మరణం అనేది ఎప్పటికీ సంభవించదు. ఈ పావురాలు కొందరికి కనిపించాయని చెబుతారు. కొందరికి బయట కనిపించాయని చెబుతుంటారు.
పరమేశ్వరుడు మూడో కన్ను తెరవడం వల్ల ఏర్పడిన అగ్ని వల్ల ఈ గుహ ఏర్పడిందని పురాణ కథనాలు చెబుతున్నాయి.ఇక్కడ ఉండే శివలింగం సహజంగానే పెరుగుతుంది. అందుకే ఈ లింగాన్ని ‘స్వయంభూ లింగం’ అని అంటారు.
పరమేశ్వరుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచ భూతాలను ఇక్కడే వదిలిపెట్టారని, అందుకే ఈ ప్రాంతాన్ని ‘పంచతరణి’ అని కూడా అంటారు . అమరనాథ్ గుహకు చేరుకునే ఆరు కిలోమీటర్ల దూరంలో ఐదు ప్రాంతాలను పంచభూతాల పేర్లతో పిలుస్తారు.
అమరనాథ్ వద్ద ప్రవేశించే పంచ నదులు… శివయ్య జటాజూటం నుంచి ప్రవహించాయని నమ్ముతారు. అమరనాథ్ గుహలోని శివ లింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ?.. ఎలా వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీ యే.. ఈ అమరనాథ్ గుహ సుమారు 5 వేల సంవ్సరాల కంటే పురాతనమైనదని చెబుతారు.
అమరనాథ్ జమ్మూ నగరానికి 178 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు లేదా బస్సుల్లో వచ్చేవారు జమ్మూలో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్‌కు చేరుకోవాలి. బల్తాల్ నుంచి అమరనాథ్ చేరుకునేందుకు ఒకట్రెండు రోజులు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
పహల్గామ్ వెళ్లాలంటే దాదాపు 36 నుంచి 48 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో ట్రెక్కింగ్ కు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది.కొంత రిస్క్ అయినప్ప్పటికీ అక్కడ శివుని దర్శనం అద్భుతం .. అపూర్వం. శారీరకంగా ఫిట్నెస్ ఉన్నవారు ఈజీగా వెళ్ళవచ్చు … నడవలేని వారు గుర్రాలపై లేదా డోలీ పై గుహ దగ్గరకు చేరుకోవచ్చు.
అమరనాథ్ యాత్ర కి వెళ్లాలనుకునే యాత్రీకులు తమ పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ ఇప్పటికే మొదలయింది. అలాగే హెలికాప్టర్‌లో అమర్‌నాథ్ చేరుకోవడానికి కూడా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.