Ancient Shiva Temple …………………..
శివుడు దేవగురువు బృహస్పతి నామధేయంతో గురు దక్షిణామూర్తి గా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రమిది. తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన ఈ దివ్యక్షేత్రం తిరువారూర్ పట్టణం నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలన్‌గుడి గ్రామంలో ఉంది. కుంభకోణం నుండి 17.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం.
క్షీరసాగరమథనంలో ముల్లోకాలనూ దహించి వేసేంత వేడితో హాలాహలం బయటి కొచ్చిందట. దాని ధాటికి తట్టుకోలేక దేవతలంతా హాహాకారాలు చేస్తుంటే భోళాశంకరుడు ఆ గరళాన్ని సేవించి గొంతులో నిలుపుకున్నప్రదేశం ఇదేనని స్థలపురాణం చెబుతోంది.
అలా ఆపద నుంచి గట్టెక్కించిన మహా శివుణ్ని ‘ఆపత్‌సహాయేశ్వరర్’గా కొలిచారు దేవతలు. విషాన్ని మింగి గరళకంఠుడైన సదాశివుడు అక్కడే దేవదానవులకు జ్ఞానబోధ చేసి గురుదక్షిణామూర్తిగా వెలిశాడని అంటారు.
శివుడికి అంకితమైన నవగ్రహ దేవాలయాలలో ఇది ఒకటి..అలన్‌గుడి చుట్టూ మూడు పవిత్ర నదులు ఉన్నాయి. అవి కావేరి, కోలిడం, వెన్నారు.ఆలయం చుట్టూ 15 తీర్థాలు ఉన్నాయి. వాటిలో ఆలయ సమీపాన ఉన్న అమృత పుష్కరణి చాలా ప్రసిద్ధి చెందింది. ఆలయం ముందు చక్ర తీర్థం ఉంది. ఈ తీర్థం మహా విష్ణువు చక్రం ద్వారా సృష్టించబడిందని చెబుతారు.
గణేశుడిని ఈ మందిరంలో ‘కలంగమల్ కాథ వినాయగర్’ అని పిలుస్తారు. మరొక పురాణం ప్రకారం పార్వతి దేవి శివుడిని వివాహం చేసుకోవడానికి ఇక్కడే తపస్సు ప్రారంభించి, తరువాత శివుడిని వివాహం చేసుకుంది. అందుకే ఈ ప్రదేశాన్ని ‘తిరుమన మంగళం’ అని కూడా అంటారు.
గురుడికి ఇష్టమైన గురువారం నాడు, సంక్రమణం రోజుల్లోనూ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పసుపుపచ్చటి వస్త్రాలు,శనగలు స్వామి వారికి సమర్పిస్తారు భక్తులు. చదువులో వెనకబడిన విద్యార్థులు ఈ స్వామిని దర్శించుకుని నానబెట్టిన శనగలతో కట్టిన మాల వేసి పూజిస్తే తప్పక ఉత్తీర్ణులవుతారని భక్తుల విశ్వాసం.
గురుగ్రహానికి సంబంధించిన దోషాలున్నవారు అలన్‌గుడి దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణాలు చేసి ఆస్వామి సన్నిధిలో నేతితో 24దీపాలు వెలిగిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని భక్తులు చెబుతుంటారు.
అలన్‌గుడి గురు ఆలయ సముదాయాన్నిచోళులు నిర్మించారని చెబుతారు. ప్రస్తుత కట్టడాల నిర్మాణం 16వ శతాబ్దంలో పూర్తి అయ్యాయి. ఈ ఆలయాన్ని శతాబ్దాలుగా వివిధ పాలకులు పునరుద్ధరించారు.. విస్తరించారు.అలన్‌గుడి ఆలయం ద్రావిడ నిర్మాణ శైలికి ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.
రాజగోపురం .. ఆలయ ప్రధాన గోపురం ఐదు అంతస్తులను కలిగి ఉంటుంది. ఆలయంలో విశాలమైన మండపాలు ఉన్నాయి.ఈ ఆలయంలో దేవతల శిల్పాలు, పౌరాణిక కథల దృశ్యాలను నాటి శిల్పులు అద్భుతంగా చెక్కారు.
అలన్‌గుడి నుండి 18 కి.మీ దూరంలో ఉన్న కుంభకోణం స్టేషన్ కి చేరుకుంటే అక్కడ నుంచి బస్ లేదా టాక్సీ లో దేవాలయం కి వెళ్ళవచ్చు. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలు, బెంగళూరు, చెన్నై రైలు నెట్‌వర్క్ కుంభకోణానికి అనుసంధానమై ఉన్నాయి.