Govardhan Gande ………………………………….
తప్పు/పాపం ఎవరిది? కారణం ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న క్రమంలో ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కానీ జవాబు మాత్రం సుదీర్ఘమైనది. దీనికి ఎంతో చరిత్ర ఉంది. తాజా పరిణామానికి అమెరికా తన సైనిక బలగాల ఉపసంహరణ ముఖ్య కారణం అని అందరికీ అర్ధమవుతోంది. తాలిబన్ దురాక్రమణకు కారణం…రష్యా,అమెరికా,ఇంగ్లండ్ దేశాల స్వార్థ రాజకీయ,ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే అని చెప్పాలి.
నిన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా పోషించిన పాత్రను ఇప్పుడు చైనా తలకెత్తుకోనున్నది. ముందు రష్యా,తరువాత ఇంగ్లండ్, అటు తరువాత అమెరికా ఆఫ్గాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం చాందస మూకలను పోగు చేసి రష్యాను ఆ దేశం నుంచి వెళ్లి పోయేలా చేసిన సంగతి ఇటీవలి చరిత్రే. అమెరికా పోషించిన ఈ పాత్రకు పాకిస్తాన్ అండగా నిలిచి తన సహకారాన్ని దిగ్విజయంగా అందించింది.
ఆఫ్ఘనిస్తాన్ లో తమ జోక్యానికి ఈ దేశాలు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే పేరు పెట్టుకున్నాయి. ఈ జోక్యాన్ని ప్రశ్నించే ధైర్యం,సాహసం చాలా దేశాలకు లేదు.కాదు కాదు ఈ పెద్దన్న దేశానికి,వాటికి సహకరించిన దేశాలతో వీటికి అనేక రాజకీయ,ఆర్థిక అవసరాలున్నాయి. అయితే సగటు ఆఫ్ఘానీకి ఈ దేశాలతో సంబంధం లేదు. అవసరమూ లేదు. కానీ అనుభవించవలసిందే. చేయని తప్పుకు అగ్ర దేశాల స్వార్థ ఆర్థిక, సంకుచిత ఆధిపత్య ప్రయోజనాలకు 4 కోట్ల అమాయక ఆఫ్గానిస్తాన్ పౌరులు బలవంతపు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. మీడియా నివేదికల ప్రకారం తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో క్రూరమైన చట్టాలను అమలు చేస్తున్నారు. మహిళలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఉగ్రవాదులైతే మహిళలను బలవంతంగా ఎత్తు కెళుతున్నారు. బానిసలు గా మార్చేస్తున్నారు.15 ఏళ్ళు పైబడిన బాలికల, 45 ఏళ్లలోపు వితంతు మహిళల కోసం అన్వేషిస్తున్నారు. మహిళలు బయట కెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఉగ్రవాదులు మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారు.20 ఏళ్ళక్రితం స్వేచ్ఛను అనుభవించిన మహిళలు ఇపుడు దుర్భర కష్టాలలో కూరుకుపోతున్నారు. భద్రత గురించి భయపడుతున్నారు. విడాకుల తీసుకున్న మహిళలు బెంబేలెత్తి పోతున్నారు. తాలిబన్ల కొత్త ఆంక్షల ప్రకారం వారికి సమాజంలో చోటు లేదు. పరిస్థితులు ఘోరంగా మారుతున్నా పట్టించుకునే వారే లేరు. హక్కుల సంస్థలు కూడా చోద్యం చూస్తున్నాయి.

