డా.వంగల రామకృష్ణ ……………………..
గ్రాంథికభాషలో ఇరుక్కుపోయిన తెలుగు పలుకును ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, దాని అందాన్ని తెలియజెప్పిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి. వ్యావహారిక భాషోద్యమ కర్త, బహుభాషా శాస్త్రవేత్త, సవరభాషా (శబరభాషా) పితామహుడు గిడుగు.
ఆయన పుణ్యమా అని కొద్దిమందికే పరిమితమైన చదువు వ్యవహార భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. జనవరి 22 ఆయన జయంతి సందర్భంగా ఒకసారి స్మరించుకుందాం.
1863 ఆగస్ట్ 29న శ్రీకాకుళం జిల్లా ముఖలింగ క్షేత్రం దగ్గరి పర్వతాల పేటలో గిడుగు జన్మించాడు. వ్యవహార భాషలో అజరామరమైన గేయాలను గుమ్మరించిన గురజాడ అప్పారావు గిడుగుతోబాటే విజయనగరం రాజావారి బడిలో చదువుకున్నాడు. ఆ విధంగా ఈ ఇద్దరు మహనీయులు చిన్ననాటి స్నేహితులు.
ఉపాధ్యాయ జీవితంలో ఉండగా సవరల భాష అధ్యయనం చేసి దానికి వ్యాకరణాన్ని, పదకోశాన్ని తయారు చేశాడు. సొంత ఖర్చుతో అచ్చువేసి భాషా ప్రియులకు పంచిపెట్టాడు.
ఉన్నత పాఠశాలలో చరిత్ర పాఠాలు చెప్పే రోజుల్లోనే ముఖలింగ దేవాలయాల శాసనాలను అధ్యయనం చేసి గాంగవంశీయుల గురించి పరమ ప్రామాణిక వ్యాసాలు రాశాడు.
వ్యవహరభాషకు, పుస్తక భాషకు మధ్య ఇంత తేడా ఎందుకు? అని మదనపడేవాడు. గురజాడ, శ్రీనివాస అయ్యంగారు, యేట్సులతో కలిసి “వ్యావహారి కోద్యమానికి శ్రీకారం చుట్టారు. 1906 నుండి 1940 వరకు ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఉద్యమవ్యాప్తి కోసం గిడుగు ‘తెలుగు’ మాసపత్రిక నడిపాడు.
1925లో తణుకులో జరిగిన ఒక సభలో “ఆంధ్రసాహిత్యపరిషత్తు” వ్యావహారిక భాషను తీవ్రంగా ప్రతిఘటిస్తే గిడుగు గుక్కతిప్పుకోకుండా నాలుగు గంటలపాటు ప్రసంగించి పరిషత్తుతో వ్యవహార వాదానికి అనుకూలంగా తీర్మానం చేయించాడు.
“దేశభాష లోకంలో ఎప్పుడూ వినబడుతుంది. గ్రాంథికభాష పుస్తకాలలో కనబడేదే తప్ప జనంలో వినబడేది కాదు. గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకున్నా, సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో గమనించండి. ప్రాచీనకావ్యాలు చదువ వద్దనీ నేననను. గ్రాంథిక భాషలో జనం తప్పులు లేకుండా రాయలేరు.
గ్రాంధిక భాష రాసేవారికి కష్టం.. వినేవారికి కష్టం.. రాతగాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పదలచుకున్న విషయాన్ని మాట్లాడే భాషలో అనుకుని గ్రాంథిక భాషలోకి తర్జుమా చేస్తున్నారు. దాన్ని చదివేవాళ్ళు, వినేవాళ్ళు తమ యాసబాసలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు. ఎందుకీ ప్రయాస?
ప్రజాపాలన కోరుతున్నమనం సామాన్య జనులకు అర్థమయ్యే భాషలో రచన చేయడానికి అభ్యంతరపడుతున్నాం అని ఆందోళన చెందేవారు. గుప్పెడు మంది రాసే భాషను చదివి అర్థం చేసుకోడానికి లక్షల మంది సతమతమవ్వాలా? అన్నది ఆయన ప్రశ్న.
నిఘంటు సాయం లేకుండా చదువుకోగల రచనలు రావాలని, బుర్రలు చింపుకోనవసరం లేకుండా వినగలిగే ఉపన్యాలు చేసేవారు రావాలని గిడుగు కోరుకునేవారు.