Govardhan Gande ………………………………………….
రాజకీయాల్లో తిట్లు/దూషణలు,నిందలు,ఆరోపణలు మామూలే.ఒక్కోసారి అవి శృతి మించుతుంటాయి.ఎబ్బెట్టుగా ఉంటాయి. అసహ్యంగా ఉంటాయి. ఆ లక్షణాలు లేని రాజకీయాలే మచ్చుకైనా లేవు.రాజకీయాలు అలానే ఉంటాయి. దీనిపై చర్చ, ఉపన్యాసాలెందుకు? అని అనిపించవచ్చు.అలా అనిపించడం సహజం కూడా. కానీ ఇది సహజమైనది కాదు. కానీ ఇది సహజమైన అభిప్రాయమే అనే నిర్దారణకు వచ్చేసాం. కాదు మనల్ని అలాంటి మానసిక స్థితికి ఈ రాజకీయ నాయకత్వం నెట్టి వేసింది.
నిజంగా ఇది సహజమేనా? తిట్లు/దూషణలు,నిందలు లేని రాజకీయాలుండవా? పత్రికలు,టీవీల్లో నిత్యం మనం చూసేవి, చూస్తున్నవి ఇవే కదా. తిట్లు రాని వాడు,తిట్టలేని వాడు నాయకుడే కాదనే ఓ అభిప్రాయం స్థిరపడిపోయింది. ఆ తిట్ల ద్వారానే నిత్యం ప్రచార,ప్రసార సాధనాల్లో ఉనికి చాటుకొని నాయకులుగా చలామణి అవుతున్న దుస్థితిని మనం చూస్తున్నాం కదా.ఇలా వ్యవహరించలేని వారు రాజకీయాల్లో కొనసాగడం కష్టసాధ్యం ఆనే అభిప్రాయానికి కూడా వచ్చాం.
అలాంటప్పుడు ఈ అభిప్రాయం సరైనదేనని అనుకోవలసి వస్తున్నది. అది నిజమే అయినప్పుడు దీనికి రాజకీయ నాయకత్వాన్ని నిందించడం ఎందుకు? ఎలా న్యాయం? అనే ప్రశ్న తలెత్తుతుంది. రెండు రోజుల క్రితం తెలంగాణ మంత్రివర్యులొకాయన పిచ్చకుంట్ల అనే పదాన్ని టీపీసీసీ అధ్యక్షుడిని తిట్టడానికి ఉపయోగించాడు. పిచ్చకుంట్ల అనేది తెలంగాణ లో ఓ కులం. ఆ కులం పేరుతో రేవంత్ రెడ్డిని దూషించడం/నిందించడం ద్వారా ఆ కులాన్ని,ఆ కుల ఆత్మ గౌరవాన్ని అవమానించారు. అది అన్యాయం కదా. ఆయన గారు ఆ మాటను ఉపసంహరించుకున్నారు కూడా.
దీనిలో మంత్రి వర్యుడిని మాత్రమే నిందించనవసరం ఏమీ లేదు.అవతలి పక్షం ఏమీ తక్కువ కాదు.ఆయన గారు కూడా నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. నిత్యం ప్రభుత్వ పెద్దలను వ్యక్తిగత స్థాయిలో తిడుతూ ప్రచారంలో ఉంటున్న సంగతి మనకు తెలుసు. ఒక్క తిట్టు కూడా తిట్టకుండా పూట గడవని నాయకులు మన చుట్టూ కనిపిస్తారు. ఇప్పుడు .. దాదాపుగా మెజారిటీ రాజకీయ నాయకులు తీరు ఇదే. ఇది సరే. తిట్లు లేకుండా రాజకీయాలు ఉండడం సాధ్యం కాదా?తిట్లు తిట్టలేని నాయకుడికి రాజకీయ ఆస్తిత్వమే ఉండదు అనే దౌర్బల్యమైన దుస్థితికి రాజకీయాలు దిగజారిపోయాయి.
అవేవీ లేకుంటే వాటిని రాజకీయాలు అని పిలవలేమా? ఎందుకు ఉండవు? ఎందుకు సాధ్యం కాదు. సాధ్యమే. ఒక తరం వెనక్కి వెళ్లి చరిత్రను పరిశీలిస్తే.. అలాంటి రాజకీయాలు సాధ్యమే అని మనకు అర్ధమవుతుంది. కానీ ఈనాటి స్థితి ఇంతగా దిగజారడానికి కారణం ఎవరు? బాధ్యులెవరు?అనే ప్రశ్నలు వేసుకుంటే ప్రస్తుత నాయకత్వమే కారణమని మనకు అర్ధమవుతుంది. ఈ దుస్థితికి రాజకీయాలను దిగజార్చి న నాయకత్వ వైఖరిపై ఇప్పుడు లోతైన చర్చ జరగవలసి ఉన్నది.జరిగినా ప్రయోజనం ఉంటుందో లేదో చెప్పలేం. ఇపుడు విమర్శలకు నాయకులు జడవడం లేదు. విలువలను పట్టించుకోవడం లేదు.