Paresh Turlapati…………
దేశభక్తి, సైన్యం, యుద్ధం, సీక్రెట్ ఆపరేషన్, స్పై నేపథ్యంలో రూపొందిన సినిమాలు కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నాయి. కొద్దీ రోజుల క్రితం వచ్చిన దురంధర్ మూవీ ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. అలాగే ‘ఇక్కీస్’ సినిమా కూడా 1971 ఇండో పాక్ వార్ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా నిర్మించారు.
కాలేజీకి వెళ్లే విద్యార్థుల వయసులో ఉన్న కుర్రాడు దేశం కోసం ట్యాంకులు పట్టుకుని శత్రు దేశంతో ఏ విధంగా పోరాటం చేసాడో చూపించిన ఒక వాస్తవిక గాథ,,, అరుణ్ ఖేత్రపాల్ .. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు అరుణ్ ఖేత్రపాల్ ఎవరో చాలామందికి తెలిసుండకపోవచ్చు.
21 ఏళ్ళ వయసులోనే దేశం కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన వీరుడు అరుణ్ ఖేత్రపాల్…చక్కటి చదువు ఉంది. అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి కానీ వీటన్నిటికంటే అతడిలో దేశభక్తి కూడా ఎక్కువగానే ఉంది. తండ్రి ఆర్మీ ఆఫీసర్, ఆయనకు దేశం కోసం సరిహద్దుల్లో పోరాడిన చరిత్ర ఉంది.
అలుపెరగని పోరాటంతో యుద్ధాలు చేసి చేసి రిటైర్ అయిన ఆయన కొడుకుని ఒక్కటే అడిగాడు. నీ జీవితమా? దేశమా? ఏదో ఒక్కటే కోరుకో! నీ జీవితమే ముఖ్యమనుకుంటే నచ్చిన జాబులో చేరిపో దేశమే ముఖ్యం అనుకుంటే మాత్రం సైన్యంలోనే చేరిపో అని సలహా ఇచ్చాడు. క్షణం ఆలోచించకుండా దేశమే ముఖ్యం అన్నాడు ఈ కుర్రాడు..
ఆ క్షణాన ఆ కుర్రాడికి కూడా తెలీదు తాను తీసుకున్న నిర్ణయం సరిహద్దుల్లో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుతుందని ఆ పోరాటంలో తాను అమరుడై చరిత్రలో నిలిచిపోతానని… భవిష్యత్తులో తన కథనే సినిమాగా తీస్తారని, తన పాత్రలో తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ మనవడు నటిస్తాడని, తన తండ్రి పాత్రలో మరో అభిమాన నటుడు ధర్మేంద్ర నటిస్తాడని.. అతడికి తెలిసింది ఒక్కటే..
శత్రుసైన్యాన్ని అంగుళం కూడా ముందుకు రానివ్వకుండా సరిహద్దుల్లో కావలి కాయాలని … దేశం, ధర్మం అంటూ 21 ఏళ్ళ యువకుడు కదన రంగంలోకి దిగాడు. నేటి తరానికి ఇటువంటి వీరుల కథలు తెలియాలి. అందుకే దర్శక, నిర్మాతలు మంచి ప్రయత్నం చేసారు. ఒక వీరుడి కథను ఎక్కువా,తక్కువా లేకుండా వాస్తవంగా చూపించారు.
కథ ఇండియన్ ఆర్మీ మాజీ అధికారి ఎంఎల్ ఖేత్రపాల్ (ధర్మేంద్ర) పాక్ పర్యటనతో మొదలౌతుంది. ఈయన గతంలో ఆర్మీలో పనిచేసినప్పుడు పరిచయాలు ఉన్న కొందరు పాత మిత్రులు రీ యూనియన్ లాంటిది ఏర్పాటు చేయడంలో ఎంఎల్ ఖేత్రపాల్ పాక్ పర్యటనకు వెళ్తాడు.అక్కడ ఈయన పర్యటనలో ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను మరో ఆర్మీ మాజీ ఆఫీసర్ నిస్సార్ అహ్మద్ జైదీప్ ఆహ్లావత్) తీసుకుంటాడు.
పాక్ పర్యటనలో భాగంగా వివిధ ప్రదేశాలకు తిరుగుతున్న ఖేత్రపాల్ ఇండో -పాక్ వార్ లో తన కొడుకు మరణించిన ప్రదేశానికీ వెళ్తాడు అక్కడ కొడుకు జ్ఞాపకాలు నెమరువేసుకునే క్రమంలో అరుణ్ ఖేత్రపాల్ కథ మొదలౌతుంది..
అది 1971 ఇండో పాక్ వార్ హోరాహోరీగా జరుగుతున్న సమయం… పాక్ సైన్యం నదిలో బాంబులు పెట్టి మన సైన్యాన్ని ముందుకు రానివ్వకుండా కట్టడి చేస్తున్న సమయం. ఈ పరిస్థితుల్లో పాక్ సైన్యాన్ని తాను నిలువరిస్తానంటూ సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ (అగస్త్య నంద) యుద్ధ రంగంలోకి దిగుతాడు.
ఇక్కడి నుంచి అరుణ్ చేసే సాహసాలు ఏంటి ? యుద్ధ ట్యాంకులతో తరుముకొస్తున్న పాక్ సైన్యాన్ని ఎలా నిలువరించగలిగాడు? అందుకోసం అతను అనుసరించిన యుద్ధ వ్యూహం ఏంటి? అనేది మిగతా కథలో తెలుస్తుంది.
ఈ రోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు చేసిన త్యాగాల ఫలితమే.. దర్శక, నిర్మాతలు కూడా అరుణ్ ఖేత్రపాల్ కథను సినిమాగా తీయడానికి ధైర్యం చాలక కొన్నేళ్లపాటు తమ దగ్గరే పెట్టుకున్నారట. ఎందుకంటే సైనికుల త్యాగాలను తెలియచెప్పే ఇలాంటి సినిమాలు జనాలు చూస్తారో ? చూడరో ? అనే సందేహమట… కానీ ఆఖరికి ఎలాగైతేనేమీ దైర్యంగా సినిమా పూర్తి చేసి విడుదల చేసారు.
21 వ పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోకుండా ఉన్నఫళంగా కదన రంగంలోకి దిగి అమరుడైన కొడుకును తల్చుకుంటూ కుమిలిపోవాలా? తండ్రీ, కొడుకుల మధ్య నడిచిన ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నదున్నట్టుగా తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ సక్సెస్ అయ్యాడు..
ఈ మూవీలో దర్శకుడు కథని రెండు భాగాలుగా విడదీసాడు.మొదటి భాగంలో కథానాయకుడి శౌర్య, పరాక్రమం, లవ్ ట్రాక్ లను చూపిస్తూ, రెండో భాగం లో తండ్రి జ్ఞాపకాల నేపథ్యంలో సన్నివేశాలను నడిపించారు.. కానీ సహజంగా ప్రేక్షకులకు కథానాయకుడి పరాక్రమమే ఎక్కువగా నచ్చుతుంది.. కాకపోతే ప్రథమార్ధమంలో హీరో శిక్షణ, లవ్ ట్రాక్ లకు ఎక్కువ సమయం తీసుకోవడంతో కథ నెమ్మదిగా నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది.
రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాల్లో మాదిరి ఐదు నిమిషాలకోసారి బాంబుల మోతతో థియేటర్లు దద్దరిల్లవు కాబట్టి కొంతమందికి ఫస్టాఫ్ కొంత నిరాశ కలిగించవచ్చు.సెకండాఫ్ నుంచి కథ యుద్ధ రంగం మీదకు మళ్లుతుంది .. కాబట్టి మనకు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తాయి.
దర్శకుడు యుద్ధ రంగంలో కూడా నీతి ఉంటుందని చెప్పడానికి ప్రయత్నించాడు. అరుణ్ ఖేత్రపాల్ యుద్ధ నీతిని ఫాలో అయ్యుంటాడు. అరుణ్ ఖేత్రపాల్ చేతికి శత్రు సైనికులు చిక్కినా బందీలుగా చూస్తాడే తప్ప చంపడు.నిజానికి ఈ నిబంధన ఆర్మీలో ఉంటుంది కానీ యుద్ధ సమయంలో ఎవరూ ఆ రూల్ ని పాటించరు. అక్కడ ఆర్మీ ఉన్నతాధికారుల విచక్షణాధికారాల బట్టి ఉంటుంది.
గతంలో ఇలా మనకి దొరికిన పాక్ సైనికులను వారి దేశానికి అప్పగించడం ..అలాగే మన సైనికులను వారు కూడా అప్పగించడం జరిగింది. ఈ యుద్ధ నీతిని అలా ఉంచితే యుద్ధ రంగంలో ఆ కుర్రాడు చేసిన పోరాటాలు చూస్తుంది ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
సినిమా మొత్తం ఒకెత్తు… ఆఖరి సన్నివేశాల్లో చూపించిన యుధం మరొకెత్తు, ఈ సినిమాకి హైలెట్ యుద్ధ సన్నివేశాలే.. ఈ సినిమా ద్వారా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద వెండితెరకు పరిచయం అయ్యారు. అతని నటనకు మంచి గుర్తింపు లభించింది.
అలాగే దివంగత నటుడు ధర్మేంద్ర చివరి చిత్రంగా ఇది ఒక ఎమోషనల్ అప్పీల్‌ను కలిగి ఉంది.ఇక్కీస్’ సినిమా సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో రూపొందింది. సచిన్-జిగర్ సంగీతాన్ని అందించారు.సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలను,యుద్ధ సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది.
సినిమాటోగ్రాఫర్ అనిల్ మెహతా కెమెరా పనితనం ‘అద్భుతం’ ..1971 నాటి యుద్ధ కాలాన్ని ప్రతిబింబించేలా దృశ్యాలను చాలా సహజంగా చిత్రీకరించారు.మొత్తంగా, ‘ఇక్కీస్’ చిత్రం భారీ ఆర్భాటాలు లేకుండా, ఒక సహజమైన, భావోద్వేగపూరితమైన దృశ్యకావ్యంగా నిలిచింది.

