సున్నిత మనస్కులకు కనెక్ట్ కాదీ సినిమా!!

Sharing is Caring...

Paresh Turlapati………………..

కథ..మాటలు..పాటలు.. సన్నివేశాలు.. హీరో ఎలివేషన్ల ఆధారంగా చిత్ర రాజములలో రెండు రకాల స్క్రిప్టులు తయారు కాబడును.. క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఒక రకంగానూ , మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఇంకోరకం గానూ కథనాలు వండి వడ్డించడం వెండి తెరపై అనాదిగా ఆచరించబడుతున్న సంప్రదాయం.

ఆ థీమ్ ప్రకారమే కథల్లో దినుసులు వాడబడును.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తో ఓ మాస్ మసాలా సినిమా తీసి హీరో గారి నత్తి నోటితో అర్థం కాని బూతులు పలికించాడు పూరీ.. హీరో నాలుగు బూతులు మాట్లాడితేనే మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారనుకునే ఫార్ములా ఈ మధ్య తెలుగు చిత్ర రాజములలో కడు గోచరిస్తుంది.

అదే ఫార్ములా ప్రయోగించి దర్శకుల వారు హిట్ 3లో కూడా నానీ గారిచేత సరికొత్త లిపిలో బూతులు పలికించే సాహసం చేసితిరి.. క్లాస్ ప్రేక్షకుల పూర్వ జన్మ సుకృతం చేతను నానీ వారి బూతులు సగమే పలికి మిగిలినవి మింగివేయబడినవి. ఇక ఈ చిత్ర రాజమునకు వస్తే హిట్ 1.. హిట్ 2 లలో ఇన్వెస్టిగేషన్ ఎక్కువ వయోలెన్స్ తక్కువ అయితే హిట్ 3 లో నానీ గారు పూనకాలు లోడింగ్ చేసుకుని మరీ కోసేశారు. 

నానీ సొంత బ్యానర్ లో గతంలో విశ్వక్ సేన్, అడవి శేష్ లు పోలీస్ ఆఫీసర్లుగా హిట్ పేరుతో కేసు 1 కేస్ 2 తీసాడు.. ఈ సినిమాలు వసూళ్ల పరంగా బానే ఆడాయి … దాంతో నానీ తనే హీరోగా హిట్ థర్డ్ కేస్ ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తీసాడు..

అయితే సున్నిత మనస్కులు.. చిన్న పిల్లలు ఈ సినిమా చూడకపోవడమే మంచిది అని సినిమాలో మితిమీరిన వయోలెన్స్ గురించి ప్రేక్షకులకు ముందే హింట్ ఇచ్చాడు నానీ.. ఎంత మంచివాడు.. ఆయన తప్పులేదు.. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు.. నిజమే ఈ సినిమాలో కోతలు మిక్కిలి మితిమీరి ఉన్నాయి.. సున్నిత మనస్కులు ఆ కోతలను తట్టుకోలేరు..

మాది రాతి గుండె కాబట్టి తట్టుకొనగలిగితిమి.. ఈ మధ్య మార్కో అనే మలయాళ సినిమాలో సొరకాయ కోతలు మితిమీరిపోయి రెండోజుల్లో వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది.. కేజీఫ్.. యానిమల్.. మార్కో వంటి సినిమాల్లో చూపించిన మితిమీరిన హింసను పాన్ ఇండియా ప్రేక్షకులు ఆదరించి నిర్మాతలకు కనక వర్షం కురిపించడంతో దర్శక మునులు పాత రంపాలకు పదును పెడుతున్నారు.

హిట్ 3 లో మాగ్సిమం ఎంతవరకు కోయొచ్చో అంతవరకు నానీ చేత కోయించేశాడు దర్శకుడు..ఈ కోతల్లో ఎరుపు మిక్కిలి భయంకరంగా కనిపించేలా హీరో నానీ తెల్ల కోటు వేయించడం దర్శకుల వారి మిక్కిలి తెలివితేటలకు నిదర్శనం

సరే బూతులు.. వయోలెన్స్ సంగతి కాసేపు పక్కనబెట్టి చిత్రం గురించి చెప్పుకుందాం..CTK పేరుతో డార్క్ వెబ్ క్రియేట్ చేసుకుని దేశవ్యాప్తంగా మనుషుల గొంతులు కోస్తున్న ఓ సైకో కిల్లర్ గ్యాంగును పట్టుకోవడానికి అర్జున్ సర్కార్ నామధేయం కలిగిన హీరో నానీ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరుగా ఆ గ్యాంగును ఎలా మట్టుపెడతారనేదే కథ

అయితే అర్జున్ సర్కార్ కు పని భారం తగ్గించుటకు సైకో కిల్లర్ గ్యాంగ్ తమ సీక్రెట్ కోడ్ అయిన CTK అను అక్షరములను ఇనుప సామాన్ల మీదనూ(ఆయుధాలమీద).. మో చేతుల మీదనూ అందంగా చెక్కించుకొనేదరు..

ఎర్రి పుష్పములు ఇచ్చిన ఆ కొండ గుర్తులతో అర్జున్ సర్కార్ వారి ఆచూకీ కనుగొన ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి డార్క్ వెబ్ గురించి తెలుసుకుని తను కూడా ఆ గ్రూపులో చేరి సైకో గ్యాంగులని అంతమొందించుటకు ప్లాను వేసి ఇద్దరి గొంతులను స్వయంగా కోసి వీడియోలో అప్లోడ్ చేయును (ఇక్కడ లాజిక్కులు వెతకొద్దు. కథ డిమాండ్ చేసింది.. అంతే )

దానితో సైకో హెడ్ నానీ పనితీరుకు మిక్కిలి సంతసించి తమ డెన్ కు స్వాగతం పలికెను. అండర్ కవర్ ఆపరేషన్లో విలన్ డెన్ లోకి ప్రవేశించిన నానీ అక్కడ సొరకాయలు కోయడం క్లైమాక్స్.. ఇదీ కథ. 

ఇక నానీ నటన గురించి చెప్పాల్సి వస్తే మాస్ షేడ్ లో కూడా బాగా సూట్ అయ్యాడు … గతంతో పోలిస్తే బాడీ లాంగ్వేజ్లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ ఇంప్రూవ్ అయ్యాడు.ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు.

సినిమా మొత్తం అర్జున్ సర్కార్ రూపంలో మనకు నానీనే కనపడతాడు… ఎస్..ఈ సినిమాకి ప్లస్ నానీనే.. ఇక హీరోయిన్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు… నానీ తో లవ్ ఎపిసోడ్ బిగినింగ్ బాగుంటుంది.

రావు రమేష్.. సముద్ర ఖని వంటి మంచి నటులను దర్శకుడు సరిగా వాడుకోలేకపోయారు.ఏతావాతా సినిమా బోర్ కొట్టదు కానీ ఆఖర్లో నానీ సొరకాయ కోతలను కథలో భాగంగా జొప్పించవలసి వచ్చిందని ప్రేక్షకులు కొద్దిగా పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకున్న యెడల మిగిలినవన్నీ టేకిట్ ఈజీ అన్నమాట..

ఇక క్లైమాక్స్ లో అడవి శేష్ ఎంట్రీ ఇవ్వడం సినిమాకి కొంచెం బూస్ట్ ఇచ్చింది..కార్తీ హీరోగా ఏసిపి వీరప్పన్ పేరుతో నెక్ట్స్ హిట్ 4 కూడా రాబోతుంది అనే సంకేతాలు ఆఖర్లో కార్తీ ఎంట్రీ ద్వారా చెప్పకనే చెప్పారు నానీ. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!