Gr Maharshi…………………………. Master story teller………………………..
మార్నింగ్ షో పుస్తకం ఎవరికీ అంకితం ఇవ్వలేదు. సినిమాలతో నాతో కలిసి జీవించిన స్నేహితులకి, విజిళ్లు వేయించిన హీరోలకి, ఆలోచనలు నింపిన డైరెక్టర్లకి ఇలా చాలా మంది వున్నారు. అయితే పసితనంలో సినిమాలు చూపించి, వేలు పట్టుకుని ఫాంటసీ ప్రపంచంలోకి నడిపించిన వ్యక్తి ఒకరున్నారు.
ఆమె పేరు లక్ష్మి. నిజానికి ఆమెకే ఈ పుస్తకం అంకితం ఇవ్వాలి. కానీ ఆమె ఎక్కడుందో తెలియదు. వుందో లేదో కూడా తెలియదు. సినిమాల్లోలా ఇది చదివి రామయ్యా అంటూ నా దగ్గరికి రాదు. ఎందుకంటే ఆమెకి చదువు రాదు.
లక్ష్మి మా ఇంట్లో పనికి చేరింది. నా కంటే దాదాపు ఎనిమిదేళ్లు పెద్ద. నేను ఐదేళ్ల పిల్లోడిని. తల్లి లేదు. ఏడు రూపాయల జీతం కోసం తండ్రి నెలనెల వచ్చేవాడు. ఆ రోజంతా బోరున ఏడ్చేది. కర్నాటకలో చెళ్లకెరె దగ్గర ఏదో వూరు. పెద్దగా పని వుండేది కాదు కానీ, ఏదో ఒంటరితనం.ఆమె తనకి తాను ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంది. అది సినిమా.
ఆ రోజుల్లో పాలిథిన్ లేదు. అన్నీ న్యూస్ పేపర్లలో చుట్టి ఇచ్చేవాళ్లు. సినిమా బొమ్మలున్న కాగితాల్ని, పాంప్లెట్లని భద్రంగా జాగ్రత్త చేసేది. అది ఆమె నిధి. ఆ బొమ్మలన్ని నాకు చూపించి కథలు చెప్పేది. మాస్టర్ స్టోరీ టెల్లర్. కథ వింటే సినిమా చూసే అవసరం లేదు. ఆ నిధిని కొట్టేయాలని ప్లాన్ చేసాను కానీ, నిధి రహస్యం అంతు చిక్కలేదు.
భూతాలు, మాంత్రికుల కథలైతే జలలా వూరేవి. కష్టాలొస్తే దుగ్గిలమ్మ (గ్రామ దేవత) తల్లి గుర్రం మీద వచ్చి కాపాడుతుందని చెప్పేది. ఇప్పటికీ మహా అశ్వంపై దుగ్గిలమ్మ ఉగ్ర రూపంతో స్వారీ చేస్తున్నట్టు నాకు కల వస్తుంది.
(దుగ్గిలమ్మ పేరుతో కథ కూడా 20 ఏళ్ల క్రితం రాసాను) లక్ష్మికి ఈ కథలన్ని తల్లి చెప్పేదట. ఆమె వెళ్లిపోయింది. కథలు మిగిలిపోయాయి.సినిమాలంటే భయం పోగొట్టింది లక్ష్మీనే. థియేటర్లో లైట్లు ఆర్పగానే పెద్దపెద్ద కేకలు పెట్టేవాన్ని. భరించలేక ఇంటికి తీసుకొచ్చేవాళ్లు. ఆత్మీయులు అనే సినిమా నుంచి లక్ష్మి విసుక్కుంటూ నన్ను బయటికి లాక్కు రావడం గుర్తు.
సినిమా బొమ్మలు చూపిస్తూ , కథలు చెప్తూ వుంటే మెల్లిగా భయం పోయింది. సినిమాలో మా అవ్వ నన్ను బెంచికి తీసుకెళ్లేది. ఆడవాళ్ల బెంచి వెనుక ఎత్తుగా గ్యాలరీ వుండేది. లక్ష్మిని నేలక్లాసుకి పంపేవాళ్లు. నేను అక్కడే కూచుంటానని ఏడ్చేవాన్ని. నన్ను నేలకి పంపకుండా లక్ష్మినే బెంచికి ప్రమోట్ చేసారు.
ఆమె వున్న రెండు మూడేళ్లు సినిమా కథలు, దెయ్యాల కథలు, మాంత్రికులు, రామ చిలుకలు, మహా రాణులు, ద్వేషం, కుట్ర, అసూయ , రకరకాల కథలు కన్నడ తెలుగు యాసలో జలపాతమయ్యేవి.
మనుషులందరికీ అనివార్యంగా కన్నీళ్లతో నిండిన ఒక రోజు వస్తుంది. లక్ష్మికి పెళ్లి చేయాలని వాళ్ల నాన్న తీసుకెళ్లాడు. వెళ్లొద్దని ఏడ్చాను. ఏడిస్తే ఏదీ మారదు. వెళ్లిపోయింది. మళ్లీ రాలేదు.
ఆ వూరు కూడా మమ్మల్ని వెళ్లిపోమంది. పెరిగి పెద్దయి కథలు, సినిమాల వ్యామోహంలో చిక్కుకున్నపుడు లక్ష్మి గుర్తొచ్చేది. అక్షరాలన్నీ ఆమె తినిపించిన గోరు ముద్దలే కదా. నాకు అక్కలేదు. వుంటే కూడా లక్ష్మి కంటే బాగా చూసుకునేది కాదు.
50 ఏళ్ల తర్వాత ఆమెని వెతకాలనుకున్నాను. లక్ష్మి అనే పేరు తప్ప ఇంకేమి తెలియదు. కర్నాటకలో పల్లె. కొన్ని వందల గ్రామాల్లో కొన్ని వేల లక్ష్మిలుంటారు. ఎలా సాధ్యం. అసాధ్యం.ఆమె కనిపిస్తే లక్ష్మక్కా ఈ పుస్తకంలోని అక్షరాలన్నీ నువ్వే అని చెప్పాలి. కానీ కనపడదు. బతికుంటే 68 ఏళ్లు, పేదరికం అయుష్షు ఇవ్వదు. ఇది వాస్తవం.
లక్ష్మి ఏదో ఒక రోజు కనిపిస్తుంది. ఇక్కడ కాకపోతే ఇంకో లోకంలో. టైటానిక్ ఆఖరి సీన్లో రోజ్ వెళ్లినప్పుడు ఒక సమూహం స్వాగతం చెబుతుంది. వాళ్లెవరూ జీవించి వుండరు. ఈ పుస్తకంలోని మనుషులంతా ఒక రోజు కనిపిస్తారు. కృష్ణ నన్ను గ్యారెంటీగా గుర్రం మీద ఎక్కించుకుంటారు.
మనుషులంతా ఎదురు చూస్తూనే వుంటారు. చలనం కోసమో, స్తబ్ధత కోసమో. జీవితం కోసమో, లేదా మరణం కోసమో!
(ఈ పుస్తకం కావలసిన వారు నవోదయ బుక్ హౌస్ కాచిగూడ, అక్షర బుక్స్ జూబిలీ హిల్స్, విశాలాంధ్ర మధుర నగర్ లో పొందవచ్చు.లేదా 9000226618, నంబర్ కి +916304880031నంబర్ కి గాని rs 450 phone pe చేయండి. పోస్ట్ ఖర్చు పెట్టి పంపుతారు. అడ్రస్ WhatsApp లో పంపండి.)