సినారె … మామనసు దో ‘సినారె” !

Sharing is Caring...

రమణ కొంటికర్ల…………………………………..  

Tribute to great poet ………………………….చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా చెలియా.. సిగ్గు నీకేలా అని ఏకంగా  తెలుగుదనాన్నే పిలుస్తున్నంత భాషాసాధికారిక ప్రేమచిహ్నమయ్యాడు సినారె. ఆదిమదశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలను తన కావ్యంలో ప్రకరణాలుగా పొందుపర్చి విశ్వంభరతో జ్ఞానపీఠుడయ్యాడు సినారె. అజంతా శిల్పులు చెక్కిన శిల్పాలాధారంగా అజంతా సుందరి వంటి గేయ నాటికల సృష్టికి మూలమయ్యాడు సినారె.

ఊరెక్కడో మారుమూల సిరిసిల్ల జిల్లా హనుమాజీపేటైనా… తేనెలొలికిన తన తెలుగు భాషా మకరందంతో దిగంతాలకు పాకిన ఖ్యాతి సినారె. పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డే అయినా… పేరులోనేముందన్న ఆయన తత్వంలాగే సినారెనే ఆయన పేరై ఊరేగింది. చదువంతా ఉర్దూ మాధ్యమంలో సాగినా… ఆ ఊర్దూతోబాటే… ఇంకాస్తెక్కువే.. అమ్మభాషైన తెలుగే సాధికారతైంది. హరికథలు, జంగం కథలు, జానపదాల అమితమైన ప్రభావంతో గడిచిన బాల్యం.. అలా అలా సాహిత్య సరస్వతీ ఒడిలో ఓలలాడిన తెలుగువాడిగా.. అచ్చ తెలంగాణావాడిగా… పద్మభూషణుడయ్యే స్థాయికెదిగిన నిండైన రూపం సినారె.

వగలరాణివి నీవే సొగసుకాడను నేనే అంటూ తెలుగుతో తైతక్కలాడి… తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే అని తెలుగు సాహితీ లోకంలోని విమర్శలకుల ప్రశంలందుకున్న సాహితీశిల్పం సినారె. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకమంటూ మానవ జీవన ప్రస్థానంలోని నాటకాన్ని తన సినీ గేయాల ద్వారా రక్తి కట్టించిన రచనా చిత్రం సినారె.

గ్రాడ్యుయేషన్ వరకూ ఉర్ధూ మాధ్యమమే అయినా… పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రం ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో చేసి.. అదే విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొంది… అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసిన చరిత్ర సినారె ది. అంబేద్కర్, పొట్టిశ్రీరాములు వంటి విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షుడిగా.. నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక మండలి సలహాదారుగా… తన వాగ్ధాటితో చట్టసభనూ మెప్పించిన రాజ్యసభ సభ్యుడిగా… ఇలా ఒక వ్యక్తి ఎన్ని రంగాల్లో ఎంతెత్తు ఎదుగ గలడో చూపించి.. అంతే సంప్రదాయబద్ధంగా జీవించిన అచ్చతెలుగు పంచెకట్టు సినారె.

రంగు, రుచి, వాసన తెలిసిన అనిర్వచనీయమైన ఆల్కెమీ ఏదో కల్గిన శబ్దస్ఫూర్తిగా… విమర్శకులు, కవులతో ప్రశంసలందుకున్న సుకవి సినారె. మనిషి హృదయాంతరాళ్లోని చైతన్య జలపాతాల గల గలను.. విప్లవ జ్వాలల  వేడినీ మేళవిస్తూ… అది పద్యమైనా, గేయమైనా, వచనమైనా తారాసింది బంగారమనిపించిన మనోజ్ఞ రూపం సినారె.

మనసుకు తొడుగు మనిషని… మనిషికి ఉడుపు జగతని… అదే విశ్వంభరా తత్వం.. అదే అనంత జీవిత సత్యమని ప్రభోదించి లాలి లాలి లాలి లాలి అంటూ తాను రాసిన పాటను వింటూ అలా అలా దిగంతాలకు వెళ్లిపోయిన బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె.  మన ప్రాంతం వాడిగా… మనవాడిగా.. తెలుగునేలకు, తెలంగాణాకూ గర్వకారణమైన ఆ కవి భౌతికంగా లేకున్నా… ఆయన రచనలెల్లప్పుడూ మన తీపి గుర్తులే. అందుకే ఆయన కీర్తిశేషులైన ఈరోజున ఆ మహానుభావుడికి.. మనకు తోచిన రీతిలో ఘటిస్తున్న అక్షర శ్రద్ధాంజలిది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!