వద్దంటే అవార్డులు !

Sharing is Caring...

An incomparable actress…………………………………….

శారద పోషించిన పాత్రలు కన్నీరు పెట్టిస్తాయా ? అవార్డులు,రివార్డులు, సన్మానాలు ,సత్కారాలు ఆమె ను వరించి వచ్చేవా ? అంటే అవుననే చెప్పుకోవాలి. శారద  తెలుగు నటి అయినప్పటికీ తన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది.  మలయాళ  ప్రేక్షకులు శారదను బాగా ఆదరించారు. నటిగా చక్కని గుర్తింపు పొందారు. దీంతో కెరీర్ టాప్ రేంజ్ లోకి వెళ్ళింది. శకుంతల, మురప్పెన్ను, కట్టు తులసి, ఇనప్రవులు వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

వివిధ చిత్రాలలో ఆమె నటనకు గానూ  జాతీయ గౌరవ పురస్కారం  లభించింది.అప్పట్లో జాతీయ పురస్కారం లభించడం అంటే మాటలు కాదు.1969లోకూడా   తులాభారంలో శారద నటనకు  ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ సినిమా నే ‘మనుష్యులు మారాలి ‘పేరిట తెలుగులో తీశారు. తెలుగు లో కూడా  హిట్ అయింది. ఈ సినిమాలో శారద నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.

భర్త హత్యకు గురై .. ఫ్యాక్టరీ మూతపడిన నేపథ్యంలో పిల్లలు భిక్షాటన చేస్తుంటారు. ఇది సహించలేని శారద పాత్ర పిల్లలకు విషం పెట్టి .. తాను తింటుంది. పిల్లలు చనిపోతారు. ఆమె బతుకుతుంది. చట్టం ఆమెను హంతకురాలు అంటుంది.ఇందులో శోభన్ బాబు హీరో.

ఇక 1972 లో విడుదలైన  స్వయంవరం మలయాళ  చిత్రంలో  ..1978 లో విడుదలైన  నిమజ్జనం తెలుగు సినిమాలో అనితరసాధ్యంగా నటించినందుకు గాను మరో 2 సార్లు జాతీయ అవార్డులను గెలుచుకుంది. అలాగే ఒకసారి ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకున్నారు. నిమజ్జనం సినిమాలో  సనాతన బ్రాహ్మణ స్త్రీ భారతి పాత్రలో శారద అద్భుతంగా నటించింది.

చనిపోయిన మామగారి అస్థికలను నిమజ్జనం చేసేందుకు భర్త శ్రీకాంత్‌తో పాటు బండిలో కాశీకి వెళుతుంది. అక్కడ భారతిని చూసి మోహపరవశుడైన బండివాడు ఆమెను బలాత్కారం చేస్తాడు. తన పవిత్రతను కోల్పోయిన భారతి గంగానదిలో ఆత్మార్పణం చేసుకుంటుంది.ఈ పాత్రలో శారద తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బీఎస్ నారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

శారద  తెలుగు సినిమాల్లో కథానాయిక పాత్రల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ప్రముఖ దర్శకులు కే విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందిన శారద చిత్రం లో మతి స్థిమితం లేని మహిళ గా నిరుపమాన నటనను ప్రదర్శించింది. అలాగే మరో అగ్ర దర్శకుడు బాపు డైరెక్షన్ లో కలియుగ రావణాసురుడు చిత్రం లో, దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన బలి పీఠం, అమ్మరాజీనామా చిత్రాల్లో తనదైన శైలిలో నటించారు.

ఇక  రాఘవేంద్ర రావు డైరెక్షన్లో  మేజర్ చంద్ర కాంత్ లో కూడా మంచి పాత్రలో నటించి శభాష్ అనిపించుకున్నారు. తెలుగు పరిశ్రమలో ఒక దశలో శారద మాత్రమే నటించగల పాత్రల్ని రచయితలు సృష్టించారు.ప్రతిధ్వని,అనసూయమ్మ గారి అల్లుడు, ప్రజాస్వామ్యం వంటి సినిమాలు ఆ కోవలోనివే. ఇలాంటి కథలతో నిర్మాత దర్శకులు ఆమె ఇంటి ముందు క్యూ కట్టిన రోజులున్నాయి.

అందరి హీరోలతో నటించిన ఖ్యాతి కూడా శారదదే. శారదా సూపర్ స్టార్ కృష్ణ తో ప‌దుల సంఖ్య‌లో హీరోయిన్‌గా చేసింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కృష్ణ ప‌క్క‌న అగ్ని కెరటాలు, అగ్ని పర్వతం వంటి మూవీల్లో త‌ల్లిగా చేసింది. 1993 తర్వాత, ఆమె ఎంపిక చేసుకుని కొన్ని సినిమాలు మాత్రమే చేసింది.

శారద ప్రముఖ తెలుగు హీరో, నిర్మాత,  హాస్యనటుడు చలంను వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత శారద చలం నుంచి విడాకులు తీసుకున్నారు.ఆమె వైవాహిక జీవితం ఎందుకో సఫలం కాలేదు.

అరవై ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో  ఎన్నో సినిమాలు చేసింది. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా, రెండు సార్లు ఫిలిం ఫేర్‌ అవార్డుల విజేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు స్వీకర్తగా… చరిత్ర సృష్టించింది. అన్నట్టు 1996లో  తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి లోకసభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. 

1998 ఎన్నికల్లో అదే తెనాలి స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్ చేతిలో ఓడిపోయారు. 1999 లో నెల్లూరు జిల్లా వేంకటగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి … కాంగ్రెస్ అభ్యర్థి నేదురుమల్లి రాజ్యలక్ష్మి చేతిలో ఓటమి చవి చూసారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైనారు. 2009 లో శారద కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కానీ అంత చురుగ్గా పనిచేయలేదు.

శారద లోటస్ చాక్లెట్ పేరిట ఒక కంపెనీ కూడా స్థాపించారు. ఆ వ్యాపారం కూడా కలసి రాలేదు. దాంతో ఆ కంపెనీని వేరొకరికి అమ్మేసారు. ప్రస్తుతం చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అదండీ శారద కథ.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!