వర్గీస్ కురియన్ తో ఒక రోజు !

Sharing is Caring...
Taadi Prakash ……………………………………….. 

The Father of Indian White Revolution……….

అర్థరాత్రి… హైవే… చీకటినీ, చినుకుల్నీ చీల్చుకుంటూ బస్సు దూసుకుపోతోంది.గుజరాత్ వెళ్తున్నాం మేమంతా. అది 1985 చివరిలో. విజయవాడ ‘ఉదయం’ దిన పత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ని నేను. మరో 40 మంది విజయవాడ పత్రికా విలేకరులు. ఖేడా జిల్లాలోని ఆనంద్ అనే చిన్నపట్టణానికి వెళుతున్నాం. అక్కడ అమూల్ పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీని చూడటం, వర్గీస్ కురియన్ని కలవడం! రెండు ముఖ్యమైన పనులు.

Milk man of Indiaగా పేరుగాంచి, దేశానికి రోల్ మోడల్ గా వెలిగిపోతున్న కురియన్ పేరు బాగా విన్నదే. ఇందిరాగాంధీకి మిత్రుడు. పాల కొరతతో కొట్టుమిట్టాడుతున్న ఇండియాని, పాల ఉత్పత్తిలో ప్రపంచ నెంబర్ వన్ గా వొంటి చేత్తో నిలబెట్టిన హీరో కురియన్. కేరళ (కొయికోడ్)లో పుట్టాడు.అమెరికాలో చదువుతో రాణించాడు. అసలు ఆనంద్ లో పాల సంఘం పెట్టిన వాడు సర్దార్ పటేల్ అనుచరుడు త్రిభువన్ దాస్ పటేల్. అమూల్వ్య వస్థాపకుడు, ఛైర్మన్ ఆయనే. త్రిభువన్ దాస్ దగ్గర మొదట జనరల్ మేనేజర్ గా జాయినయ్యాడు కురియన్. మార్కెటింగ్ వ్యూహంలో దిట్ట. మనిషి ఎంత ఎగ్రసివ్ గా వుంటాడో అంత ప్రోగ్రెసివ్.

ఆనంద్ చుట్టు పక్కల అంతా పశు సంపదతో అలరారే ప్రాంతం. గతంలో రైతులు పాలని అతి తక్కువ ధరకి అమ్ముకునేవాళ్లు. షావుకార్లు, బ్రోకర్లూ లాభపడితే, రైతులు నష్ట పోయేవాళ్లు. దగ్గర్లోని బొంబాయి మహా నగరానికి ఎన్ని లక్షల లీటర్ల పాలయినా చాలవు. కురియన్ చేసిందీ వ్యాపారమే అయినా రైతులకు మంచి ధర యిచ్చాడు. లక్షలాది మంది రైతులు అమూల్ కి పాలు మాత్రమే అమ్మారు. నిజంగా వాళ్ల నెత్తిన పాలు పోసినవాడు కురియన్. ఆ పేద రైతుల యిళ్ల గుమ్మాల మీద వెయ్యి కాంతుల ఆశల దీపాలుగా వెలిగినవాడు కురియన్. రైతులందర్నీ కంపెనీలో భాగస్వాముల్ని చేశాడు.

అమూల్ అంటే అమూల్యమైనదని మాత్రమే కాదు. Anand Milk Union Limited అని! వెన్న, చీజ్, ఐస్ క్రీమ్, చాక్లెట్లు, స్వీట్లు… ఇలా ఉత్పత్తుల్ని పెంచాడు. కళ్లు చెదిరే మార్కెటింగ్ తో బొంబాయి నగరాన్ని జయించాడు. క్రమంగా ఇండియాని అమూల్ ఉత్పత్తులతో ముంచెత్తాడు. విదేశాల్లో విస్తృతంగా అమ్మి అమూల్ ని ఇంటర్నేషనల్ బ్రాండ్ గా నిలబెట్టాడు. అంత వరకూ ఆవు పాలతో మాత్రమే పొడి చేసే వారు. భారీగా మిగులుతున్న గేదె పాలతో పొడి తయారు చేసి చరిత్ర సృష్టించాడు. లాభాల్ని కోట్లలో పెంచాడు. ఆరోజుల్లోనే- హైక్లాస్ బాంబే యాడ్ ఏజన్సీ వాళ్లను పిలిచి నేషనల్ కేంపెయిన్ ప్లాన్ చేయించాడు.

Amul- Utterly butterly delicious అనే స్లోగన్ ని coin చేసింది వాళ్లే. చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు అంటే పిల్లల్ని ఆకర్షించాలి. పోనీ టెయిల్ వేసుకున్న చుక్కల గౌను పాపబొమ్మని యాడ్ ఏజన్సీవాళ్లు చూపించారు. ‘ఓ యస్’ అన్నాడు కురియన్! చిన్న పన్ తో వెటకారంతో, నవ్వించే కేప్షన్ తో ఆ పాప బొమ్మ… అమూల్ నే కొనండి. అమూల్నే తినండి.. అంటుంది ఆ పాప. ఖరీదైన నేషనల్ యాడ్ కేంపెయిన్ జనాలకి నచ్చింది.

ఆ పాప Amul Icon అయిపోయింది. 50 ఏళ్ల తర్వాత యిప్పటికీ అమూల్ యాడ్స్ లో ఆ పాపే వుంటుంది, రకరకాల గౌన్లతో… క్రీడలూ, ప్రపంచ రాజకీయాలు, ప్రధాన సంఘటనలు అన్నింటినీ రుచి కోసం అమూల్ యాడ్స్ లో చాలా apt గా వాడతారు.కురియన్ విజయాల్ని ఆపరేషన్ ఫ్లడ్ అన్నారు మురిపెంగా. పాలవెల్లువ అన్నారు తెలుగు జర్నలిస్టులు. కురియన్ గడుసుతనాన్నీ, దురుసుతనాన్నీ చూసిన వాళ్లు ఆయన్ని ‘‘పాలల్లో ఈత కొట్టే మొసలి’’ అన్నారు.

స్మితా పాటిల్ తో మంథన్ (churning):
కురియన్ ఓ రోజు శ్యాంబెనగల్ కి ఫోన్ చేశాడు. అప్పటికి చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ చేసుకుని బతుకు బండి లాగిస్తున్నాడు బెనగళ్. ‘‘ఆనంద్ లో అమూల్ విజయమ్మీద సినిమా తీద్దాం… పొదుపుగా సుమా’’ అన్నాడు. లెక్కలేసి పది పన్నెండు లక్షలు అవుతుందన్నాడు శ్యామ్. మిల్క్ కోపరేటివ్ సభ్యులైన అయిదు లక్షల మంది రైతుల నుంచి రెండేసి రూపాయలు సేకరించి శ్యాం బెనగల్ కి యిచ్చాడు. రైతులంతా ఈ చిత్ర నిర్మాతలే అని ప్రకటించాడు కురియన్. ఆ రకంగా ‘మంథన్’ భారతీయ వెండి తెర మీద తొలి ఒరిజినల్ క్రౌడ్ ఫండ్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది.

1975లో స్మితాపాటిల్, నసీరుద్ధీన్ షా, అమ్రిష్ పురి, గిరీష్ కర్నాడ్, అనంత్ నాగ్, కుల్ భూషణ్ కర్బందాలతో తీసిన ఈ సినిమా 1976లో విడుదలైంది. ఒకలెజెండ్ విజయ్ టెండూల్కర్ స్క్రీన్ ప్లే, మహాకవి కైఫీ అజ్మీ మాటలు, వనరాజ్ భాటియా సంగీతం, గోవింద్ నిహలానీ ఫొటోగ్రఫీతో మహాశిల్పి శ్యాం బెనగల్ చెక్కిన పాలరాతి శిల్పం- మంథన్. పేద రైతులు, దళితుల్ని స్థానిక, ధనిక పెత్తందార్ల వేధింపులు, దోపిడీ నుంచి రక్షించి ‘పాల వెల్లువ’కు అడ్డు తొలగించడమే కథ. ‘మంథన్’ ఆ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే- నేషనల్ అవార్డులు గెలుచుకుంది. మథన్, అంకుర్,నిశాంత్… శ్యాం బెనగల్ సినిమాలన్నీ రెండేసి మూడేసి సార్లు చూసి వున్నాను. వాటిని విజువల్ గా అప్పజెప్పగలను కూడా..!

ప్రయాణంతో అలసిపోయి ఆనంద్ లో బస్సు దిగాం. అదో గొప్ప యూనివర్శిటీ కేంపస్ లా వుంది. అన్ని సౌకర్యాలతో బోలెడన్ని గెస్ట్ హౌస్ లు .. చుట్టూ పలకరిస్తున్న పచ్చదనం, తారు రోడ్లు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఫర్ ఫెక్ట్ గా. మూడు రోజులున్నాం. ఒక రోజు గ్రామాల్లో తిప్పారు. రైతుల వ్యవసాయ క్షేత్రాలు, పశువులకు పచ్చగడ్డీ, మంచి దాణా వేయడం, పోషణ పరిశుభ్రతలు, గ్రామీణ రైతుల శ్రద్ధ.. యివన్నీ చూశాం.

రెండోరోజు అమూల్ మెగా ఫ్యాక్టరీలోకి అడుగుపెట్టాం. కళ్లు తిరిగి కింద పడబోతే ఐస్ క్రీమ్ యిచ్చి నిలబెట్టారు. అంతంత భారీ మెషీన్లనీ, వాటి ఆపరేషన్నిచూడటం గొప్ప అనుభవం.వెయ్యి మందికి పైగా కార్మికులు, మార్కెటింగ్ సిబ్బందీ వున్నారు. మొత్తం మెకనైజ్డ్ సిస్టం. సాయింత్రం చదూకోడానికి అమూల్, కురియన్ గురించిన పుస్తకాలు, బ్రోచర్లు యిచ్చారు. చివరి రోజు కురియన్ తో ప్రెస్ కాన్ఫరెన్స్.
నా బాణం గురితప్పలేదు!
అందరం ప్రెస్ మీట్ హాల్ కి వెళ్లాం. కనీసం 150 మంది అటూ ఇటూ కూర్చునే వీలున్న పొడవాటి టేబుల్. విశాలమైన హాలు. కొన్ని పేయింటింగులు. ఓ పక్క పెద్ద స్క్రీన్ మీద కురియన్ విజయాలన్నీ చూస్తున్నాం. ఇంత భారీ విజువల్ బిల్డప్ తర్వాత, అరగంట నిరీక్షించాక, పెద్ద పెద్ద అంగలతో గబగబా వచ్చాడు కురియన్. కుర్చీలో కూర్చోగానే ఉపన్యాసం మొదలు. దేశం, ప్రజలు, ప్రజాస్వామ్యం, అభివృద్ధి, విలువలు అంటూ ధర్మోపన్యాసం దంచి కొట్టాడు. జర్నలిస్టుల దగ్గర అలాంటి ‘అతి’ చేయకూడదు. కనీసం ఆయన గుజరాత్ సీఎం కూడా కాదు. అది నాకు నచ్చలేదు.

“Ok. Shoot me questions” అన్నాడు. పాలలో కొవ్వు శాతం, ఉత్పత్తి, లాభాలు, అమ్మకాలు అని విలేకరులు అడుగుతుంటే, ఇంగ్లీషులో గుక్క తిప్పుకోకుండా కురియన్ వివరాలు గుప్పిస్తున్నాడు. ఆయన్ని ఆపడం కష్టం. ఏదన్నా ప్రశ్న అడగాలి…ఏం అడగాలి? విజయవాడ నుంచి యింత దూరం వచ్చాం. ఒక్క ప్రశ్నయినా అడక్కపోతే ఎలా? అడిగానే అనుకో… ఆయన అమెరికన్ ఇంగ్లీషులో ఎదురు ప్రశ్న వేస్తే తట్టుకోవడం ఎలా? ఆయన మెగా ఈగో తెలుస్తూనే వుంది. ఐనా వీడికో దెబ్బ వెయ్యాల్సిందే అనిపించింది.గింజుకుంటున్నాను.చాలాసేపయింది.

పత్రికా సమావేశం ముగిసిపోబోతున్నది.నా దగ్గరున్న బ్రోచర్ తిరగేస్తే, కురియన్ కి 64 ఏళ్లు నిండబోతున్నాయి. 65లోకి రానున్నాడు. తెగించి, “one question” అన్నాను. కురియన్ కి బాగా దగ్గర్లోనే కూర్చుని వున్నాను. చెప్పు అన్నట్లు నావైపు చూశాడు. “don’t you think it’s time to retire sir?” అన్నాను. నన్ను అలా గుచ్చి చూస్తూనే వున్నాడు. నిశ్శబ్దం. లేచి వచ్చి తన్నడు కదా అనుకున్నా.

ఆయన కళ్లలో నీళ్లు నిండుతున్నాయి. కురియన్ ఏడుస్తున్నాడు. చెంపల మీంచి నీళ్లు. ఆయన కోటు మీద కన్నీళ్లు టపటపా రాల్తున్నాయి. అందరం ఒక దిగ్భ్రమతో చూస్తున్నాం. ఒక నిమిషం దాటింది. జేబులోంచి కర్చీఫ్ తీశాడు.కన్నీళ్లు తుడుచుకున్నాడు. కదిలిపోయిన మనిషి తేరుకున్నాడు.

“yes, I will quit this chair right now, but show me another Kurian! Yes, I want to retire tomorrow,give me one more Vargheese Kurian! Yes, show mw another Kurian!” అని గట్టిగా ఉద్వేగంతో అన్నారాయన. ప్రెస్ మీట్ ముగిసింది ఉద్రిక్తంగా. నిజమైన జనం కోసం పని చేసి, సోషలిస్టు తరహా విధానం అంటే ఏమిటో చూపించిన ఒక ఆదర్శమూర్తిని హర్ట్ చేసాను … ఒక్క వాక్యంతో!

sunrise and surprise in surat: తిరుగు ప్రయాణం. రాత్రి లేటుగా బయల్దేరి ఉదయానికల్లా సూరత్ చేరుకున్నాం. ఇంగ్లీషు పత్రికల విలేకరులు పోస్టాఫీసులకీ, ఎస్టీడీ బూత్ లకి వెళ్లి అమూల్ వార్తలు పంపుతున్నారు. ఉదయం దిన పత్రికకి యిది అర్జెంటు వార్త కాదు. వెళ్లాక తీరిగ్గా రాయొచ్చు. చాయ్ తాగుదామని వెళ్తూ  పాన్ షాపులో టైమ్స్ ఆఫ్ ఇండియా కొన్నాను.

మొదటి పేజీలో ప్రముఖంగా ఒక బాక్సు అయిటం. ‘‘వల వలా ఏడ్చిన కురియన్’’ అనే హెడ్డింగ్ తో. ఒక యువ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు కురియన్ పత్రికా సమావేశంలో ఏడ్చారని వివరంగా రాశారు. నా ప్రశ్న ఫలించినందుకు ఆనందించాను. ఆనంద్ లో యిచ్చిన స్వీట్లు బస్సులో మిత్రులకు పంచాను. తిన్నగా, తియ్యగా విజయవాడ చేరుకున్నాం.

A true indian people’s hero: 1921 నవంబరు 26న కేరళలోని ఒక సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు కురియన్. పాతకాలం మనుషులకు కొన్ని భేషజాలు, పట్టింపులు వుండటం సహజం. రామన్ మెగసేసే, పద్మవిభూషణ్ అవార్డులు పొందినవాడు కురియన్. ప్రతి భారత ప్రధానమంత్రీ ఆనంద్ వెళ్లి అమూల్ ను చూశారు. మనస్ఫూర్తిగా కురియన్ని అభినందించారు. 2005 దాకా, అమూల్ ని ఆకాశమార్గాన నడిపించినవాడూ, విజయగర్జన చేసినవాడూ .. వర్ఘీస్ కురియన్ ఒక్కడే.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!