పోలీసులకు చుక్కలు చూపించిన సామాన్యుడు !

Sharing is Caring...

పై ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు అరుణ్ సావంత్. మహారాష్ట్ర లోని బద్లాపూర్ లో నివసిస్తున్నారు . ఆర్టీఐ కార్యకర్తగా గుర్తింపు పొందారు. పోలీస్ శాఖ అధికారులను కోర్టుకు లాగి రూ.10 ల‌క్షల నష్టపరిహారం వసూలు చేశారు. అరుణ్  సమాజంలో ఏదైనా అవినీతి, అన్యాయం జ‌రిగిందంటే చాలు స‌మాచార హక్కు చ‌ట్టం ద్వారా స‌మాచారం సేక‌రించి నిజాలు బయట పెట్టేవాడు.

ఈ క్ర‌మంలో 2010లో తాను నివసించే ప్రాంతంలో  ఉన్న ప‌లువురు నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధుల గురించి ఓ ప‌ని నిమిత్త‌మై కొంత స‌మాచారం కావాల‌ని స్థానిక ఆర్‌టీఐ అధికారుల‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాడు.

కాగా ఈ ద‌ర‌ఖాస్తు విష‌యం తెలిస్తే ఆ నాయ‌కులు త‌న‌పై దాడి చేయించ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో అత‌ను ముందుగానే త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ పోలీసుల‌ను లేఖ ద్వారా కోరాడు. కానీ ఆ పోలీసులు అరుణ్ సావంత్ మాట‌ల‌ను సీరియస్ గా తీసుకోలేదు. అత‌నికి ఎలాంటి ర‌క్ష‌ణా క‌ల్పించ‌లేదు.

ఈ నేపథ్యంలోనే అరుణ్ ఊహించిన  విధంగానే కొంత మంది దుండ‌గులు అత‌నిపై తుపాకీల‌తో కాల్పులు జ‌రిపారు. బద్లాపూర్ రహ‌దారిపై వెళ్తున్న అత‌న్ని మోటార్ సైకిళ్లపై వచ్చి అట‌కాయించి కాల్పులు జ‌రిపారు. దీంతో అరుణ్ వెన్నెముక‌కు బుల్లెట్స్ తగిలి తీవ్ర గాయాలైనాయి. వెన్నెముక బాగా దెబ్బ‌తిని.. ఆ కార‌ణంగా అరుణ్ కి ప‌క్ష‌వాతం కూడా వ‌చ్చింది.

అయితే అరుణ్ సావంత్ ఎలాగైనా పోలీసుల‌కు బుద్ధి చెప్పాల‌నుకున్నాడు. రెండేళ్ల తర్వాత కొంచెం కోలుకున్నాక మానవ హక్కుల కమీషన్ లో పిటీషన్ దాఖలు చేసాడు. ఆర్‌టీఐ ద‌ర‌ఖాస్తు కార‌ణంగా త‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని ముందే చెప్పినా పోలీసులు త‌న‌కు ఎలాంటి ర‌క్ష‌ణా క‌ల్పించ‌లేద‌ని ఫిర్యాదు చేసాడు. దుండ‌గులు దాడి చేసిన‌ప్పుడు  తీవ్ర‌గాయాలై బాగా న‌ష్ట‌పోయాన‌ని .. అందుకు గాను త‌గిన ప‌రిహారం ఇప్పించాల‌ని అభ్యర్ధించాడు. అవసరమైన డాక్యుమెంట్లు అన్ని పిటీషన్ తో జతపరిచారు. 

క‌మిష‌న్ పిటీషన్ ను  స్వీక‌రించి విచార‌ణ చేప‌ట్టింది. అలా ఆ కేసు విచారణ దాదాపు 5 ఏళ్ల పాటు కొన‌సాగింది. విచారణ సందర్భంగా అరుణ్ సావంత్ బ్లాక్ మైలర్ అని, ఆర్టీఐ సమాచారాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని పోలీసులు ఆరోపించారు. అయితే అందుకు తగిన సాక్ష్యాలు చూపలేకపోయారు.ఎన్నో వాయిదాల తర్వాత ఎట్ట‌కేల‌కు న్యాయ‌మూర్తి ఎస్ఆర్ బ‌న్నూర్‌మ‌త్ అరుణ్ సావంత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు.

పోలీసుల నిర్ల‌క్ష్యం కారణం గానే ఆ ఘటన జ‌రిగిందని, బాధితుడికి జ‌రిగిన న‌ష్టానికి గాను పోలీసు శాఖ అరుణ్ కి రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దును పరిహారం గా చెల్లించాల‌ని తీర్పు ఇచ్చారు. ఇక తప్పని పరిస్థితిలో మ‌హారాష్ట్ర థానే పోలీస్ సీనియ‌ర్ అధికారి ఒక‌రు అరుణ్ సావంత్‌కు 2017 లో రూ.10 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. అరుణ్ సావంత్ ధైర్యంతో పోరాడి ఆర్టీఐ ఉద్యమ కారులకు  స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!