ఆశ్చర్యంగా ఉంది కదా? అవును కాని ఇది నిజం. ప్రభుత్వం వ్యాపారం చేయడం ఏమిటి? అది చేయాల్సిన పని కాదు కదా. కానీ చేస్తున్నది.లాభ నష్టాలతో ముడిపెట్టి ప్రజా రవాణాను కుదించడం, ప్రయాణ అవకాశాలను తగ్గించడం అది కూడా ప్రభుత్వ రంగంలోని రైలు రవాణాలో. భారత్ లాంటి వర్ధమాన దేశంలో ప్రజలకున్న చవక రవాణా సాధనం రైలు మాత్రమే.పొట్ట చేత బట్టుకొని కూలీనాలీ పనులకు,ఉద్యోగాలకు వెళ్లేందుకు ఉపకరిస్తూ, సహకరించే సాధనం రైలు మాత్రమే.అలాంటి రైలు ను పేద,మధ్య తరగతి వర్గాలకు దూరం చేసే చర్యల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే 72 రైలు సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ 72 రైలు మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందని,ఫలితంగా రైల్వే/ ప్రభుత్వానికి నష్టాలొస్తున్నాయని చెబుతూ రద్దు నిర్ణయం తీసుకుందట!
ఆశ్చర్యంగా లేదు? పేదలు,మధ్య తరగతి వర్గాల జీవన పోరాటానికి నిత్యం ఉపకరించి వారి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లేలా చేస్తూ వారి ఆకలిని తీర్చితున్న అతి కీలక రవాణా సాధనం రైలు మాత్రమే అన్న వాస్తవం ప్రభుత్వానికి తెలియని సంగతేమీ కాదు. కానీ ఈ వాస్తవంతో సర్కారు వారికి పనిలేదు.వారి కడుపు కాలితే ఏమిటి?ఆకలితో అలమటిస్తే మాకేమిటి అన్న ధోరణి లో నిర్ణయాలు చేసేస్తున్నారు.వేగంగా అమలు కూడా చేసి పారేస్తున్నారు. రైల్వే మంత్రిగా లాలూప్రసాద్ యాదవ్ ఉన్నపుడు ప్రతి రైలుకి నాలుగు జనరల్ బోగీలు ఉండేవి. మధ్య తరగతి ప్రజల ఇక్కట్లను గమనించి 4 బోగీలను 6 భోగీలకు లాలూ పెంచారు . అందుకోసం ఒక చట్టం కూడా చేసారు. కొన్నాళ్ళు ఆ చట్టం అమలు అయింది. తర్వాత బోగీల సంఖ్య మళ్ళీ తగ్గింది. నాలుగు జనరల్ భోగీలనే తగిలిస్తున్నారు. ఒక్కోసారి మూడే తగిలిస్తున్నారు. జనరల్ భోగీలకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికి తెల్సిందే. ఆ డిమాండ్ ను అధికారులు .. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కాగా మరోవైపు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి 109 రైల్వే మార్గాలను కూడా గుర్తించారు. ఇవన్నీ అత్యధిక ఆదాయం సమకూర్చే మార్గాలే. ఇవి కానీ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళితే రైల్వే శాఖ ప్రధాన ఆదాయం లో కొంత భాగాన్ని కోల్పోతుంది . కాగా తొలుత 5 శాతం రైళ్లు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఆమేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మౌలిక సదుపాయాలు ,రవాణా, వ్యాపార రంగాల్లో అనుభవం ఉన్న బడా కార్పొరేట్ సంస్థలైన ఆదానీ ,టాటా రియాలిటీ తదితర సంస్థలురైళ్లను నడిపేందుకు ముందుకొచ్చాయి. వీరిలో కొందరిని ఎంపిక చేసి 2023 నాటికి వారికి పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి. మొత్తం మీద త్వరలో ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కుతాయి.
లాభనష్టాలతో సంబంధాలు లేకుండా ఒక సామాజిక బాధ్యతతో ప్రభుత్వాలు ప్రజారవాణా వ్యవస్థను నిర్వహించాలన్న రాజ్యాంగ నిర్మాతల సూచనలను మన నేతలు పట్టించుకోవడం మానేశారు. మీరెలా తగలబడితే మాకేమిటి అన్న ధోరణిలో పాలన సాగుతుంటే బుద్ధిజీవులు ప్రేక్షక పాత్ర వహించడం,ప్రతిపక్షాలు క్రియాశూన్యంగా మిగిలిపోవడం విషాదం.ఇక పేదల రవాణా ను అటకెక్కించి లక్షల కోట్లతో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది మన ప్రజా ప్రభుత్వం.
బొంబాయి-అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ రైలు మార్గం ఖర్చు ఒక లక్ష కోట్లు.ఈ రైల్లో కనీస ప్రయాణానికి మూడు వేల రూపాయలు ఖరీదు.ఇంత ఖరీదైన ప్రయాణం,అంటే ఈ రైళ్లలో ప్రయాణిoచే వారెవరో,ఏ వర్గమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఇవి మన ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యాలు కావడం శోచనీయం.
———– Goverdhan Gande