ఆయన విలనీయే వేరు కదా !

Sharing is Caring...

 

Bharadwaja Rangavajhala ………………

Famous for villain characters…………………………………. 

రాజనాల కాళేశ్పర్రావు అని … ఓ భారీ విలనుడు ఉండేవాడు కదా … టాలీవుడ్డులో … ఈ అబ్బాయి గురించి ఓ సారి రావికొండలరావుగారు నాతో చెప్పిన విషయాలు మీకు చెప్తా …. వీరాభిమన్యు సినిమాలో రావికొండలరావుగారు ద్రోణాచార్యుడి వేషం వేశారు.  రాజనాల దుర్యోధనుడు పాత్ర వేశారు.

ఓ సన్నివేశంలో గురువు ద్రోణుడి కాళ్లు శిష్యుడు దుర్యోధనుడు కడగాలి.  అప్పుడు రాజనాల నేరుగా రావి కొండలరావుగారి దగ్గరకు వచ్చి …ఏమయ్యా కొండల్రావూ … చివరకి నీ కాళ్లు కడగాల్సిన పరిస్థితి వచ్చింది అనేశారట.

కొండలరావుగారు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారట.అసలు ఈ సీనును డూపుతో మేనేజ్ చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన యూనిట్ వాళ్లతో చేశారట రాజనాల … విషయం దర్శకుడు వి. మధుసూదనరావుగారి దగ్గరకు పోయింది.

అదేంటి సీను లో రైటర్ ఏం రాశాడు … కాళ్లు కడిగి ఈ నీరు నెత్తిన జల్లుకోమని కదా …. అలాగే సీను ఉంటుంది.అందులో ఏ మార్పూ ఉండదు… ఒక వేళ ఆయనకి ఇబ్బంది అయితే …. ఇంకో దుర్యోధనుడ్ని చూసుకుందాం … అనేశారట.

దీంతో … రాజనాలగారు దారిలోకి వచ్చేసి సీను చేసేశారట … మరి అంతటి రాజనాలగారున్నూ … తర్వాత రోజుల్లో వేషాలు లేక ఉన్నదంతా అనేక విధాల కరిగిపోగా …రకరకాల ఇబ్బందులతో … ఉన్న రోజుల్లో … అదే రావి కొండలరావు గారి దగ్గరకు వచ్చి …ఏవైనా వేషాలుంటే చెప్పండీ చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని గోల చేస్తుంటే ……..ఓ సినిమాలో ముసలి తల్లిదండ్రుల పాత్రలకు రావికొండలరావుగారినీ , రాధాకుమారిగారినీ బుక్ చేశారట.

రాజనాల బాధ విని .. అందులో ఆ భర్త పాత్ర రాజనాలకు ఇవ్వండని తను ఆ సినిమా నుంచీ తప్పుకున్నారట … కొండల్రావు గారు.వేషం దొరికిన తర్వాత రాజనాల లోని ఒరిజినల్ నటుడు బయటకు వచ్చేశాడట పాపం ..సీన్ ఎలా తీయాలి అని దర్శకుడికి క్లాసు చెప్పడం లాంటి కార్యక్రమాలు మొదలెట్టేశాడట ..దీంతో ఆ చిత్ర నిర్మాత దర్శకులు కొండలరావుగారికి ఫోన్ చేసి ఏమిటి మాస్టారూ మీరు ఈయన్ని తగిలించారూ అని తలపట్టుకున్నారట.

మీరు మాట్లాడండీ అంటే … అబ్బే ఆయన పెద్ద నటుడు … ఆయనకి నేనెలా చెప్తానూ … ఈ రెండ్రోజులూ అలా భరించేయడమే అన్నారట ఈయన. ఇలా ఉంటుందయ్యా వరస అని ముగించారు కొండలరావుగారు … ఆ రాజనాలకు తొలిసారి అవకాశం ఇచ్చిన హెచ్.ఎమ్ .రెడ్డిగారు తీయించిన మేకప్ స్టిల్ … ఇక్కడ తగిలిస్తున్నాను. 

అదలా ఉంటే…….. పాతతరం సినిమాల్లో విలన్ అంటే రాజనాల మాత్రమే గుర్తుకొచ్చేవారంటే ఆశ్చర్యం లేదు. విలన్ పాత్రలకు రాజనాల ప్రాణప్రతిష్ట చేసేవారు. న‌ట‌న‌లో అంత క్రూర‌త్వాన్ని రాజనాల చూపేవారు. రాజనాల సినిమాల్లో మాదిరి  బయట కూడా అలాగే ఉంటారని అనుకునేవారట.

దీంతో ఎక్కడికెళ్లినా మహిళలు రాజనాలను చూసి పరుగెత్తేవారట. ఇలాంటి సంఘటన ఒకటి 1968 లో జరిగింది. ‘వ‌ర‌క‌ట్నం’ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు హీరోయిన్ కృష్ణకుమారి వద్దకు మహిళలు వచ్చి మాట్లాడుతున్నారట. అదే సమయంలో రాజనాల అటుగా నడుచుకుంటూ వెళ్లారు.

ఆయన్ని చూసిన మహిళలందరూ ‘అమ్మో రాజ‌నాల‌’ అనుకుంటూ దూరంగా పరుగు తీశారట. వారి అమాయ‌క‌త్వాన్ని చూసి రాజ‌నాల‌, కృష్ణకుమారి న‌వ్వుకున్నారు. ‘చూశావా కృష్ణా.. విల‌న్ వేషాలు నటులు బ‌య‌ట కూడా అలాగే  ఉంటారని అనుకుంటున్నారు. ‘అని వాపోయారట రాజనాల.   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!