పోఖ్రాన్ అణు ప్రయోగాలకు అమెరికా అడ్డుపడిందా ?

Sharing is Caring...

Nuclear Tests………………………………………….

నాడు అణుపరీక్షల నిర్వహణలో అమెరికా మనకు అడుగడుగునా అడ్డుపడింది. అంతకు ముందు రాకెట్ పరిజ్ఙానాన్ని మనకు అందకుండా నానా ఆంక్షలతో అమెరికా అడ్డుకుంది. రాకెట్ టెక్నాలజీలో వెనుకబడి ఉన్నామంటూ మిత్ర దేశాలు వెక్కిరించేవి. ఈ వెక్కిరింపులను సవాల్ గా తీసుకొని మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి తమ సత్తా చాటారు. అణు పరీక్షలోనూ మేటి అని ప్రపంచదేశాలకు చెప్పారు.

హోమీ బాబా , ఇందిరాగాంధీ, వాజ్‌పేయి, అబ్దుల్ కలాం లాంటి ఎంతో మంది కృషి ఫలితంగా ఇండియా అణుపరీక్షల రంగంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. నాడు పోఖ్రాన్ అణు పరీక్షలు చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అమెరికా పీక పట్టుకుని పిసికేయాలనిపిస్తుంది.

మన దేశ శాస్త్రవేత్తలు రహస్యంగా రకరకాల పద్దతుల్లో టెక్నాలజీని సంపాదించారు. మొదట్లో సైకిల్ మీద మన రాకెట్ మోడళ్లను తీసుకెళ్లారంటే  ఎవరూ నమ్మరు.పోఖ్రాన్ అణుపరీక్షకు.. ఓ వైపు అంతరిక్ష పరిశోధనకు, మరోవైపు క్షిపణి పరిజ్ఙానానికి పదును పెట్టుకుంటూ, రహస్యంగా అణు పరిజ్ఙానాన్ని సంపాదించుకుంటున్నరోజుల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ  పోఖ్రాన్ అణుపరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

స్మైలింగ్ బుద్ద పేరుతో.. శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్ ను అత్యంత రహస్యంగా నిర్వహించారు.  ఎవరికి అర్ధంకాని రకరకాల కోడ్స్.. పేర్లతో..  మారు వేషాలతో ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.అమెరికా శాటిలైట్స్ అణుక్షణం ఈ ఆపరేషన్ మీద నిఘాను పెంచాయి. అయినప్పటికీ శాస్త్రవేత్తలు అదరక బెదరక తొలిసారిగా రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో అణుపరీక్ష ప్రయోగాన్ని విజయవంతం చేశారు.

ఆ తరువాత అమెరికా, దాని మిత్ర దేశాలు ఇండియాపై అనేక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ ఇండియా బెదిరిపోలేదు. ప్రధాని వాజ్‌పేయి, కలాం సారధ్యంలో రెండో పోఖ్రాన్ పరీక్షకు రంగం సిద్ధం చేశారు.  ఆపరేషన్‌ శక్తి పేరిట పోఖ్రాన్‌-2  పరీక్షలు భారత వైజ్ఞానిక సామర్థ్యాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. ఈ అణుపరీక్షలు  అంత ఆషామాషీగా జరగలేదు.  పోఖ్రాన్‌-2 ని అడ్డుకునేందుకు  అగ్రదేశాలు అణుక్షణం ఎన్నో కుట్రలకు తెరలేపాయి.

1974తో పోల్చుకుంటే 1998లో అణుపరీక్షలకు శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ  సీఐఏ కి  చెందిన శక్తివంతమైన ఉపగ్రహాలు రాజస్థాన్ లోని పోఖ్రాన్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని నిఘాను మరింత పెంచాయి. మన శాస్త్రవేత్తలు ఏమైనా తక్కువ తిన్నారా ? అమెరికా నిఘా వ్యవస్థను బురిడీ కొట్టించారు. తెలివిగా పని ముగించారు.

మన శాస్త్ర వేత్తలు అధికారులు సైనిక దుస్తుల్లో తిరిగేవాళ్లు. మారు పేర్లతో పిలుచుకునేవాళ్లు. ఎవరికి అనుమానం రాకుండా సైనికులతో కలసి క్రికెట్ ఆడుతుండేవారు. చుట్టుపక్కల ఉండే జనాలు కూడా వీళ్ళ ఆటలను చూస్తుండేవారు. అక్కడ సాధారణ సైనికులే ఉన్నారని .. అణు పరీక్షలు జరుగుతున్నాయని ఏ మాత్రం అనుమానించలేకపోయారు.  

100 మంది శాస్త్రవేత్తలు.. కేవలం రాత్రి పూట మాత్రమే ప్రయోగాలకు సంబంధించిన పనులు చేసేవారు. అలాగే అణుబాంబు పరీక్షలు జరిపే పరికరాలకు వైట్ హౌస్ ,విస్కీ ,తాజమహల్  లాంటి పదాలను కోడ్ వర్డ్స్ గా వాడేవారు. దీని వల్ల సీఐఎకి ఎలాంటి అనుమానాలు వచ్చేవి కావు. ఈ పరీక్షల గురించిన సమాచారం నాటి మంత్రుల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు. 

కాగా అణుబాంబులను భూమిలోపల అమర్చేందుకు తవ్విన ఆరు గుంతల్లో నీటి ధార రావడంతో … ఆ నీటిని బయటకు రాకుండా చేయడానికి సైనికులు ఇబ్బందులు పడ్డారు. అణుబాంబుల కోసం అమర్చిన లోహపు పరికరాలు నీటి తాకిడి కి తుప్పుపడతాయి. వాటిని కాపాడుకునేందుకు ముందు నీటిని బయటకు తోడేద్దామని అనుకున్నారు.

అమెరికా శాటిలైట్లు అడుగడుగునా నిఘాను పెంచడంతో ఆ ప్రయత్నాన్ని విరమించి వేరే ఆలోచన చేశారు. నీటిని బయటకు తోడేస్తే ఇసుక రంగు..  అక్కడ మొలిచే పచ్చిక రంగు సైతం మారుతుంది. దీని ద్వారా విదేశీ ఉపగ్రహాలు ఈ ఆపరేషన్ ను గుర్తించే అవకాశం ఉంటుంది.  ఇసుకలో పైపుల్ని లోతుగా పూడ్చి వాటి ద్వారా నీటిని పంపింగ్ చేసేవారు. దీని ద్వారా నీరు పూర్తిగా లోపలకి ఇంకిపోయేవి.

ఇలా ఎన్నో రిస్కుల నడుమ 1998 మే 11 నుంచి 13 మధ్య కాలంలో 5 అణు పరీక్షల్ని ఇండియా విజయవంతంగా నిర్వహించింది.ఆ ప్రయోగం గురించి నాటి ప్రధాని వాజ్ పాయి ప్రకటించగానే  అమెరికా మీడియా పోఖ్రాన్ పరీక్షల పై అక్కసు అంతా వెళ్లగక్కింది. ఎన్నో కథనాలు వెలువడ్డాయి. న్యూయార్క్ టైమ్స్ దీనికి నాయకత్వం వహించిందని అంటారు.

ఇండియాను ప్రపంచపటంలో నిలిపేందుకు ఈ పరీక్షలు ఆ తరువాత ఎంతలా ఉపయోగపడ్డాయో అందరికీ తెలిసిందే. కాగా ఆ తరువాత ఈ అణుపరీక్షలను ఇండియా ఆపివేసింది. పోఖ్రాన్ అణుపరీక్ష విజయవంతం ఎలా అయిందనే అంశంపై బాలీవుడ్ నిర్మాత  సినిమా కూడా తీశారు. ‘పరమాణు’ పేరుతో డైరక్టర్ అభిషేక్ శర్మ దీన్నితెరకెక్కించారు. జాన్ అబ్రహం హీరోగా నటించారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!