ఆ స్టీల్ ప్లాంట్ లో ఏముంది ?

Sharing is Caring...

ఈ ఫొటోలో కనిపించే ప్లాంట్ పేరు అజోవ్ స్టాల్ స్టీల్ ప్లాంట్. సోవియట్ కాలం నాటి ప్లాంట్ ఇది. 1933లో దీన్ని స్థాపించారు. 1935 నుంచి ఉత్పత్తి ని మొదలు పెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీ మరియుపోల్‌ను ఆక్రమించినప్పుడు 1941లో కార్యకలాపాలు నిలిపివేశారు.

సెప్టెంబరు 1943లో సోవియట్ దళాలు నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత, ప్లాంట్ పునర్నిర్మించారు.1991 లో ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందాక ప్లాంట్ ఉక్రేనియన్ ఆస్తిగా మారింది. 2005లో ప్లాంట్ 5.906 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది.

2014లో రష్యా-మద్దతుగల డాన్‌బాస్ వేర్పాటువాదులు ఉక్రేనియన్ ప్రభుత్వం నుండి మరియుపోల్‌ను ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఈ స్టీల్ ఫ్యాక్టరీ కింద పెద్ద సైజు  బంకర్లు ఉన్నాయి. అజోవ్ స్టాల్ యూరప్ లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. నాలుగు చదరపు మైళ్ల విస్తీరణంలో ఈ ప్లాంట్ ఉంది.  ఈ ప్లాంట్ ను పేల్చివేయడానికి రష్యా సేనలు చాలా ప్రయత్నాలు చేశాయి.

ప్లాంట్ కింద బంకర్ల లో దాక్కుని ఉక్రెయిన్ సైనికులు రష్యా సైన్యంతో పోరాడారు. దాదాపు నాలుగువేలమంది సైనికులు మరో వేయిమంది సాధారణ  పౌరులు ఇక్కడ ఆశ్రయం పొందారు. మరియుపోల్ లో రష్యా సైనికులతో చివర వరకు పోరాడుతున్న ఏకైక ప్రాంతం ఇదే. ఆ ప్లాంట్ లో ఉన్న దళాలు  36వ మెరైన్ బ్రిగేడు కి చెందిన వారని సమాచారం. 

మెరైన్ బ్రిగేడ్ కమాండర్ మేజర్ సెర్షి వొలినా ఓ వీడియో రిలీజ్ చేశారు. తమ దళాలు లొంగిపోవని తేల్చి చెప్పారు.  అంతర్జాతీయ సహాయాన్ని కోరారు. స్టీల్ ప్లాంట్ లో 500 మంది సైనికులు గాయపడి ఉన్నారని, వందల సంఖ్యలో మహిళలు, చిన్నారులు దాక్కుని ఉన్నట్లు కూడా ఆయన వీడియో ద్వారా అంతర్జాతీయ సమాజానికి వెల్లడించారు.

ఈ  బ్రిగేడ్ లోని కొంత మంది రష్యా సేనలకు దొరికిపోయారు. కొందరు ఆయుధాలను వదిలి వెళ్లారు. అలాగే స్టీల్ ప్లాంట్ లో అజోవ్ బ్రిగేడ్ అనే మరో దళం కూడా ఉంది. నల్ల సముద్రాన్ని మరియుపోల్ ను కలిసే అజోవ్ నది పేరుతో ఆ దళాన్ని ఏర్పాటు చేశారు. అజోవ్ ఓ మిలిటెంట్ సంస్థ. అతివాద జాతీయవాదులతో దానికి సంబంధాలున్నాయి. 

ఈ సంస్థే  ఉక్రేనియన్ నేషనల్ గార్డ్ గా మారిపోయింది. సుమారు 900 మంది అజోవ్ బ్రిగేడ్ దళాలు ఆ ప్లాంట్ లో ఉండొచ్చని అంచనా. వారం క్రితమే మెరైన్ టీమ్ తో  అజోవ్ బ్రిగేడ్లు కలిసిపోయారు. ఇక వాళ్ళేమి చేయలేరని భావించి కాబోలు  ఆ స్టీల్ ప్లాంట్ పై దాడి చేయవద్దు అని తాజాగా పుతిన్ ఆదేశించారు.కానీ ఆ ప్లాంట్ ను పూర్తిగా సీజ్ చేయాలని, ఒక్క పురుగు కూడా బయటకు వెళ్లకూడదని అల్టిమేటమ్ జారీ చేశారు.

దీంతో అజోవ్ ప్లాంట్ లో ఎవరు దాగి ఉన్నారన్నది ఆసక్తి కరంగా మారింది. ప్లాంట్ లో దళాలకు ఉక్రెయిన్ ప్రభుత్వానికి సంబంధం లేదని అంటారు. అలాగే ఇక్కడ నాటో ఆర్మీ అధికారులు కూడా ఉన్నారని చెబుతున్నారు. వారందరిని పట్టుకుని బంధించాలని రహస్య ఆదేశాలు ఇచ్చారని కూడా అంటారు. పుతిన్ ఎవరి ప్రాణాలు తీయవద్దని .. సీజ్ చేయమని మాత్రమే చెప్పారంటే ?? దాని వెనుక ఏదో మర్మం ఉండే ఉండొచ్చు.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!