ఎవరీ అలెగ్జాండర్ వోర్నికోవ్ ?

Sharing is Caring...

రష్యా చేస్తున్న భీకర దాడులను పర్యవేక్షించేందుకు.. ఎప్పటికపుడు సేనలకు ఆదేశాలు ఇవ్వడానికి ఒక కొత్త కమాండర్ ను నియమించుకున్నాడు పుతిన్. ఆ జనరల్ పేరే అలెగ్జాండర్ వోర్నికొవ్. పుతిన్ కు ఇతగాడు నమ్మిన బంటు. అత్యంత క్రూరం గా  వ్యవహరిస్తారనే పేరుంది. సిరియా లో నగరాలను శిధిలాలుగా మార్చిన ఖ్యాతి అతనిది.

ఇప్పటివరకు మందకొడిగా యుద్ధం సాగిందని భావిస్తున్న పుతిన్ మూడు రోజుల క్రితం అలెగ్జాండర్ ను రంగంలోకి దించాడు. మొన్ననే మరియుపోల్ నగరాన్ని విధ్వంసం చేసిన జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్ గురించి చదువుకున్నాం. ఇపుడు ఈ అలెగ్జాండర్ గురించి వింటున్నాం. ఈ ఇద్దరు కలిస్తే ఎలాంటి విలయం సృష్టిస్తారో ? ఈ అలెగ్జాండర్ కి పెద్ద చరిత్రే ఉంది. 

1982లో రష్యా సైన్యంలో ప్లాటూన్ కమాండర్‌గా వొర్నికోవ్ అప్పట్లో వ్యవహరించారు.  చెచెన్యాతో జరిగిన రెండో యుద్ధంలో వివిధ విభాగాల్లో పనిచేశాడు. సైన్యంలో చాలా వేగంగా ఎదిగాడు.వొర్నికోవ్ గతంలో రష్యా దక్షిణ మిలటరీ  బాధ్యతలను చూసుకొనేవారు.

రష్యా వాయుసేన సిరియాలో నిర్వహించిన భీకర వైమానిక దాడులన్నీ  అతడి కనుసన్నల్లో జరిగినవే. అంతేకాదు.. ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల డాస్బాస్ రీజియన్‌లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అలెగ్జాండర్ ప్రస్తుతం  ఉక్రెయిన్ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో రష్యా ఆపరేషన్ బాధ్యతలు చేపట్టారు.

సిరియాలో జరిగిన పౌర తిరుగుబాటుకు వ్యతిరేకంగా అప్పట్లో  అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా రష్యా చేపట్టిన ఆపరేషన్‌ను తొలినాళ్లలో పర్యవేక్షించిన అతి తక్కువ మంది కమాండర్లలో వొర్నికోవ్ ఒకరు. సిరియా పౌరులు, పొరుగు దేశాలపై, ఆసుపత్రులపై కూడా నిర్దాక్షిణ్యంగా ఇతగాడు బాంబులు వేయించాడు.

ఫలితంగా గగనతల యుద్ధంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ విజయం సాధించాడు. వొర్నికోవ్ కు రష్యా అత్యున్నత పురస్కారమైన “హీరో ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్” అవార్డు 2016లో ప్రదానం చేశారు.
టర్కీ లో చర్చలు దరిమిలా  ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రష్యా బలగాలను ఉపసంహరించింది. దీంతో ఉక్రెయిన్ దక్షిణ, తూర్పు భాగాలపై రష్యా దృష్టి పెట్టిందని ఉక్రెయిన్  ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనావేశాయి.

ఇప్పటికే ఈ ప్రాంతంలో వొర్నికోవ్ ఆపరేషన్ ను మొదలు పెట్టాడు. సిరియాలో పౌరులపై క్రూరత్వం చూపి దమన కాండ సాగించిన  జనరల్ కి  ఇక్కడ బాధ్యతలు అప్పగించడంతో.. ఇప్పుడు ఇక్కడ కూడా అవే సన్నివేశాలు  పునరావృతం కావచ్చని భావిస్తున్నారు.

2011లో సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కి  వ్యతిరేకంగా తిరుగుబాటు చోటు చేసుకొని అది తీవ్ర రూపం దాల్చి అంతర్యుద్ధంగా మారింది. 2015 నాటికి తిరుగుబాటుదారులు అసద్ ను ఓడించే స్థితికి చేరారు. అలాంటి కఠిన సమయంలో అసద్ కు మద్దతుగా దిగిన రష్యా దళాలకు వెర్నికోవ్ నాయకత్వం వహించారు.

అప్పటికే రష్యాకు సిరియాలో నావికాదళ స్థావరం కూడా ఉంది. దీంతోపాటు అసద్ ప్రభుత్వానికి రష్యా మద్దతు ఇచ్చింది.  సిరియాలో అంతర్యుద్ధం సమయంలో అలెప్పొ నగరాన్ని అలెగ్జాండర్ ధ్వంసం చేయించాడు.  ఈ యుద్ధంలో నిర్దాక్షిణ్యంగా ప్రజలపై బ్యారెల్ బాంబులను ప్రయోగించాడు.

ఓ డ్రమ్ములో చమురు, ఇనుప మేకులు, ఇతర ప్రమాదకర వ్యర్థాలను నింపి హెలికాప్టర్ల ద్వారా పౌరప్రదేశాలపై జారవిడిచి పేల్చేశారు. అత్యంత చౌకగా గగనతల దాడులు నిర్వహించేందుకు ఈ విధానం అమలు చేశారు.2011 నుంచి జరిగిన సిరియా అంతర్యుద్ధంలో మూడు లక్షల నుంచి ఆరు లక్షల మంది వరకు అక్కడ మరణించారు. అక్కడ రష్యా 2015 నుంచి 2022 మార్చి వరకు జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 25 వేల మంది మరణించారు.

రష్యా ఒక్క పౌరుడు కూడా ఈ దాడుల్లో మరణించినట్లు అంగీకరించలేదు. రష్యా విమానాలు నిషేధిత క్లస్టర్ బాంబులను పౌర నివాసాలపై జారవిడిచాయి. ఇవన్నీ వోర్నికోవ్ సారథ్యంలోనే జరిగాయి.
దీనికి తోడు రష్యాకు చెందిన సీక్రెట్ మిలిటరీ  వాగ్నార్ గ్రూప్ తో కూడా ఆయన కలిసి పనిచేశారు.

భూభాగాల నుంచి వాగ్నార్ గ్రూపులు దాడి చేసేలా.. గగనతలం నుంచి రష్యా విమానాలు బాంబింగ్ చేసేలా సమన్వయం చేసుకొంటూ సిరియాలో ప్రత్యర్థులను అణచివేశారని అంటారు. ఇపుడు కూడా రష్యా అత్యంత నిర్దాక్షిణ్యంగా లక్ష్యాన్ని సాధించే వ్యూహంతో అలెగ్జాండర్ ను రంగంలోకి దించింది.
అలెగ్జాండర్ వోర్నికోవ్  మూడురోజుల క్రితం  ఒక రైలు స్టేషన్‌పై రెండు క్షిపణులను ప్రయోగించాడు. ఫలితంగా 57 మంది చనిపోయారు, ఇందులో మహిళలు, పిల్లలు’ వృద్ధులు ఎక్కువగా ఉన్నారు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!