ఇదొక చిత్రమైన కేసు. ఈ ఫొటోలో కనిపించే వారిద్దరూ భార్యాభర్తలు. భార్య పేరు నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ.. మంచి రచయిత్రి. రొమాన్స్ కథలు బాగా రాస్తుందని పేరు. ప్రస్తుతం ఆమె తన భర్త డేనియల్ బ్రోఫీకి సంబంధించిన హత్య కేసు లో నిందితురాలిగా ఇరుక్కున్నారు.. సుమారు నాలుగేళ్ళ విచారణ అనంతరం కోర్టు ఆమెకు జూన్ 14, 2022న జీవిత ఖైదు శిక్ష విధించింది.
నాన్సీ భర్త సౌత్ వెస్ట్ పోర్ట్ ల్యాండ్ లోని ఒరెగాన్ క్యులినరీ సంస్థలో విధులు నిర్వర్తించడానికి వెళ్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. ఆయన్ని ఎవరో తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో నాన్సీ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమె రాసిన ఒక నవలే అందుకు కారణమైంది. ఆమె తన భర్త మృతి చెందడానికి ఏడేళ్ల ముందు” హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్” అనే పేరుతో ఒక నవల రాసింది. పోలీసులకు అనుమానం వచ్చి అరెస్ట్ చేశారు. తొలుత ఆమె భర్త మరణం పోలీసులకు ఒక మిస్టరీ గా అనిపించింది.
లోతుగా పరిశీలించారు.ఎన్నో విచారణల తర్వాత ఆమెను అసలైన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ట్రాఫిక్ కెమెరా ఫుటేజ్ లో ఆమె భర్త హత్య జరగడానికి ముందు ఆ ప్రాంతంలో తిరిగినట్లు స్పష్టంగా కనిపించింది.
న్యాయమూర్తి సీనియర్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ షాన్ ముల్ట్ నోమా కౌంటీ సుమారు 10 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఆమె అక్రమ సంపాదనతో చాలా లాభపడిందని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఆమె గతంలో ఎలాంటి నేరారోపణలకు పాల్పడలేదట.