Doomsday Glacier………………………….
పై ఫొటోలో కనిపించేది థ్వెయిట్స్ హిమనీ నదం.దీనినే డూమ్స్ డే హిమనీ నదం అని కూడా పిలుస్తారు. ఇది సుమారు 120 కిలోమీటర్ల మేరకు (75 మైళ్ళు)ఇటు నేల పైన అటు సముద్రంలో విస్తరించిన అతి పెద్ద హిమనీ నదం. థ్వెయిట్స్.. అంటార్కిటికాలోని పశ్చిమ అర్ధభాగంలో మారుమూల ప్రదేశంలో ఉంది. అక్కడికి దగ్గర్లో పరిశోధన కేంద్రాలు లేవు.
ఎవరూ ఈ హిమనీ నదంపై కాలు కూడా మోపలేదు. 2019లో స్వీడన్‌కు చెందిన అన్నా వాహ్లిన్ అనే శాస్త్రవేత్త సారధ్యంలో ఒక పరిశోధక బృందం దూరం నుంచి ఈ హిమనీ నదాన్ని పరిశీలించి వచ్చింది. థ్వెయిట్స్ పక్కనే అమండ్‌సన్ అనే సముద్రం ఉంది. హిమనీ నదం లోని మంచు మొత్తం కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు ఏకంగా రెండు అడుగుల మేర పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రాబోయే అయిదేళ్ల కాలంలో మంచు కరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
అదే జరిగితే సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో నివసించే కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడవచ్చని భావిస్తున్నారు.సముద్ర జలాల వేడెక్కుతున్న కారణంగా ఈ హిమనీ నదం అడుగు భాగం కరిగిపోతున్నదని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే నేల పై విస్తరించిన మంచు భాగం కూడా పట్టు సడలిపోతున్నది.ఈ పరిణామాల కారణంగా భారీ మంచు ఫలకలు సముద్రంలోకి జారి పోతున్నాయి. నీటిలో కరుగుతున్నాయి.
అదే భారీ పరిమాణంలో మంచు పలకలు సముద్రంలోకి జారితే ఇబ్బంది ఏర్పడుతుంది.ఒక్కసారిగా సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఇప్పటికే మంచు పలకల్లో పగుళ్లు ఏర్పడ్డాయని పరిశోధక బృందం గుర్తించింది.ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ హిమనీ నదంలోని మంచు ముక్కలు ఏటా 50 బిలియన్ టన్నుల మేరకు కరిగి నీరుగా మారుతోందని అంచనా. కేవలం ఒక సంవత్సరంలో ఆరు మైళ్ల మేరకు (10-కిలోమీటర్లు) పొడవైన పగుళ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా మంచు ముక్కలు కరిగే పరిస్థితులు నెలకొన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు..భూమిఉపరితలంలో మార్పులు … సముద్రాలలో నీరు వేడెక్కడం వల్ల అంటార్కిటికాలోని ఇతర హిమానీ నదాల కంటే గత దశాబ్దంలో థ్వెయిట్స్ చాలా మార్పులకు గురైందని పరిశోధకులు గమనించారు. ఇటీవల అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అక్కడ కెళ్ళి మళ్ళీ పరిశోధనలు చేస్తున్నారు.
నీటి ఉష్ణోగ్రతను కొలవడం .. సముద్ర గర్భాన్నిశోధించడం..మంచు ఎంత మందంలో ఉన్నదో పరిశోధిస్తున్నారు. ఇందుకోసం ‘రాన్’ అనే రోబోటిక్ షిప్‌ను ఈసారీ తీసుకెళుతున్నారు.అలాగే ఆధునికమైన ‘బోటీ మెక్ బోట్ ఫేస్’ను కూడా ఉపయోగిస్తారు. ఈ చిన్న జలాంతర్గాములు.. మంచు పలకల కింద సముద్ర జలాలను శోధిస్తాయి. అమెరికా, బ్రిటన్, స్వీడన్‌లకు చెందిన 32 మంది పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.