గుండె భగ్గుమనే ఘటనకు ఆనవాళ్లు !!

Sharing is Caring...

Bitter marks left by the British rulers …

మన దేశ చరిత్రలో అదొక బ్లాక్ డే.. పై ఫొటోలో కనిపించే బుల్లెట్ మార్క్స్ బ్రిటిష్ పాలకులు మిగిల్చిన  చేదు గుర్తులు. ప్రజలపై కర్కశం గా కాల్పులు జరిపినపుడు కొన్ని బుల్లెట్లు ఆ గోడల్లో ఇరుక్కుపోయాయి. జలియన్ వాలా బాగ్ నరమేధం తాలూకు చిహ్నాలవి.

ఆ రోజు అసలు ఏమి జరిగిందంటే   … 

అది బ్రిటిష్ పాలనలోని కాలం. 1919 ఏప్రిల్‌ నెలలో బ్రిగేడియర్ జనరల్ REH డయ్యర్ ‘అమృత్‌సర్‌’కు వచ్చారు. మైల్స్ ఇర్వింగ్ సారధ్యంలో పౌర పరిపాలన సరిగ్గా జరగడం లేదని, పౌరులు తిరుగుబాటు ధోరణిలో ఉన్నారని తెలుసుకున్నారు. రౌలత్ చట్టం గురించి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని డయ్యర్ కు ఎవరో సమాచారం చేరవేశారు.  

రౌలత్ చట్టం అనేది ప్రభుత్వం ఆమోదించిన అణచివేత చట్టం.దీని ప్రకారం విచారణ లేకుండా ప్రజలను జైలులో పెట్టడానికి అవకాశం ఉంది. ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. తిరుగు బాటును అణిచి వేయాలన్న తలంపుతో జనరల్ డయ్యర్ అమృత్‌సర్ లో సమావేశాల నిషేధాన్ని ప్రకటించాడు. కానీ ఈ సమాచారాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లలేదు.

1919 ఏప్రిల్ 13వ తేదీన జలియన్‌వాలా బాగ్‌లో ప్రజలు బైసాఖీ పండుగను జరుపుకోవడానికి శాంతియుతంగా సమావేశమయ్యారు. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు..ఈ విషయం తెలుసుకుని జనరల్ డయ్యర్ ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. వెంటనే సిక్కు, గూర్ఖా, బలూచి, రాజ్‌పుత్ దళాలతో కూడిన బెటాలియన్‌తో బాగ్ వైపు కవాతు చేస్తూ వెళ్ళాడు.

డయ్యర్ .. సైనిక దళాలు ఉద్యానవనంలో ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌ పైకి ఎక్కి వేలాది మంది ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరపమని ప్రకటించారు.ఉద్యానవనం కు తలుపులు పెద్దగా లేవు. చుట్టూ గోడ..ఆ వెనుక ఇళ్ళు ఉన్నాయి. ఉన్న ఒక తలుపును మూసివేశారు. జనానికి తప్పించుకునే మార్గం లేదు. మందు గుండు సామగ్రి అయిపోయే వరకు డయ్యర్ ఈ కాల్పులు కొనసాగించాడు. 

అమాయక ప్రజలు, నిరాయుధులైన పురుషులు, మహిళలు, పిల్లలను బలి తీసుకున్నారు.ఈ ఘటనలో 379 మంది మరణించారని, 1,200 మంది గాయపడ్డారని అధికారికంగా బ్రిటిష్ ఇండియన్ వర్గాలు అప్పట్లో ప్రకటించాయి. అయితే భారత జాతీయ కాంగ్రెస్ మృతుల సంఖ్య 1,500 వరకు ఉంటుందని అంచనా వేసింది. అలాగే 1,000 మందికి బుల్లెట్ గాయాలు తగిలాయని ప్రకటించింది. 

అమృత్‌సర్‌ లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఈ జలియన్‌వాలా బాగ్ ఉంది. అదొక ఒక పబ్లిక్ గార్డెన్.తర్వాత కాలంలో బ్రిటిష్ దళాల దమన కాండకు .. బలైపోయిన అమరుల గుర్తుగా ఇక్కడ ఒక స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారు. 6.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న జలియన్‌వాలా బాగ్ ఇప్పుడు అందమైన పార్కుగా మారింది. దీన్ని జలియన్‌వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నది. 

ఈ విశాల ప్రాంగణం లోపల అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఇవి అక్కడ జరిగిన దారుణాలను ప్రతిబింబిస్తాయి. పౌరులపై నాడు కాల్పులు జరిపిన సందర్భం లో కొన్నిబుల్లెట్లు గోడలో చిక్కుకుపోయాయి. ఆ గోడ ఇంకా శిధిలం కాకుండా అలాగే ఉంది.  బుల్లెట్ల దాడి నుండి తమను తాము రక్షించుకోవడానికి కొందరు దూకిన బావి కూడా అలాగే ఉంది. నాటి సంఘటన ను తెలియజేసే స్లయిడ్ షో లు కూడా ఈ పార్క్ లో వేస్తుంటారు. అమృతసర్ వెళ్ళినపుడు ఈ జలియన్ వాలా బాగ్ ను చూసి రండి.

———–KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!