సుజ్లాన్ ఎనర్జీ ..పెద్ద కంపెనీ యే కానీ పనితీరు ఆకర్షణీయంగా లేదు. వరుస నష్టాల్లో ఉంది. కంపెనీ విండ్ టర్బైన్ జనరేటర్ల తయారీ.. వాటి విడి భాగాల సరఫరా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. గతంలో ఈ షేర్లను నమ్ముకుని నష్టపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు.
జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 589.96 కోట్ల నికర అమ్మకాలపై రూ.186.15 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఇదే కాలంలో కూడా నష్టాలే.ఇక సెప్టెంబర్ 21 తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ రూ. 751 కోట్ల నికర అమ్మకాలపై .. రూ. 236 కోట్ల నికర నష్టాన్ని చూపింది. జూన్ తో పోలిస్తే సెప్టెంబర్ లో నష్టాలు పెరిగాయి.
కంపెనీ కి రుణ భారం ఎక్కువగా ఉంది. వడ్డీ చెల్లింపులు ఎక్కువ అవుతున్నాయి. గత కొంత కాలంగా రుణాన్ని కొంత తగ్గించుకున్నారు. అదే సమయంలో ఈక్విటీ కూడా గణనీయంగా తగ్గింది. సుజ్లాన్ భారీ వర్కింగ్ క్యాపిటల్ సమస్యలను ఎదుర్కొంటున్నది. వర్క్ ఆర్డర్లు వస్తున్నప్పటికీ వాటిని అమలు చేసేందుకు అవసరమైన సొమ్ము లేదు. ఇవన్నీ పరిష్కారం అయితేనే కానీ కంపెనీ పనితీరు మెరుగుపడదు.
గత ఏడాది సుజ్లాన్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ కంపెనీ రాబోయే 12 నెలల్లో లాభాల బాటలో పడుతుందని మీడియాకు చెప్పారు. కానీ ఇంకా నష్టాల్లోనే నడుస్తోంది. లెమాన్ బ్రదర్స్ కంపెనీ కుప్పకూలిన తర్వాత అతిపెద్ద ఇంధన మార్కెట్ల నుండి ఆర్డర్స్ ఆగిపోయాయి. యూరప్ ..యుఎస్ లనుంచి క్రెడిట్ ఫ్లో ఆగిపోవడంతో సుజ్లాన్ షేర్ ధర పతనమైంది. దీంతో మిన్నెసోటాలో పైప్స్టోన్లోని బ్లేడ్ తయారీ కర్మాగారాన్ని మూసివేసింది.
సుజ్లాన్ స్టాక్ 2008లో అత్యధికంగా నష్టపోయిన షేర్లలో ఒకటి. రూ. 460 గరిష్ట స్థాయిని తాకిన తర్వాత ఈ షేరు ఒక దశలోరూ. 36 కి పడిపోయింది. అప్పట్లో ఈ షేర్ ధర తగ్గుతున్నప్పటికీ మళ్ళీ పెరుగుతుందనే ఆశతో ఇన్వెస్టర్లు అమ్ముకోలేదు. కీలక తరుణంలో అప్రమత్తం కాకపోవడంతో అలా పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు నష్టపోయారు.
కంపెనీ రుణభారం నుంచి పూర్తిగా విముక్తి అయితేనే బలం పుంజుకుంటుంది. అప్పటిదాకా షేర్ ధర పెరగడం కష్టమే. ప్రస్తుతం షేర్ రూ. 9.70 వద్ద ట్రేడ్ అవుతోంది. 52 వారాల గరిష్ట ధర రూ. 11. 20.. కనిష్ట ధర రూ. 4. 40 మాత్రమే. ఈ దశలో ఇన్వెస్ట్మెంట్ శుద్ధ దండగ. అన్నీ అనుకూలిస్తే మూడు నాలుగేళ్ళ కాలం లో కంపెనీ లాభాల బాట పట్టవచ్చు. అపుడు షేర్ ధర పెరగవచ్చు. ఇపుడు ధర తక్కువని కొన్నారా .. చేతులు కాలడం ఖాయం !నష్ట పోయిన ఇన్వెస్టర్లు ఆశతో ఎదురు చూడటం .. కొంచెం ధర పెరిగితే అమ్ముకోవడం మినహా మరో మార్గం లేదు