వెలుగులు తెచ్చిన టీచర్ !

Sharing is Caring...

Ramana Kontikarla ………………………….. 

Inspiration……………………………………………….

టీచర్ అంటే కేవలం బడిలో పాఠాలు చెప్పేవాడే కాదు. బాధ్యతగా భావించి సమాజాన్ని చైతన్యవంతం చేసే వాడు కూడా. అలాగే సమాజానికి అవసరమైన వాటిని గుర్తించి సమకూర్చేవాడు. సామాజిక అవసరాలు తీర్చడం బాధ్యతగా ఫీలైతే ఎవరైనా ఏదైనా సాధించగలరు.అలాంటి టీచరే జాన్ ఖంగ్యూ.

అది భారత సరిహద్దు గ్రామం. మయన్మార్ బార్డర్ లో నాగాలాండ్ లోని షిన్యూ అనే ఓ మారుమూల గ్రామం. ప్రతీ ఏటా దేశానికి దీపావళి ఎలాగో.. ఆ గ్రామస్తులకు  ఫిబ్రవరి పదహారో తేదీనే దీపావళి. అలా ఆ ఊరిలో దీపాలు వెలిగించి మరో దీపావళికి కారకుడైనవాడు జాన్ ఖంగ్యూ.

షిన్యూ గ్రామం ప్రభుత్వం చేత  2002లో అధికారికంగా గుర్తింపుకు నోచుకుంది. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. మోన్ జిల్లా కేంద్రం నుంచి ఈ గ్రామానికి చేరాలంటే 12 గంటలపాటు ప్రయాణం చేయాలి. 6 గంటలు ప్రయాణం చేస్తేనేగానీ.. టోబు అనే మరో పట్టణానికి చేరలేరు. ఇక్కడ కొన్యాక్ నాగా కమ్యూనిటీకి చెందిన 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. 

సాయంసంధ్య వేళ దాటిందంటే చాలు గ్రామం లో చిమ్మచీకట్లే. ప్రభుత్వం విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. దీంతో ఊరి జనం తమ పనులన్నీ వెలుగున్నంతలోనే ముగించుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా అటవీప్రాంతం. గ్రామంలో ఓ చర్చ్, ఓ ప్రాథమిక పాఠశాల, ఓ అతిథి గృహం, ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నాయి.

పిల్లలు ఊళ్లో చదువుకోలేక.. హాస్టళ్లలో ఉంటూ బయట పట్టణాల్లో చదువుకుంటున్నారు. అయితే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే జాన్ ఖంగ్యు సోషల్ మీడియా పోస్ట్‌  ఊరికి వెలుగులు పంచింది. 33 ఏళ్ల జాన్ ఖంగ్యూ ఆరేళ్ల క్రితం షిన్యూ ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వచ్చాడు. అతని రాక గ్రామం చీకట్లను పారద్రోలడానికి కారణమైంది. షిన్యూ కూడా  వాహనాల్లో రావడానికి చాలా ఇబ్బంది పడేవాడు. జాన్ తన ఫోన్ ను ఛార్జ్ చేయడానికి కూడా వీల్లేకుండేది.

అప్పుడు జాన్ లో ఆలోచనలు మొదలైనాయి.. ఇక్కడి ప్రజలు ఎలా బతుకుతున్నారా అన్న మథనం ఆయనలో మొదలైంది. షిన్యూ జనం ఈతి బాధలను తన బాధగా ఫీలయ్యాడు. వెంటనే.. సోషల్ మీడియా నెంచుకున్నాడు. కరెంట్ లేకపోవడం, ఫోన్ నెట్ వర్క్ లేకపోవడం, విద్యా, వైద్యం .. రోడ్లు లేని దుస్థితి సమస్యల గురించి వివరిస్తూ  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

ఆ పోస్ట్ ను జాన్ ఫేస్ బుక్ స్నేహితుడు చూసి షేర్ చేశాడు.ఆ పోస్ట్  2019లో గ్లోబల్ హిమాలయన్ ఎక్స్‌పెడిషన్ (GHE) దృష్టిలో పడింది. ఆ సంస్థ.. దేశంలోని మారుమూల గ్రామాలలో మైక్రో సోలార్ గ్రిడ్‌లను ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు అందిస్తోంది.

GHE సూచనల ప్రకారం.. జాన్ తానే స్వయంగా గ్రామంలోని విద్యుత్ అవసరాలపై చిన్నపాటి సర్వే నిర్వహించాడు. మొత్తం 23 లక్షల ఖర్చుతో.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి GHE  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మోన్ జిల్లా అధికార యంత్రాంగంతో  GHE ప్రతినిధులు సంప్రదించారు.  ఎంతోకాలం నుంచి ప్రయత్నిస్తున్నా తమవల్ల కాని పనికి అధికారులూ సరేనన్నారు.

ఇంకేం.. గ్లోబల్ హిమాలయన్ ఎక్స్ పెడిషన్ సభ్యులు,సి ఇంజనీర్‌లు, జిల్లా అధికారిక బృందం 10 మంది  సోలార్ ప్యానెల్స్‌తో 16 గంటల పాటు ప్రయాణించి… షిన్యూకి  చేరుకున్నారు. సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసి ప్రతీ ఇంట్లో వెలుగులు నింపారు.  పాఠశాల, చర్చ్, కమ్యూనిటీ హాల్ అన్నిచోట్లా లైట్లు వెలిగాయి.

ఇప్పుడిక్కడ ప్రతి ఇంట్లో 170 వాట్ల సోలార్ ప్యానెల్, బ్యాటరీ, రెండు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రెండు ట్యూబ్ లైట్లు, మూడు ఎల్ఈడీ బల్బులున్నాయి. 11 సోలార్ వీధి దీపాలనూ ఏర్పాటు చేశారు. ప్రతి నెలా వందరూపాయల చొప్పన నిర్వహణ కోసం ప్రతీ ఇంటినుంచి వసూలు చేస్తారు.

ఈ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు గ్రామానికే చెందిన కొందరు యువకులకు ప్రత్యేకం గాశిక్షణ కూడా ఇచ్చారు. ఆ విధంగా ఒక టీచర్ చొరవ .. సంకల్పం … ఓ సోషల్ మీడియా పోస్ట్…నాలుగు దశాబ్దాలు అంధకారంలో మగ్గిన  గ్రామం దుస్థితిని మార్చేశాయి.  శభాష్ జాన్ ఖంగ్యూ!!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!