A different movie ………………………………………
మసాలా సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చదు. భిన్నమైన చిత్రాలను చూసే వారికి నచ్చుతుంది. గొప్పగా లేదు కానీ చూడొచ్చు. రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అడవుల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చేయి. ఇదొక కొత్త కథ. అడవుల్లోకి వెళ్లి గొర్రెలు మేపుకునే కాపర్ల కథ. గొర్రెల కాపరులు, వారి జీవన శైలి పై ఇదే తొలి చిత్రం.
‘కొండపొలం’ సినిమా మొత్తం నల్లమల అడవుల్లో చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా అదే పేరుతో ఈ సినిమా తీశారు. సినిమాకు సన్నపురెడ్డి డైలాగులు కూడా రాశారు. ఇక సినిమాలో హీరో ఉంటాడు కాబట్టి నవలలో లేని హీరోయిన్ ఓబులమ్మ పాత్రను దర్శకుడు క్రిష్ సృష్టించారు. ఏ నవలనైనా సినిమాగా తీయడం అంత సులభం కాదు. నవల పరిధి వేరు .. సినిమా పరిధి వేరు.
నవలలోని లైన్ ను క్రిష్ సినిమాగా బాగానే మలిచారు. మంచి సన్నివేశాలను.. డ్రామాను , సెంటిమెంట్ ను జోడించారు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను అందంగా పట్టుకొచ్చారు. పిరికి వాడైన హీరో అడవిలో నేర్చుకున్న పాఠాలతో నిజజీవితంలో విజయం సాధిస్తాడు. మొదట్లో పామును చూసి జడిసిన హీరో పులి తో పోరాటం చేసే స్థాయికి ఎదుగుతాడు. సినిమా మొత్తం కొండలు.. కోనల్లోనే సాగుతుంది.
మొదట్లో కొంత స్లో గా ఉన్నప్పటికీ తర్వాత కథ ఊపందుకుంటుంది. కొన్నిసన్నివేశాలను క్రిష్ అద్భుతంగా చిత్రీకరించారు. హీరో తండ్రి పాత్రలో సాయిచంద్ నటన సహజంగా ఉంది. పాత్రలో ఇమిడిపోయాడు. అతని పాత్రకే ఎక్కువ మార్కులు పడతాయి. గొర్రెలను తమ సొంత బిడ్డలుగా భావించే కాపరులు..వాటికి ఆహారం.. నీరు అందించలేని స్థితిలో ఎలా ఫీల్ అవుతారో .. ఎలా బరస్ట్ అవుతారో సాయిచంద్ ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులకు అర్ధమౌతుంది.
పులి ఎత్తుకుపోయిన గొర్రె లోయలో పడగా రక్షించే సీన్ లో హీరో వైష్ణవ్ తేజ్ బాగా చేశారు. కొన్ని సన్నివేశాలలో హీరో బెరుకుగా ఉన్నట్టు అనిపిస్తుంది ..అది ఆ పాత్ర స్వభావం …దాన్ని వైష్ణవ్ తేజ్ తన ముఖంలో బాగానే పలికించారు. మరి కొన్ని సన్నివేశాల్లో సరైన ఎక్సప్రెషన్స్ లేవు. రవి ప్రకాశ్ తన భార్యతో ఫోన్ లో మాట్లాడిన సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. హీరో స్మగ్లర్ల పై దాడిచేసిన సీన్లు థ్రిల్ కలిగిస్తాయి.
ఓబులమ్మ పాత్ర కు రకుల్ అంత న్యాయం చేయలేక పోయింది. కొంచెం అనుభవం ఉన్న నటి అయితే బాగుండేది. దర్శకుడు గ్లామర్ కి ప్రాధాన్యత నిచ్చారా అనిపిస్తుంది. కథలో ఓబులమ్మ పాత్ర కూడా కీలకమైనదే.. అది హైలైట్ కాలేదు. భిన్నమైన కథాంశాలతో సినిమాలు తీసే క్రిష్ ఈ సినిమాను కూడా డిఫెరెంట్ గానే తీశారు. అన్నిగొర్రెలతో .. అడవుల్లో సినిమా తీయడం కూడా అంత సులభం కాదు. పులి గ్రాఫిక్స్ ఫర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాయి.
కీరవాణి స్వరపరిచిన పాటలు గొప్పగా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టు కుంటుంది.జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫి సినిమాకు ఆకర్షణగా నిలిచింది. ప్రకృతి అందాలను అద్భుతంగా తెరపైకి ఎక్కించారు. ఎక్కువగా రాయలసీమ మాండలికం వాడారు.
ఇక సినిమా లో డైలాగులు బాగున్నాయి. “సదువుకున్న గొర్రె, సదువుకోని గొర్రెతో మాటాడేది సూసినవా?” ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది’ ‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో తెలీదు” “అడవికి చుట్టం చూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు” “అడవి పెద్ద బాలశిక్ష లాంటిది. ఇక్కడ ప్రతి చెట్టుకు, పుట్టకు ఓ కథ ఉంటుంది” లాంటి డైలాగ్స్ సినిమాకు బలం చేకూర్చాయి. మొత్తం మీద క్రిష్ ఆసక్తికరమైన కథ తో కుటుంబపరంగా చూడదగిన సినిమానే అందించారు. చూడొచ్చు.
——-KNM