Ramana Kontikarla ……………………………..
This art is owned by a few………………………
కేరళలో నొక్కువిద్య పావక్కళి తోలుబొమ్మలాట కు శతాబ్దాల చరిత్ర ఉంది. అయితే క్రమంగా ఈ కళ అంతరించి పోతోంది. ఈ సంప్రదాయ కళా రూపాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఘనత 81 ఏళ్ల పెద్దమ్మ పంకజాక్షి కి చెందుతుంది. ఇదంతా గమనించే ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
గత ఐదు శతాబ్దాలుగా మూజిక్కల్ పంకజాక్షి పూర్వీకులు కేరళలో నొక్కువిద్య పావక్కళిని అభ్యసించి ప్రదర్శించేవారు. 8 సంవత్సరాల వయస్సు నుండి పంకజాక్షి కూడా ఈ తోలుబొమ్మలాటను నేర్చుకుంది. పెళ్లై అత్తవారింటికి వెళ్లినప్పటికీ..తన అత్తతో పాటు..పంకజాక్షి భర్త ప్రోత్సాహంతో ఈ తోలు బొమ్మలాటను కొనసాగిస్తూ ఒక గుర్తింపును దక్కించుకుంది.
విదేశాల్లో సైతం ఈ దేశీయ తోలుబొమ్మ లాట ప్రదర్శనలిచ్చి ఎంతో పేరు గడిచింది.ఆ కళ మరో పదికాలాల పాటు కొనసాగాలని పంకజాక్షి తన మనవరాలికి నేర్పించింది. అలా కళను వారసత్వం ద్వారా బతికించే ప్రయత్నం చేసింది. కేరళలోని కొట్టాయం జిల్లా మోనిప్పలి గ్రామానికి చెందిన మూజిక్కల్ పంకజాక్షి 2008లో పారిస్‌లో తోలుబొమ్మలాటను ప్రదర్శించాక అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
ఈ నొక్కువిద్య పావక్కలి తోలుబొమ్మలాట చాలా శ్రమతో కూడుకున్నది. ఈ ఆటను నడిపించాలంటే సంపూర్ణ ఏకాగ్రత అవసరం. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా… మొత్తం షో దెబ్బ తింటుంది.ఈ ఆటను ప్రదర్శించే వ్యక్తి పై పెదవి తో తోలుబొమ్మలను బ్యాలెన్స్ చేయాలి. పళ్ళతో తీగలను కదిలించాలి. ఎంతో కష్ట పడి ఈ విద్య నేర్చుకున్న పంకజాక్షి రామాయణం మహాభారతాలను కూడా తోలుబొమ్మలాట ద్వారా వివరించేది.
కాలక్రమంలో ఈ కళలో కూడా చాల మార్పులు వచ్చాయి. బొమ్మలకు కర్రలను అమర్చి ఆడించేవారు. పెళ్లయిన తర్వాత పంకజాక్షి భర్తే తోలుబొమ్మలను తయారు చేసేవాడు. ఈ ప్రక్రియలో కథ ఎంపిక, బొమ్మల తయారీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, షో మొత్తం ఆసాంతం ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించడం.. ఇలా ఇవన్నీ పంకజాక్షి కుటుంబమే చేసేది. అందుకే ఈ క్లిష్టమైన కళను ఈ ఒక్క కుటుంబం మాత్రమే ఇప్పటివరకూ కొనసాగిస్తూ వస్తోంది.
ఇప్పటికే వయసు పైబడటం … ముందు పళ్ళు ఊడిపోవడం …అనారోగ్య సమస్యలతో పెద్దమ్మ పంకజాక్షి ఇబ్బంది పడుతోంది. వంశపారంపర్యంగా వస్తున్న తోలుబొమ్మలాట అంతరించి పోతుందనే ఆందోళన ఆ కుటుంబంలో మొదలైంది. దాంతో ఆమె వారసత్వాన్ని కొనసాగించేందుకు మనవరాలు 22 ఏళ్ల రెంజెనీ ముందుకు వచ్చింది.
రెంజినీతో పాటు… మరో ముగ్గురు కజిన్స్ కూడా ఈ విద్యను నేర్చుకునేందుకు సిద్ధమైనా.. వారంతా ఏకాగ్రత చూపలేక మధ్యలోనే మానేసారు.అమ్మమ్మ వారసత్వాన్ని మనవరాలు రెంజనీ మాత్రం కొనసాగిస్తూ.. ఆ కళను, ఆ కళతో బామ్మ సంపాదించుకున్నప్రతిష్టను కాపాడుతోంది.
మనవరాలి లో తనను తాను చూసుకుంటూ పెద్దమ్మ పంకజాక్షి మురిసిపోతున్నది. రేంజెనీ కూడా మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రేక్షకుల మన్ననలందుకుంటోంది. బి.కామ్ పూర్తి చేసుకుని.. బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్న మనవరాలు కూడా ఈ కళలో బామ్మను మించి పోయే సూచనలున్నాయి.
టెక్నాలజీ వచ్చాక తోలుబొమ్మలాట,నాటకాలకు ఆదరణ బాగా తగ్గిపోయింది. టీవీలు వచ్చాక సినిమాలకు వెనుకటి ఊపు తగ్గింది.ఓటీటీ లు వచ్చాక ఇంట్లోనే సినిమాలు వెబ్ సీరియల్స్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక ప్రాచీన కళ అంతరించి పోకుండా కాపాడుతున్నందుకు ఆ బామ్మను .. మనవరాలిని అభినందించాలి.