Still it is a Mystery…………………………………………………….
ఆ నదీతీరంలో చెల్లా చెదురుగా పడి ఉన్న వేయి శివలింగాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.అద్భుతం అనిపిస్తాయి. అక్కడికి అవి ఎలా వచ్చాయో ఎవరికి తెలీదు. ఇపుడు ఆ ప్రదేశం పుణ్య క్షేత్రం గా విరాజిల్లుతోంది. దీన్నే సహస్ర లింగ తీర్థం అని కూడా అంటారు. ఇది కర్నాటకలోని సిర్సి పట్టణానికి 10 కిమీ దూరంలో ఉంది. తమాషా ఏమిటంటే ఇలాంటి క్షేత్రమే కంబోడియా లో కూడా ఉంది. అక్కడ కూడా వేయి శివ లింగాలు ఒకే ప్రదేశంలో కనిపిస్తాయి.
కర్ణాటకలోని సిర్సిలో సహస్ర లింగాలు
సిర్సి పట్టణానికి దగ్గరలో ఉన్న శాల్మలా నది ఒడ్డున ఉన్న రాళ్ళపై ఈ శివలింగాలను చెక్కారు. 1678 —- 1718 మధ్య కాలంలో విజయనగర రాజ్యాన్ని పాలించిన సదాశివరాయలు ఈ వేయి లింగాలను ప్రతిష్టించారని అంటారు. ఇందుకు ఆధారాలు లేవని చెబుతారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి లింగానికి ముందు భాగంలో నంది ని కూడా చెక్కారు.
ప్రతి ఏటా మహా శివరాత్రి సందర్భంగా పూజ చేయడానికి భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. కొన్ని శివలింగాలు నది ఒడ్డున .. కొన్ని .. నది మధ్యన కొన్ని కనిపిస్తాయి. నీటి తాకిడికి ఇవి నది మధ్యలోకి చేరాయి అంటారు. ఈ లింగాలు అన్నిఒకే ఆకారంలో లేదా పరిమాణంలో ఉండవు. నది నీటి శక్తి కారణంగా ఈ లింగాలలో కొన్ని చెడిపోయాయి.
కొన్ని స్థానభ్రంశం చెందాయి. ఒకేసారి అన్ని లింగాలు కనిపించే అద్భుతాన్ని చూడాలనుకునే వారు నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడే ఈ ప్రదేశాన్ని సందర్శించాలి.ఎండా కాలం ..శీతాకాలం లో వెళితే మొత్తం లింగాలను చూడవచ్చు. సిర్సీ నుండి యల్లాపూర్ కు వెళ్లేదారిలో 17 వ కిలోమీటర్ దగ్గర ఈ సహస్ర లింగాల క్షేత్రం ఉంది. నది చుట్టూ అడవి ప్రాంతం. మామూలు రోజుల్లో ఎవరూ అక్కడికి వెళ్లరు.
ఈ శివలింగాలను ఎందుకు చెక్కించారు ? అలా ఎందుకు వదిలేశారు ? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. స్థానికంగా పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ మిస్టరీ అలానే ఉండి పోయింది.
కంబోడియా లో వేయి శివలింగాలు
సిర్సి శివలింగాల తరహా లోనే కంబోడియా లో సీమ్ రీప్ వద్ద వేయి శివలింగాలు ఉన్నాయి. వీటిని ఎవరు చెక్కించారు ? వాటి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అన్న విషయాలు ఎవరికి తెలీదు. ఇక్కడ సహస్ర లింగాలను కేబాల్ స్పీన్ అని కూడా పిలుస్తారు. 1969లో జీన్ బౌల్‌బెట్ అనే శాస్త్రవేత్త వీటిని కనుగొన్నాడు.
కంబోడియన్ అంతర్యుద్ధం కారణంగా అప్పట్లో ఈ ప్రదేశాన్ని ఎవరూ సందర్శించ లేకపోయారు. ప్రస్తుతం పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటి గా మారింది. ఇండియా వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయం గా పరిగణించే అంకోర్ వాట్ నుంచి ఈ సహస్ర లింగ క్షేత్రం 25 కి.మీ.దూరంలో ఉంటుంది.
ఇక్కడ కూడా ఒక నది మధ్యలో వేయి చెక్కిన లింగాలు కనిపిస్తాయి.అయితే ఈ ప్రదేశాన్ని పుణ్యక్షేత్రం గా అక్కడ పరిగణించరు. కేవలం ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం గానే చూస్తారు. ఈ లింగాలను ఎప్పుడు చెక్కారు ? ఎవరు చెక్కారు ? వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి అనే దానిపై వాస్తవిక సమాచారం అందుబాటులో లేదు. అక్కడి ప్రజలు ఈ లింగాలను సృజనాత్మక శక్తికి చిహ్నాలుగా భావిస్తారు. శివలింగాల మీదుగా ప్రవహించే నీరు పొలాలకు చేరుతుందని..భూములను సారవంతం చేస్తుందని నమ్ముతారు.
ఇదిలా ఉంటే ఆ మధ్య నదీ గర్భంలో రాతితో చెక్కిన శివలింగాల చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. కర్ణాటకలోని శివకాశీ నదిలో నీటిమట్టం తగ్గిన తర్వాత లక్షలాది శివలింగాలు దర్శనమివ్వడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అనే శీర్షికతో ఆ చిత్రాలు వైరల్‌గా మారాయి.అయితే ఇదంతా బోగస్ అని తర్వాత తేలింది. సిర్సి సహస్ర లింగాల చిత్రాలనే మార్ఫింగ్ చేసి అలా ప్రచారం చేసారని ఇండియా టుడే ఒక కథనం లో రాసుకొచ్చింది.
————-KNM