A dedicated person………………………………..
పై ఫొటోలో మనకు కనిపిస్తున్నది జస్టిస్ చంద్రు. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందుతున్న జై భీమ్ సినిమా కథలో అసలు హీరో ఈయనే. జస్టిస్ చంద్రు న్యాయవాదిగా చేస్తున్న సమయంలో ఇరుల గిరిజన సమాజానికి చెందిన సెంగాని అనే మహిళ చేసిన పోరాటాలకు అండగా నిలిచి .. ధైర్యంగా న్యాయ పోరాటం చేసింది ఈయనే. నాటి పోరాట కథనే జై భీమ్ సినిమా గా తెరపై కెక్కించారు.
సినిమాలో ఈ పాత్రను హీరో సూర్య పోషించారు, నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. జస్టిస్ కె. చంద్రు తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలో జన్మించారు. జై భీమ్ లో హీరో సూర్య పాత్రకు ప్రేరణ జస్టిస్ కె చంద్రు నిజ జీవితంలో వాదించిన కేసులే. జస్టిస్ చంద్రు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన న్యాయవాదిగా మంచి పేరు సంపాదించారు.
1993లో జస్టిస్ కె చంద్రు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వృద్ధాచలం లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా జైభీమ్ సినిమా తీశారు. ఆ కేసు తర్వాత జస్టిస్ చంద్రు మద్రాస్ హైకోర్టు జడ్జి గా కొంతకాలం పని చేశారు. పదవీ విరమణ తర్వాత ఆయన చెన్నైలో నివసిస్తున్నారు. జస్టిస్ చంద్రు తన పదవీ కాలంలో 96 వేల కేసులను పరిష్కరించారు. సగటున న్యాయమూర్తిగా ఆయన రోజుకు 75 కేసులు వినేవారు. ఎంతో ప్రణాళిక బద్ధంగా .. సిబ్బంది సహకారంతో అన్ని కేసులను హ్యాండిల్ చేశానని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రు చెప్పుకొచ్చారు.
ఆ ఇంటర్వ్యూ లో కొన్ని ముఖ్యఅంశాలు.
@ ఇటీవల జై భీమ్ సినిమా చూసా.. సినిమాలో న్యాయవాది పాత్ర తీరు తెన్నులు .. డైలాగులు .. కోర్టు దృశ్యాలు 30 ఏళ్ల క్రితం నా జీవితాన్ని గుర్తు చేశాయి.
@ సాధారణ పరిస్థితుల్లో బాధితులు ఎలాంటి శిక్షణ లేకుండానే సంఘటనల క్రమాన్ని చెబుతారు. లాయర్లు వారి కథకు మసాలాను జోడించడం ప్రారంభిస్తే మటుకు వారు గందరగోళానికి గురవుతారు.
@ గిరిజన మహిళ సెంగాని తన భర్త అదృశ్యానికి దారితీసిన సంఘటన గురించి చెప్పిన విషయాలను రికార్డ్ చేసాను. దాని ఆధారంగా కేసును సిద్ధం చేసాను. ఆమె స్టేట్‌మెంట్‌ను చదివి ఆమెకు వినిపించాను. ఆమె ధృవీకరించాకనే కోర్టుకు వెళ్ళాం. ఆమెను కోర్టు బోనులో నిలబెట్టినప్పుడు ఆమె తన పిటిషన్‌లో ఉన్న విషయాన్ని యధాతధంగా మొత్తం చెప్పింది.
@ కోర్టుల్లో పేదలు .. బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతికూల వాతావరణాన్నిధైర్యంగా ఎదుర్కోవాలి . మేము అలాగే ఎదుర్కొన్నాము.
@ అటువంటి ధైర్యసాహసాలతో పాటు, కొంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేసాం. మా పరిమితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. న్యాయస్థానానికి వెళ్లే ముందు కేసు వివరాలు పూర్తిగా తెలుసుకుని .. సంతృప్తి చెందినప్పుడు మాత్రమే కేసు చివరి వరకు పోరాడాలనే నమ్మకం వస్తుంది.
@ న్యాయ వాద వృత్తి లో ఉన్న వారికి సిక్స్ ప్యాక్ బాడీ అవసరం లేదు. ఆరు ఔన్సుల మెదడును షార్ప్ గా ఉంచుకుంటే చాలు. యువ న్యాయవాదులకు ఇదే సలహా ఇస్తాను.
@ నేను న్యాయవాది కావాలని కలలో కూడా అనుకోలేదు. నేను వామపక్ష ఉద్యమ విద్యార్థిని. గ్రాడ్యుయేషన్ తర్వాత సమాజ సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. తమిళనాడు అంతటా పర్యటించాను, విభిన్న వ్యక్తులతో కలిసి జీవించాను. ఆ తర్వాత లా చేసాను. విద్యార్థి గా ఉన్న రోజుల్లో కేంద్రం ఎమర్జెన్సీ (1975-1977) ని విధించింది. చాలా మంది ప్రజలు వారి రాజ్యాంగ హక్కులను కోల్పోయారు. ఆ దశలోనే ప్రజల హక్కులను సాధించుకోవడానికి చట్టాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను.