చైనా తో భారత్ యుద్ధానికి సిద్ధమౌతున్నదా ? అంటే అవుననే చెప్పుకోవాలి. వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియా అప్రమత్తమై క్షిపణి బలాలను సిద్ధం చేసుకుంటోంది. తాజాగా న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రం 1ను రెడీ చేసుకుంది. దీనిని గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తునుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి తో శత్రుదేశాల గగన తల రక్షణ వ్యవస్థను దెబ్బకొట్టవచ్చు. రుద్రం 1 తో వాయుసేన మరింత బలోపేతమైనట్టే.
ఈ మిసైల్ ను డీఆర్డీవో పరీక్షించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్దీ రోజుల క్రితం స్మార్ట్ టార్పీడో మిస్సైల్ ను కూడా భారత్ రెడీ చేసుకుంది. ఏ క్షణం లో ఏ ముప్పు వాటిల్లుతుందో అని భావించి ముందు జాగ్రత్తగా అమ్ముల పొదిని భారత్ సిద్ధం చేసుకుంటోంది. సుఖోయ్ 30 ఏం కె ఐ యుద్ధ విమానాల ద్వారా ఈ రుద్రం 1 మిస్సైల్ ను ప్రయోగిస్తారు. 250 కిలో మీటర్ల పరిధిలో శత్రు దేశం రేడియేషన్ ను ప్రయోగించి ఉంటే దాన్ని నిర్వీర్యం చేస్తుంది. ధ్వని కన్నా రెట్టింపు వేగంతో ఈ మిస్సైల్ దూసుకెళ్తుంది. అందుకే దీన్ని వ్యూహాత్మక యాంటీ రేడియేషన్ మిస్సైల్ గా పిలుస్తున్నారు. భారత్ కి ఈ మిస్సైల్ పెద్ద ఆయుధం. ఇది శత్రుదేశాల రాడార్లను , ఇతర నిఘా వ్యవస్థలను దెబ్బ తీస్తుంది.
ఇప్పటికే నాలుగు క్షిపణులను పరీక్షించిన భారత్ నిర్భయ మిస్సైల్ ను చైనా సరిహద్దులకు తరలించింది. మరో వైపు 700 కి. మీ లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న శౌర్య క్షిపణులను ఉపయోగించటానికి అనుమతులు మంజూరు అయ్యాయి. వీటితో పాటు హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోనిస్ట్రేటర్ వెహికల్ ను కూడా వినియోగిస్తున్నారు. ఈ వెహికల్ సుదూర లక్ష్యాలను ఛేదించే క్రూజ్ క్షిపణులు, హైపర్ సోనిక్ క్షిపణులను తరలించేందుకు ఉపయోగపడుతుంది. కాగా 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్ నుంచి భారత్ రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కొనుగోలు చేసిన మొత్తం 36 యుద్ధ విమానాల్లో 5 విమానాలు ఇప్పటికే భారత్ వాయు సేన అమ్ములపొదిలో చేరాయి. మిగిలిన విమానాలు కూడా త్వరలో వస్తాయి.
ఇక రాఫెల్ యుద్ధ విమానాలతో శత్రు సైన్యాన్ని వణికించే సత్తా మన వాయు సేన కున్నది. శత్రువు పసిగట్టేలోగా మెరుపు వేగంతో దాడులు చేయగల రాఫెల్ యుద్ధవిమానాలు ఇండియా అమ్ముల పొది బలాన్ని ఇనుమడింప జేస్తాయి. ఇవి కాకుండా మరి యుద్ధ విమానాలు కూడా భారత్ వద్ద ఉన్నాయి. అన్నివిధాలా చైనా కు చెక్ చెప్పేందుకు అవసరమైన ఆయుధ సామాగ్రిని ఇండియా సమకూర్చుకుంటోంది.
ఇక సరిహద్దుల్లో పాకిస్థాన్ చైనా సేనలు మోహరించి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. అపుడపుడు కవ్విస్తున్నాయి. చైనా కూడా తన యుద్ధ విమానాలను టిబెట్ ప్రాంతాలకు తరలించింది. మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే బోర్డర్ లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా అనే సందేహాలు లేకపోలేదు. అంత మాత్రాన యుద్ధం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జవాబు చెప్పలేము. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది కాబట్టి ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. ఈ క్రమంలోనే ముందు చూపుతో భారత్ యుద్ధానికి సన్నద్ధం కావడంలో తప్పేమి లేదు.
———— KNMURTHY
2024 లోపల , రాజకీయంగా మోదీ గారు వీక్ అయితే యుద్ధం రావొచ్చు !