Taadi Prakash ………………………
ఆశయాన్ని చంపే క్షిపణి ఎన్నటికీ పుట్టదు…. Confessions of an economic hit man
అమెరికన్ ఏజెంట్ జాన్ పెర్కిన్స్ రాసిన పుస్తకం మీద రాసిన సమీక్ష ఇది.
*** *** ***
In the midst of death, life persists… In the midst of untruth, truth persists …… In the midst of darkness, light persists
గాంధీజీ అన్న ఈ మాటలు – జాన్ పెర్కిన్స్ పుస్తకం చదవడం పూర్తి చేయగానే నా కన్నీటి తడిలో మెరిశాయి. వేదనా? విజయమా? విభ్రమమా? వైరాగ్యమా? – ఏదీకాదు. ఇన్నాళ్లూ, ఇన్ని దశాబ్దాలూ చదివిందీ, నమ్మిందీ, అనుమానించిందీ, కోపంతో రగిలి పోయిందీ అంతా నిజమేనని అమెరికా వాడే చెబుతున్నాడు. స్వార్థంతో కాదు. ఎత్తుగడా కాదు. పశ్చాత్తాపంతో.
పెర్కిన్స్ రాసిన పుస్తకం నన్నయితే కుదిపేసింది.
హంతకుడూ వాడే. పోలీసూ వాడే.
శవాన్ని కోస్తున్నదీ వాడే,
పోస్టుమార్టం రిపోర్టు రాస్తున్నదీ వాడే!
ఒక్క అమెరికా మాత్రమే చేయగల పని ఇది.
ఒక అమెరికన్ మాత్రమే రాయగల పుస్తకమిది.
ఇంత కిరాతకానికి ఒడిగడుతున్నది అమెరికాయేనని ఇంకెవరన్నా ఎన్ని రుజువుల్తో రాసినా వాడు కమ్యూనిస్టనో, నక్సలైటనో, టెర్రరిస్టనో కొట్టిపారేసేవారు. పెర్కిన్స్ అమెరికన్ మాత్రమే కాదు, చొక్కా ప్యాంటు వేసుకుని చిరునవ్వుతో మనల్ని పలకరించే, మనతో టీ తాగే అమెరికన్ ఏజెంట్. బాగా చదువుకున్న, బాగా తెలివిమీరిన సీక్రెట్ సీరియల్ కిల్లర్. జాక్ ది రిప్పర్ పెద్దన్న. అయితే కొద్దిమంది మనుషుల్ని చంపడం ఇతని పనికాదు.
అది చాలా చవకబారు యవ్వారం. దేశాలకు దేశాల్నే కుక్కల్ని చేసి అమెరికా పాదాలు నాకేలా చేయగల అసామాన్యుడు పెర్కిన్స్. మేరియో పూజోకి మాఫియా మాత్రమే తెలుసు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కి సస్పెన్స్ సినిమా తీయడం మాత్రమే వచ్చు.
జేమ్స్ బాండ్ ది ఒట్టి వెండితెర బడాయే. పెర్కిన్స్ అలా కాదు. అతను కత్తి దూయడు. తుపాకీ పేల్చడు. ప్రేమతో నిన్నూ , నీ దేశాన్నీ కావలించుకుంటాడు. అందమైన అభివృద్ధి ముసుగులో నిన్ను నిలువెల్లా ఆక్రమిస్తాడు.
అతను డాలర్ డ్రాక్యులా. రక్తపింజరి. పనామా నుంచో, ఈక్వడార్ నుంచో అమెరికాకి పైప్ లైన్లు వేస్తాడు. నీ ఎర్రని రక్తాన్ని మాతృదేశానికి కానుకగా పంపిస్తాడు. పైగా అది పెట్రోలని వాళ్ళని నమ్మిస్తాడు. చివరికి నీ దేశాన్నే అమెరికాకి అమ్మిస్తాడు.
ఇంత చేసిన వాడికీ మనసుంటుందా? మనిషేగా! ఇంత కిరాతకుడికీ కరుణ ఉంటుందా? ఉంటుందనే కదా రుజువయ్యింది ఈ గొప్ప పుస్తకంలో.
*** *** ***
” 2001, సెప్టెంబర్ 11న ఆ రెండు టవర్లు కూలిపోయాయి. నేను గ్రౌండ్ జీరో లోకి వెళ్లాను. అక్కడ నిలబడితే, కాలిపోయిన మానవ మాంసం వాసన.పొగ ఇంకా లేస్తూనే ఉంది. అప్పటిదాకా నేను ఈ పుస్తకం రాయడాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాను. ఇప్పుడిక రాయాలని నిర్ణయించుకున్నాను. గతంలో చేసిన పనులకు బాధ్యత వహించాలని నాకు తెలుసు. గ్లోబల్ సామ్రాజ్య నిర్మాణం కోసం నేనూ, నాతోటి ఎకనమిక్ హిట్మెన్లు చేసినదానికి ప్రత్యక్ష ప్రతిఫలమే సెప్టెంబర్ 11 దాడులు.
అది ఒక సామూహిక హత్యాకాండ. చేసినవాడు క్రూరమైన హంతకుడు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద పేరుకుపోయిన ఆగ్రహానికి ఈ దాడి ప్రాతినిధ్యం వహిస్తోంది. దురదృష్టవశాత్తూ ఒక్క పశ్చిమాసియాలోనే కాకుండా, లాటిన్ అమెరికా, ఇతర అనేక దేశాల్లో ఒసామా బిన్ లాడెన్ హీరో అయిపోయాడు. లాడెన్ ఈ స్థితిలో ఉండకూడదు. అసలు కథని అమెరికన్ ప్రజలకు చెప్పాల్సి ఉందని నాకు అర్థమయింది.
కార్పొరేట్ స్వామ్యం అంటే ఏమిటో అమెరికన్లకు తెలియజెప్పడానికి నిజాలు బయటపెట్టాలని అనుకున్నాను. అమెరికా విధానాల పట్ల అంత శత్రుత్వం ఎందుకుందో తెలియజేయాలనుకుంటున్నాను. మనం గనక దిశమార్చుకోకపోతే రాబోయే తరాల భవిష్యత్ అంధకారమవుతుంది. అసలేం జరుగుతుందో మనకు అర్థం అయినప్పుడు మాత్రమే దాన్ని మనం మార్చగలగుతాం” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు జాన్ పెర్కిన్స్.